ఉగ్రవాద వ్యతిరేక పోరు కోసమంటూ నిధులు పొందుతున్న పాకిస్థాన్ తమను వంచిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్న అమెరికా ఎట్టకేలకు తన మాటలను కార్యరూపంలోకి తెచ్చింది. పాకిస్థాన్‌కు సుమారు రూ.1700 కోట్ల(255 మిలియన్ అమెరికన్ డాలర్ల) సైనిక సాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం స్వయంగా వెల్లడించింది. 2016 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన ఈ నిధులను పాకిస్థాన్‌కు ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతం తమకు లేదని శ్వేతసౌధ సీనియర్ అధికారి వెల్లడించారు. వాటి మంజూరు పాకిస్థాన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, తన భూభాగంపై ఉన్న ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఆ దేశంపైనే ఉందని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా తమ దేశం నుంచి నిధులు పొందుతున్న పాకిస్థాన్ అసత్యాలు చెబుతూ దారుణంగా మోసగిస్తోందని, అఫ్గాన్‌లో తమ చేతిలో గాయపడిన ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే శ్వేతసౌధం నిధులకు సంబంధించి ఈ స్పష్టత ఇవ్వటం గమనార్హం.
ఖండించిన పాక్: రెండు దేశాల మధ్యనెలకొన్న పరస్పర విశ్వాసాన్ని ట్రంప్ ఆరోపణలు దెబ్బతీశాయని పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని షాహిద్ అబ్బాసీ నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. ఉగ్రవాదంపై పోరుకు అమెరికాకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, తమ భూభాగాన్ని, గగనతలాన్ని, సమాచార వ్యవస్థలను, సైనిక స్థావరాలను అగ్రరాజ్యానికి అందుబాటులో ఉంచామని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్థాన్‌పై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే చైనా రంగంలోకి దిగింది. తన మిత్రదేశమైన పాకిస్థాన్‌ను సమర్థించుకుంది. ఉగ్రవాద పోరులో పాకిస్థాన్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొంది.
ఉగ్రవాదంతో పులిజూదం
శ్వేతసౌధాధిపతి డొనాల్డ్ ట్రంప్ ‘ట్వీటు’గా దూసుకొచ్చింది ముక్కుసూటి మాట కాదు- దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆడుతున్న కపట నాటకాన్ని నిలువునా చీరేసే తూటా! అగ్రరాజ్యం అవకాశవాదాన్ని, తన ఉగ్రవాద అసుర వేదాన్ని మిళాయించిన పాకిస్థాన్ కూటనీతి కారణంగానే ఉపఖండంలో ప్రచ్ఛన్నయుద్ధం ప్రజ్వరిల్లి వేలమంది అభాగ్యుల ప్రాణాల్ని కబళించడం- నేటికీ నడుస్తున్న రక్తచరిత్ర! ‘గత పదిహేనేళ్లుగా అమెరికా తెలివి తక్కువతనంతో పాకిస్థాన్‌కు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించింది. మన నేతల్ని వెర్రివెంగళప్పలుగా జమకట్టిన పాక్- అబద్ధాలు, నమ్మకద్రోహాన్నే ప్రతిఫలంగా బదులిచ్చింది. అఫ్గాన్‌లో మనం వేటాడుతున్న ఉగ్రమూకలకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోంది… ఇక చాలు’- అంటూ కొత్త సంవత్సరంలో ట్రంప్ చేసిన మొట్టమొదటి ‘ట్వీటు’ సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో తనకు ఎదురుగాలి జోరెత్తుతోందన్న సంగతి ఇస్లామాబాద్‌కు నిరుడే తెలిసి వచ్చింది. పాక్ ఆశ్రయంలోని ఉగ్రవాద శిబిరాల్ని ట్రంప్ వేలెత్తి చూపినప్పుడు, పాకిస్థాన్‌ను బలిపశువును చేసినంత మాత్రాన అఫ్గాన్‌లో శాంతిసుస్థిరతలు పాదుకోలేవని నిరుడు ఆగస్టులోనే అబ్బాసీ సర్కారు రుసరుసలాడింది. అఫ్గాన్‌లో తమకు తోడ్పాటు అందిస్తున్నందుకుగాను ఇస్లామాబాద్‌కు రూ.4,600 కోట్లను ప్రత్యేకించిన అమెరికా మొట్టమొదటిసారిగా ఆ నిధులకు, ఉగ్రసంస్థ లష్కరేపై చర్యలకు ముడిపెట్టింది. అమెరికా వేటాడుతున్న హక్కానీ నెట్‌వర్క్ సహా పాక్‌గడ్డపై కొలువుతీరిన 20 ఉగ్రవాద సంస్థలు, 75మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను విదేశాంగమంత్రి టిల్లర్‌సన్- అబ్బాసీ ప్రభుత్వానికి అందించినట్లు నవంబరులోనే వార్తలు వెలువడ్డాయి. తన భూభాగంలోని ఉగ్రస్థావరాలను పాక్ నిర్మూలించకుంటే ఆ పని తామే చేస్తామన్న సీఐఏ అధిపతి హెచ్చరికల నేపథ్యంలో- అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకున్న ప్రాధాన్యం ఎనలేనిది. పాకిస్థాన్‌కు వెన్నుకాస్తున్నట్లుగా చైనా దన్ను- మోహరిస్తున్న కూటముల మధ్య కొత్త కోలాటానికి తెరతీస్తోంది!
కశ్మీర్ వివాద పరిష్కర్తగా చరిత్రకెక్కాలనుకొంటున్నట్లు ప్రకటించిన ముషారఫ్- నిధుల్ని దారి మళ్ళించి ఉగ్రశక్తుల్ని అల్లారుముద్దుగా సాకానని కొన్నేళ్ల క్రితమే గొప్పగా చాటుకొన్నారు. కశ్మీర్‌కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమన్న ‘అజెండా’కే కట్టుబాటు చాటిన పాలకులంతా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదానికి నారూనీరూ పోసి తరించిపోతున్నారు. ఆ సంగతి బహు బాగా తెలిసినా- ఉగ్రవాదంపై పోరులో నాటోయేతర కీలక భాగస్వామిగా పాకిస్థాన్‌కు అమెరికా కిరీటధారణ చెయ్యడమే నగుబాటు. అఫ్గాన్ కదనక్షేత్రంగా అమెరికా, నాటి సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భౌగోళిక ప్రాధాన్యం దృష్ట్యా పాక్ అవసరాన్ని గుర్తించిన వాషింగ్టన్ ఆర్థిక, సైనిక తోడ్పాటును వ్యవస్థీకృతం చేసింది. అణ్వాయుధ సముపార్జనపై ప్రెస్లర్ సవరణ స్ఫూర్తినీ తుంగలో తొక్కి తనకు అనుకూలంగా పాక్ ఆడినన్నాళ్లు అక్కడి ఉగ్రవాద మిన్నాగుల బుసల్ని అమెరికా ఉపేక్షించింది. సెప్టెంబరు 11 దాడులతో భయానక ఉగ్రవాద తీవ్రత అనుభవంలోకి వచ్చి తత్వం బోధపడ్డాక కూడా, భారత్ సహేతుక వాదనల్ని పెడచెవిన పెట్టి పాకిస్థాన్‌ను ముద్దుచేసిన అమెరికాకు- అఫ్గాన్‌లో తగులుతున్న ఎదురుదెబ్బలతో ప్రాప్తకాలజ్ఞత కలుగుతోంది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లకు సహాయం నిలిపేయకపోతే ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ముద్రవేస్తామని అమెరికా హెచ్చరించాలని ఓ మేధో బృందం నిరుడు ఫిబ్రవరిలోనే ట్రంప్‌కు సూచించింది. జగమెరిగిన టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌పై ఈగైనా వాలకుండా చైనా సహకారంతో కాచుకొంటున్న పాకిస్థాన్- ట్రంప్ తాజా చర్యనూ తేలిగ్గా తీసుకొంటున్నా ఉగ్ర రాజకీయాల ముప్పు దాని నడినెత్తిన ఉరుముతోంది!
పాకిస్థాన్ స్థితిగతుల్ని అల్లా, ఆర్మీ, అమెరికాలు నిర్దేశిస్తుంటా యన్నది దశాబ్దాల అనుభవ సారాంశం. వైదొలగుతున్న అమెరికా స్థానాన్ని ఉగ్రవాదులు చేజిక్కించుకొంటే, ఏం జరుగుతుందో అగమ్యగోచరం. నిరుడు జులైలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుణ్ని చేసింది. నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేని సైన్యం ఆడుతున్న పాచికలాట నవాజ్ షరీఫ్ పుట్టి ముంచిందని విశ్లేషణలు ఎలుగెత్తుతున్నాయి. భుట్టోల సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రభావశూన్యమైపోవడం, అవినీతి ఆరోపణలతో షరీఫ్ పార్టీ కుంగుబాటు, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ)కు నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌పైనా అవినీతి మరకలతో పెను రాజకీయ అనిశ్చితి దోబూచులాడుతున్న వేళ- వచ్చే జులైలో పాక్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పేరిట పార్టీ పెట్టి అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి జమాతుద్ దువా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సకలం సిద్ధం చేసుకొంటున్నాడు. అతగాడి పార్టీకి గుర్తింపు నిరాకరించాలంటూ అబ్బాసీ ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటం ఒకవంక, టెర్రరిస్టుల్ని దేశభక్తులుగా వినుతిస్తూ వాళ్లతో కలసి పోటీకి ఆసక్తి చూపుతున్న ముషారఫ్ మరోవంక! ఎంఎంఎల్ గెలిచి అధికారానికి వస్తే ‘చట్టబద్ధంగానే’ అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేజిక్కినట్లవుతుంది. ఆ ముప్పును ఆలస్యంగా పసిగట్టి అమెరికా చిందులేస్తుంటే, విస్తరణ కాంక్షతో చైనా- పాకిస్థాన్‌కు రక్షణగా నిలుస్తోంది. ఈ రాజకీయ పులిజూదంలో భారత్ ప్రయోజనాలు ఏ దశలోనూ తెగటారిపోకుండా కాచుకోవడం మోదీ ప్రభుత్వ దక్షతకు పెద్ద పరీక్ష కానుంది!
(ఈనాడు సౌజన్యం తో)