Home News ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్‌ బృందం (‘వాసెనార్‌’) లో సభ్యత్వం పొందిన భారత్‌

ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్‌ బృందం (‘వాసెనార్‌’) లో సభ్యత్వం పొందిన భారత్‌

0
SHARE
  • 42వ సభ్యదేశంగా గుర్తింపు
  • రక్షణ సాంకేతికతల మార్పిడికి అవకాశం

ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్‌ బృందంలో భారత్‌ సభ్య దేశంగా చేరింది. గురువారం వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్‌ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అవసరమైన విధాన ప్రక్రియను పూర్తిచేసి ఆ కూటమిలో చేరిపోయానమని భారత్‌ శుక్రవారం ప్రకటించింది. వాసెనార్‌లో భారత్‌ సభ్యత్వం పొందడానికి సహకరించిన 41 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీచేసింది.

ఇందులో భారత్‌ చేరడం పరస్పర ప్రయోజనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ శాంతి, అణు వ్యాప్తి నిరోధక ప్రయత్నాలకు దోహదపడుతుందని వ్యాఖ్యానించింది. భారత్‌ చేరికతో ఈ బృందంలో సభ్య దేశాల సంఖ్య 42కి చేరింది. ఫలితంగా కీలక రక్షణ సాంకేతికతలను భారత్‌ ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది. అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్‌ స్థాయి పెరుగుతుంది. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది.

వాసెనార్, ఎన్‌ఎస్‌ఎజీ బృందాలకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్‌ కుమార్‌ అన్నారు. వాసెనార్‌లో భారత్‌ చేరిక అణు వ్యాప్తి నిరోధక రంగంలో మన క్లీన్‌ ఇమేజ్‌ను స్పష్టం చేస్తోందన్నారు. ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు వాసెనార్‌ బృందం కృషిచేస్తోంది. సభ్య దేశాలు ఆయుధాలు సేకరించి తమ సైనిక సామర్థ్యాలు పెంచుకోవద్దని నిర్దేశించింది. ప్రమాదకర అణు, జీవ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.