Home News హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లను సమకూరుస్తున్న చిరుద్యోగి

హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లను సమకూరుస్తున్న చిరుద్యోగి

0
SHARE

సమాజానికి ఉపయోగపడే పని చేయాలంటే ఉద్యోగం, స్థోమత ఇవేమీ అక్కర్లేదని, తపన ఉంటే చాలని ఓ చిరుద్యోగి నిరూపించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ చౌరస్తాలో తన కండ్లముందే జరిగిన ఓ ప్రమాదంలో బాధితుడికి సకాలంలో ప్రథమ చికిత్స అందక అపస్మాకర స్థితికి చేరడం ఆయనను కలిచివేసింది. చౌరస్తాలో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ ఉంటే తీవ్రత తప్పేదని తనవంతు సహాయంగా ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నారు.

సెక్యూరిటీగార్డుగా తనకు వచ్చే జీతంలో నుంచి కొంత వెచ్చించి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కొనుగోలు చేసి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఆయనే రాచర్ల అశోక్. హైదరాబాద్ రాంనగర్‌లో ఉంటున్న అశోక్ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నారు.

గతంలో కింగ్‌కోఠి దవాఖానలో ఔట్‌సోర్సింగ్‌లో కాంపౌండర్‌గా చేసిన అనుభవంతో రూ.300ల్లో తయారయ్యేలా ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌కు రూపకల్పన చేశారు. ఇందులో ప్రథమ చికిత్సకు అవసరమ య్యే కాటన్ పీస్, కాటన్ రోల్, బెటాడైన్ మందు, స్పిరిట్ ఉంటాయి. తన జీతం నుంచి ప్రతి నెల రూ.300 వెచ్చించి ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లను నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటివరకు ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, రాంనగర్, లక్డీకాపూల్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశానని అశోక్ పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందట హిమాయత్‌నగర్‌లోని ఓ చౌరస్తాలో ఒక బైక్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి కాలుకు గాయమై తీవ్ర రక్తస్రావమైందన్నారు.108కు ఫోన్‌చేసినా త్వరగా చేరుకోలేదని, దీంతో తనతోపాటు రోడ్డుపై వెళ్తున్నవారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయామన్నారు. అతడిని ఓ ప్రైవేట్ వాహనంలో దవాఖానకు తరలించగా, అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పారు. చౌరస్తాలోనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే ఎంతో బాగుండేదని అనిపించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతో సహకరిస్తున్నారని, ఎవరైనా ఆర్థికంగా సహకరిస్తే హైదరాబాద్‌లోని అన్ని చౌరస్తాల్లో ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు.

Courtesy: Namaste Telangana