Home News తెలంగాణ తొలితరం ఉద్య‌మ నేత మ‌డ‌త నారాయ‌ణ‌దాస్ అస్త‌మ‌యం

తెలంగాణ తొలితరం ఉద్య‌మ నేత మ‌డ‌త నారాయ‌ణ‌దాస్ అస్త‌మ‌యం

0
SHARE

తెలంగాణ తొలిత‌రం ఉద్య‌మ నేత, ఏబీవీపీ నాయ‌కుడు, సామాజిక కార్య‌కర్త, మడత నారాయణదాస్ (79) గారు మ‌ర‌ణించారు. కోవిడ్ తో భాగ్యనగర్లోని య‌శోధ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న శ‌నివారం (12.6.2021) రోజున పరమపదించారు. మ‌డత నారాయణదాస్ గారు వ‌రంగల్ అర్బన్ జిల్లాని ఒక కుగ్రామమైన రాంపూర్‌లో నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన శ్రీమతి కనకమ్మలక్ష్మీనర్సయ్య దంపతులకు 1942 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు. హైస్కూల్ చదువు వరంగల్ సంఘ కార్యాలయంలో ఉండి అప్పటి జిల్లాప్రచారక్ స్వ‌ర్గీయ కొచ్చి కృష్ణమూర్తిగారి మార్గదర్శనంలో పెరిగారు. ఉన్న‌త చదువులకై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA(హిందీ) చదువుతూ 1964 నుండి విశ్వవిద్యాలయ మండల కార్యవాహగా సంఘ పనిలో ఉన్నారు. శ్రీవన్నాల శ్రీరాములు, శ్రీచెన్నమనేని విద్యాసాగర్ రావు వంటి కార్యకర్తలతో ABVP ని ప్రారంభించి విద్యార్థి ప‌రిష‌త్‌లో గట్టి పునాదులు వేసిన వారిలో నారాయ‌ణ దాసు గారు ముఖ్యులు. రాడికల్ నక్సలైట్లతో ఆ రోజుల్లో జరిగిన అనేక పోరాటాల్లో ముందుండి విజయం సాధించారు. నారాయణదాసు గారు ఉస్మానియా యూనివర్సిటీ స్వయంప్రతిపత్తికై పోరాడి సాధించారు. 1970 వ‌ర‌కు ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగిన అనేక విద్యార్థి పోరాటాల‌కు ఇయ‌న నాయ‌క‌త్వం వ‌హించారు.

ఆ తర్వాత 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా నిలిచారు. 1975లో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి 13నెలలు మీసా బందీగా జైల్లో ఉన్నారు. అజన్మ బ్రహ్మచారిగా ఉండి ఆ తర్వాత జనతాపార్టీలో చురుకుగా కొంతకాలం పనిచేసి నారాయణదాసు గారు చివరి రోజుల్లో సేవాకార్యక్రమాలకు సహకరించారు. వరంగల్ జిల్లాలోని ఖిలా షాపూర్ శిశుమందిర్, హంటర్ రోడ్డులోని సేవాభారతి వానవాసీ వికాసకేంద్ర (హాస్టల్), తాడ్వాయిలో వానవాసీ కళ్యాణ పరిషత్ శ్రీ సమ్మక్క విద్యార్ధి నిలయాల భవనాల నిర్మాణానికి విరివిగా ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించారు. నారాయణదాసు గారు అనారోగ్యంగా ఉన్నా సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. నిరంతర కార్యాశీలిగా జీవనం సాగించిన వారి ఆత్మకు భగవంతుడు శాశ్వత ప్రశాంతిని ప్రసాదించాలని ప్రార్ధిద్దాం.