Home News సైబర్‌ సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉండాలి

0
SHARE

అయిదో అంతర్జాతీయ సైబర్‌ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించినట్లు, యావత్‌ ప్రపంచానికి నేడు ప్రచ్ఛన్న శత్రువుల నుంచి నిరంతర పెనుదాడుల ముప్పు పొంచి ఉంది. పాతికేళ్ల క్రితం పుట్టిన అంతర్జాలమే కార్యస్థలిగా అంతకంతకూ పెచ్చరిల్లుతున్న సైబర్‌ నేరగాళ్ల దురాగతాలు దేశదేశాల్నీ వణికిస్తున్నాయి. లండన్‌, బుడాపెస్ట్‌, సియోల్‌, హేగ్‌ నగరాల్లో మేధోమథనం దరిమిలా ఈసారి విస్తృత సైబర్‌ సదస్సుకు దేశ రాజధాని వేదిక కావడానికి ప్రబల కారణమే ఉంది. నిరుడు అత్యధికంగా సైబర్‌ దాడులకు గురైన పది దేశాల జాబితాలో జపాన్‌, చైనాల తరవాత నిలిచింది ఇండియాయే! ఇప్పటికీ పది నిమిషాలకొక సైబర్‌ నేరం చోటుచేసుకుంటున్న దేశం మనది. తరతమ భేదాలతో దేశదేశాల్లో అంతర్జాల ఉగ్రవాదుల వికృత కేళి రెచ్చిపోతున్న దృష్ట్యా, ఈ దురాగతాలకు కలిసికట్టుగా అడ్డుకట్ట వేయాలన్న ప్రధాని మోదీ సూచనను సదస్యులు సహర్షంగా స్వాగతించారు. డిజిటల్‌ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణాన వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్‌ లావాదేవీల విశ్వసనీయతకు ఢోకా లేకుండా కాచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల భుజస్కంధాలపైనే ఉందనడంలో మరో మాట లేదు. భిన్న సామాజిక వర్గాల నడుమ డిజిటల్‌ అగాథాన్ని పూడ్చటంతోపాటు సైబర్‌ భద్రతా చర్యల పరిపుష్టీకరణకు రాజకీయ నిబద్ధత అత్యావశ్యకమని నూట ముప్ఫైకిపైగా దేశాల ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ సదస్సు ఎలుగెత్తింది. సైబర్‌ నేరాలపై పటిష్ఠ పోరుకోసం అంతర్జాతీయ శాసన నిబంధనల కూర్పు తక్షణావసరమన్న సూచనల వెలుగులో ఇప్పుడిక ఉమ్మడి వ్యూహం పదును తేలాలి. సమష్టి పోరాటానికి పిలుపిచ్చిన భారతావనే తక్కిన సైబర్‌ నేర బాధిత దేశాలను కూడగట్టి కదనకాహళి మోగించేందుకు చొరవ చూపాలి!

ఆరు నెలల క్రితం ఎకాయెకి లక్షా ముప్ఫైవేల మాల్‌వేర్‌ దాడులు బ్రిటన్‌, రష్యా, భారత్‌, ఇటలీ, ఈజిప్ట్‌ తదితర దేశాలెన్నింటినో దిమ్మెరపరచాయి. ‘వాన్నక్రై’ కంప్యూటర్‌ వైరస్‌ సృష్టించిన విధ్వంసం మరుగున పడకముందే ‘పెత్య’ సంక్షోభం విరుచుకుపడింది. భారత్‌లాంటి దేశాలకు అటువంటి సవాళ్ల తీవ్రతను నిభాయించే సన్నద్ధత కొరవడిందని బ్రిటిష్‌ సైబర్‌ భద్రతా సంస్థ ‘సోఫోస్‌’ ఇటీవలే విశ్లేషించింది. అటువంటప్పుడు సుస్థిరాభివృద్ధి సాధనలో సుభద్ర సమ్మిళిత సైబర్‌ స్పేస్‌ పరికల్పన సాధ్యాసాధ్యాలపై సిద్ధాంతచర్చలకే బాధిత దేశాలు పరిమితమైతే ప్రయోజనం ఉండదు. దేశీయంగా సైబర్‌ దాడుల కట్టడికి సర్కారీ కేటాయింపులు అరకొరేనన్న అసోచామ్‌, పీడబ్ల్యూసీ సంయుక్త అధ్యయనం- మార్పు ఎక్కడ మొదలుకావాలో ఇప్పటికే స్పష్టీకరించింది. మాల్‌వేర్‌ను చొప్పించి కంప్యూటర్‌ను అదుపులోకి తీసుకుని, వసూళ్లకు తెగబడటమే కాదు. ‘బ్లూటూత్‌’ ద్వారా స్మార్ట్‌ఫోన్లలోని సమాచారాన్ని తస్కరిస్తున్న ఉదంతాలూ కొన్నాళ్లుగా జోరెత్తుతున్నాయి. భారతీయ సంస్థలు ఏటా కనీసం రూ.40వేల కోట్ల మేర నష్టపోతున్నా ఫిర్యాదులు చేయకుండా మిన్నకుంటున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఒక్క 2015 సంవత్సరంలోనే 160కిపైగా ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని మూడు నెలల క్రితమే అధికారికంగా వెల్లడైంది. సైబర్‌ దాడులు ఇంతగా పోటెత్తుతున్న దశలో ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత వెక్కిరిస్తోంది. సైబర్‌ భద్రతా రంగంలో తగిన నైపుణ్యాలు కలిగినవారికి ఈ రెండేళ్లలోనే 20శాతం మేర గిరాకీ అధికమైనట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. 2025నాటికి మన దేశంలోనే 10 లక్షలమంది సైబర్‌ యోధులు కావాలి. ఆ మేరకు విప్పారుతున్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేలా కోర్సుల రూపకల్పన, పాఠ్యప్రణాళికల కూర్పు వడివడిగా వూపందుకోవాలి. సైబర్‌ చట్టాలను బలోపేతం చేయడంలో స్వీయ బాధ్యతనూ బాధిత దేశాలు గుర్తెరగాలి!

ముప్ఫై ఒక్క నెలల క్రితం హేగ్‌ నగరంలో నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ సైబర్‌ సదస్సు, పట్టపగ్గాలు లేని దాడులను ఎలా ఎదుర్కోవాలో ఇదమిత్థంగా సూచించకుండానే ముగిసిపోయింది. అందుకు భిన్నంగా కలిసి ఉద్యమిద్దామని పిలుపిచ్చిన తాజా సదస్సు పటుతర కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఆరని స్ఫూర్తి రగిలించాలి! రెండేళ్లనాటి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక ప్రకారం- సైబర్‌ భద్రతలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మలేసియా, ఒమన్‌, న్యూజిలాండ్‌ ముందున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) ఇటీవల రూపొందించిన 165 దేశాల సైబర్‌ భద్రత జాబితాలో సింగపూర్‌ అగ్రభాగాన నిలవగా, భారత్‌ ఇరవై మూడో స్థానానికి పరిమితమైంది. ఈ మందభాగ్యాన్ని చెదరగొట్టాలన్న పట్టుదలతో- డెన్మార్క్‌, మారిషస్‌, ఇరాన్‌లతో సైబర్‌ సహకార వారధి నిర్మాణానికి ఇండియా ఆసక్తి కనబరుస్తుండటం హర్షణీయ పరిణామం! ఇజ్రాయెల్‌ ఒకటిన్నర దశాబ్దాల క్రితమే సైబర్‌ నిపుణుల ఆవిష్కరణకు పకడ్బందీ ప్రణాళికలల్లిన తీరు, నేడెన్నో దేశాలకు విలువైన పాఠాలు నేర్పుతోంది. సైబర్‌ చొరబాటుదారులపై ఎదురుదాడికి పదిలక్షల సైన్యాన్ని సిద్ధపరచిన చైనా- హ్యాకింగ్‌కు ఆస్కారంలేని క్వాంటమ్‌ అంతర్జాల సృష్టిలో కీలక పురోగతి సాధించింది. సైబర్‌ నేరగాళ్లపై గెలవాలంటే ఏ దేశానికాదేశం పోరాడి లాభం లేదు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలు, నెట్‌ బ్యాంకింగ్‌ నేరాలు మొదలు వ్యవస్థలనే పాదాక్రాంతం చేసుకునే దాష్టీకాల దాకా తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగుతున్న సైబరాసురుల భరతం పట్టేలా- దుర్భేద్య యంత్రాంగాల నిర్మాణం నేటి అవసరం. అందుకు ప్రాణాధారమైన ఐక్యతా స్ఫూర్తిని ప్రజ్వరిల్లజేయడమే అంతర్జాతీయ సైబర్‌ సదస్సులు సాధించాల్సిన ఘనవిజయం!

(ఈనాడు సౌజన్యం తో)