అండమాన్ నికోబార్ దీవిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదీవాసీ తెగ జరిపిన ఆత్మరక్షణ దాడిలో అమెరికాకు చెందిన క్రైస్తవ ప్రచారకుడు మృతిచెందాడు.
స్థానిక పత్రికను ఉటంకిస్తూ ఇండియా టుడే రాసిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అల్లెన్ చౌ క్రైస్తవ మతప్రచారం నిమిత్తం భారతదేశంలోని చెన్నై వచ్చాడు. అక్కడి నుండి క్రైస్తవ మతమార్పిళ్ల నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న అల్లెన్ చౌ.. అక్కడి అత్యంత అరుదైన సెంటినెల్లీస్ ఆదిమజాతి తెగకు చెందిన ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నం చేసాడు. ఇందుకోసం ఆ ప్రాంతాన్ని చేరేందుకు అండమాన్ లోని కొందరు సముద్రపు జాలర్ల సహాయం తీసుకున్నాడు. ఆదిమవాసులు నివాసం ఉండే ప్రదేశంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన మతప్రచాకుడిపై అక్కడ తమ ప్రాంతానికి కాపలా కాస్తున్న ఆదిమవాసులు విల్లంబులతో దాడి చేశారు. దీంతో కొంత దూరం పాటు పారిపోయి తప్పించుకున్న
చౌ అనంతరం ప్రాణాలు విడిచాడు.
అత్యంత దట్టమైన, సామాన్య ప్రజానీకానికి దూరంగా ఉండే ఈ దీవుల్లోకి ప్రవేశించడానికి అల్లెన్ చౌ గతంలో కూడా (నవంబర్ 14, 16వ తేదీల్లో) రెండు సార్లు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. అక్కడికి ప్రవేశించేందుకు అల్లెన్ చౌకి సహాయం చేసిన ఆరుగురు జాలర్లను కేంద్రపాలిత పోలీసులు స్థానిక గిరిజన తెగల పరిరక్షణ చట్టాల ప్రకారం అరెస్ట్ చేశారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతుల్లో సెంటినెల్లీస్ జాతి ఒకటి. ఈ తెగ ప్రజలు ఇతర తెగలతో ఏవిధమైన సమాచార సంబంధ బాంధవ్యవాలకు కూడా ఇష్టపడరు. ఈ తెగల పరిరక్షణ దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అత్యంత రక్షణాత్మక ప్రాంతంగా ప్రకటించి అక్కడకు ఇతర ప్రాంతాల ప్రజల రాకపై నిషేధం విధించింది.
ఇక తమ ప్రాంత పరిరక్షణ కోసం విల్లంబులు ధరించే వీరు ప్రధాన జీవన స్రవంతి నుండి వచ్చే వారిపై దాడికి పాల్పడటం సహజమైన విషయం. 2001 గణన ప్రకారం వీరి సంఖ్య 39 మంది కాగా అందులో 21 మంది పురుషులు, 18 మంది స్త్రీలుగా అంచనా. 2004లో వచ్చిన సునామీలో ప్రాణాలతో బయటపడిన అత్యంత అరుదైన ఆదిమ తెగల్లో వీరు ఒకరు.
ఇకపోతే.. భారతదేశంలో విదేశీయులు మతపరమైన కార్యకలాపాలకు చేయడం పాల్పడటం చట్టవిరుద్ధం. పైగా విదేశీయులు గిరిజన, ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ మినహా ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రక్షణాత్మక ప్రాంతాల్లో సంచరించకూడదు అన్న నిబంధన కూడా ఉంది.
చౌ గతంలో కూడా మతప్రచారం, మతమార్పిళ్ల నిమిత్తం పలుమార్లు భారతదేశం వచినట్టు తెలుస్తోంది.