అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

    0
    SHARE

    అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ (86) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. వారణాసిలో వున్న పండితుల్లో ఈయనను అందరూ అగ్రగణ్యులుగా భావిస్తారు. ఆయన పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా. కానీ… కొన్ని తరాలుగా వీరు వారణాసిలోనే నివసిస్తున్నారు. ఈయన వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్‌ ఉపాధ్యాయులుగా పనిచేశారు.

    ఈయన అసలు పేరు ఆచార్య లక్ష్మీకాంత్‌ మధురనాథ్‌ దీక్షిత్‌. కర్మకాండలో అత్యంత నిష్ణతులుగా పేరు తెచ్చుకున్నారు. శ్రౌత, స్మార్త, యజ్ఞతో పాటు ఇతర సంప్రదాయాల్లో అత్యంత పండితులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీరి కుటుంబీకులు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కి అత్యంత సస్నిహితులుగా మెలిగినట్లు కొందరు శాస్త్ర పండితులు చెబుతారు. వీరి పూర్వీకుడు ఆచార్య గాగాభట్‌ 1674 లో హైందవీ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషెకాన్ని దగ్గరుండి మరీ నిర్వహించారని చెబుతారు. మరోవైపు లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ యజుర్వేదంలో గొప్ప పండితులు. తన మేనమామ, కాశీలో గొప్ప పండితులైన పండిట్‌ గణేష దీక్షిత్‌ భట్‌ దగ్గర లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ వేద విద్య అభ్యసించి, మంత్ర దీక్ష తీసుకున్నారు .