-ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగం
-నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
-పరిధి 5,000 కిలోమీటర్లు
-నావిగేషన్ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
-అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం
అగ్ని-5 క్షిపణి మరోసారి నిప్పులు ఎగజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.. నిర్ణీత మార్గంలో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆదివారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఖండాలను దాటుతూ 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం. అగ్ని సిరీస్‌లోని మిగతా క్షిపణులతో పోల్చితే సామర్థ్యంలోనూ, సాంకేతికపరంగా అగ్ని-5 ఎంతో అత్యాధునికమైనది. భారత అమ్ముల పొదిలో అగ్ని క్షిపణులది కీలక స్థానం. ఈ సిరీస్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఆదివారం విజయవంతంగా పరీక్షించారు.
ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో దీన్ని పరీక్షించారు. ఉదయం 9.45 గంటలకు లాంచ్‌ప్యాడ్-4 నుంచి దూసుకెళ్లిన అగ్ని-5 క్షిపణి నిర్ణీత మార్గంలో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్నది. ఐదువేల కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణిని పరీక్షించడం ఇది ఆరోసారి. అగ్ని సిరీస్‌లోని మిగతా క్షిపణులతో పోల్చితే ఇంజిన్, నావిగేషన్, వార్‌హెడ్, సాంతికేతిక వంటి అంశాల్లో అగ్ని-5 అత్యాధునికమైనదని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రయోగం విజయం పట్ల రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించారు.
అత్యాధునిక నావిగేషన్
క్షిపణి నిర్ణీత మార్గంలో ప్రయాణించి లక్ష్యాలను స్పష్టంగా ఛేదించేందుకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రింగ్ లేజర్ గైరో బేస్డ్ ఇంటీరియల్ నావిగేషన్ సిస్టం (ఆర్‌ఐఎన్‌ఎస్), మైక్రో నావిగేషన్ సిస్టం (ఎంఐఎన్‌ఎస్)ను అగ్ని-5లో పొందుపరిచారు. వీటితోపాటు అత్యాధునిక కంప్యూటర్లు, రాడార్ల సాయంతో నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
అత్యధిక వేగంతో లక్ష్యంవైపు..
అత్యధిక వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్లేలా అగ్ని-5ను రూపొందించారు. ప్రయోగించిన తర్వాత ఈ క్షిపణి నేరుగా ఆకాశంలోకి వెళ్తుంది. గరిష్ఠ ఎత్తుకు చేరిన తర్వాత అది భూమి వైపునకు తిరుగుతుంది. తిరిగి వచ్చేటప్పుడు భూమ్యాకర్షణ శక్తి వల్ల వేగం అనేకరెట్లు పెరుగుతుంది. అత్యధిక వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండే అత్యాధునిక కంపూటర్లు క్షిపణి నిర్దేశిత మార్గంలో వెళ్లేలా నియంత్రిస్తాయి.
బయట 4,000 డిగ్రీలు.. లోపల 50 డిగ్రీల వేడి
భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గాలితో రాపిడి వల్ల క్షిపణి ఉపరితలం 4,000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది. దీనిని తట్టుకునేందుకు అత్యాధునిక కార్బన్-కార్బన్ కంపోజిట్ హీట్‌షీల్డ్‌ను ఉపయోగించారు. ఇది బయటి వేడిని సమర్థంగా నిలువరించి క్షిపణి లోపల 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా చూస్తుంది. క్షిపణిలోని పేలోడ్‌ను కాపాడుతుంది.
ఆరో పరీక్ష..
అగ్ని-5 క్షిపణిని 2012 ఏప్రిల్ 19న మొదటిసారి పరీక్షించారు. రెండోసారి 2013 సెప్టెంబర్ 15న, మూడోసారి 2015 జనవరి 31న, నాలుగోసారి 2016 డిసెంబర్ 26న, ఐదోసారి ఈ ఏడాది జనవరి 18న పరీక్షించారు. ఇవన్నీ విజయవంతం అయ్యాయి. క్షిపణిని మొదటి రెండుసార్లు స్థిర లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించగా, తర్వాత జరిపిన మూడు పరీక్షలకు మొబైల్ లాంచ్‌ప్యాడ్‌ను వినియోగించారు. తాజా పరీక్ష ఆరోది.
ఆర్మీ చేతిలో నాలుగు అగ్ని క్షిపణులు
అగ్ని క్షిపణుల్లో నాలుగు రకాల క్షిపణులు ఇప్పటికే భారత సైన్యానికి అప్పగించారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం గల క్షిపణులను తయారు చేసి సైన్యానికి అప్పగిస్తున్నారు. అగ్ని-1 700 కిమీ లక్ష్యాలను.. అగ్ని-2 సామర్థ్యం 2వేల కి.మీలు కాగా, అగ్ని-3 సామర్థ్యం 2,500 కి.మీలు. అగ్ని-4 సామర్థ్యం 3,500 కి.మీ. తాజాగా అగ్ని-5 సామర్థ్యం 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని చేధిస్తుంది.
మరిన్ని ప్రత్యేకతలు
-ఈ క్షిపణుల జీవిత కాలం ఎక్కువ.
-నిర్వహణ వ్యయం తక్కువ.
-ఖచ్చితత్వం ఎక్కువ.
-ఎక్కడికైనా సులభంగా మోసుకెళ్లవచ్చు.
-చాలా తక్కువ సమయంలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు.
-మొబైల్ లాంచర్ సాయంతో ఎక్కడి నుంచైనా ప్రయోగించగలిగే అవకాశం ఉన్నది.
(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)