కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి కోటీశ్వరుడే కావాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలని నిరూపించాడు ఓ యాచకుడు. నిత్యం బిక్షాటన చేస్తూ తాను సేకరించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన ఓ యాచకుడు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఆలంకినారు గ్రామానికి చెందిన వాగబొండ్ పూల్ పాండియన్ (68), ఆర్థికంగా మంచి కుటుంబంలో జన్మించినప్పటికీ ఇద్దరు కుమారులు పట్టించుకోకపోవడంతో బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లాడు. చదువు లేకపోవడం, బ్రతుకుదెరువు మార్గం కనిపించకపోవడంతో చివరికి అక్కడే బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ సంవత్సరం, మార్చిలో కరోనా లాక్-డౌన్ కారణంగా తమిళనాడుకు వచ్చిన పాండియన్, లాక్-డౌన్ ఆంక్షల వల్ల మదురైలో చిక్కుకున్నాడు. స్థానిక కక్కల్ పాడినియార్ కార్పొరేషన్ బాలిక ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేశాడు. ఈ క్రమంలో అక్కడ తినడానకి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని చూసి చలించిపోయాడు పాండియన్. ప్రభుత్వం అందిస్తున్న సేవలను గమనించి, ఇంత వరకు తను బిక్షాటన చేసి జమ చేసుకున్న డబ్బును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదాని ప్రకారం జిల్లా కలెక్టరుని కలిసి తాను దాచుకున్న 20వేల రూపాయలు సొమ్ము ప్రభుత్వ నిధికి విరాళంగా అందించాడు.
దీనిపై పాండియన్ మీడియాతో మాట్లాడుతూ.. “నా కళ్ల ముందే ఎంతో మంది ఆకలితో అలమటిస్తుంటే సాయం చేయాలనుకున్నాను. మే 18న నేను జిల్లా కలెక్టర్‌కు రూ .10వేలు ఇచ్చాను. నవంబర్ 4న నేను 20వ సారి మధురైకి వచ్చినప్పుడు మరో రూ.10వేలు విరాళమిచ్చాను. మొత్తంగా ఇప్పటివరకు రూ.2లక్షల విరాళాన్ని ప్రభుత్వ సహాయ నిధికి అందజేశాను” అని తెలిపారు.
“తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ చిన్నతనంలోనే పాఠశాల మానేశాడు. కానీ అతను ఉచిత విద్యా పథకాన్ని అమలు చేశాడు. పేదరికంలో ఉన్న పిల్లలను చదువును ఆపేయడానికి మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు. లక్షలాది మంది నిరుపేద పిల్లలు విద్యను అభ్యసించడానికి కృషి చేశాడు. అతన్ని ఆధర్శంగా తీసుకుని ఈ సమాజానికి నా వంతు చేయాలనుకున్నాను. ఇప్పటివరకు నేను తూతుకుడి, తంజావూరు, పుదుకొట్టై జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మాట్స్, కుర్చీలు, బ్లాక్ బోర్డ్, స్టేషనరీ వస్తువులు, వాటర్ ప్యూరిఫైయర్లను కూడా విరాళంగా ఇచ్చాను.” అని తెలిపారు.
Source : ORGANISER