Home News సర్వ సమానత్వం‘’ఉమ్మడిస్మృతి‘ లక్ష్యం

సర్వ సమానత్వం‘’ఉమ్మడిస్మృతి‘ లక్ష్యం

0
SHARE
హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి  (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) తీసుకురావాలనే విశేష ప్రయత్నం వెనుక అందరికీ సమ న్యాయం అందాలనే ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ అంశం లేదని వక్తలు స్పష్టం చేశారు. ‘ఉమ్మడి పౌరస్మృతి’పై ‘జాగృతి’ వార పత్రిక వెలువరించిన ప్రత్యేక సంచికను జూన్ 30వ  తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ రాష్ట్ర   హైకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు ఆవిష్కరించారు.  హైకోర్టు సీనియర్ న్యాయవాది, అధివక్తా పరిషత్ అఖిల భారతీయ  అధ్యక్షులు  కె.శ్రీనివాసమూర్తి, హైకోర్టు న్యాయవాది  నీహారికా రెడ్డి…యూసీఐ ఆవశ్యకతను స్పష్టం చేశారు. యూసీసీ గురించి ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన చర్చకు మించి తాజాగా మరింత చర్చకు వచ్చిన ఈ అంశంపై ప్రజలకు మరింత  అవగాహన కలిగించేందుకు న్యాయనిఫుణులు, ప్రముఖుల  రచనలతో ‘జాగృతి’ ప్రత్యేక  సంచిక వెలువడడం అభినందనీయమని అన్నారు.

‘జాగృతి‘ వారపత్రిక సంపాదకుడు డాక్టర్ గోపరాజు నారాయణ రావు స్వాగతం పలికిన సమావేశంలో  రామచంద్రరావు ప్రారంభోన్యాసం చేస్తు, అందరికి అన్ని రంగాలలో  సమానత్వం కలిగేందుకు ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఎంత ఉంద న్నారు. ఒకే విధమైన ’నేరశిక్షా స్మృతి’తో పాటు అదే తరహా ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి అన్నారు.  ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సూచించారు. ఈ దీర్ఘకాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. విదేశాలలో ఎన్ని మతాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ చట్టం మాత్రం  ఒకటేనని, అదే విధానం మన దేశంలోనూ ఉండాలని అన్నారు.  ‘త్రిపుల్ తలాక్’ విధానం వీగిపోయినప్పడే  యూసీసీ సాధనకు  మార్గం సుగమమైనట్లు భావించాలన్నారు.

ఉమ్మడి పౌరస్మృతి సాధన అనేది  మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన జీవన్మరణ సమస్య అని, దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని శ్రీనివాసమూర్తి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధ సమాజంలో ‘వీటో’కు అవకాశం లేనందున   ఏం చేసినా చెల్లిపోతుందని, దానికి నిలువరించాలంటే పటిష్ఠమైన చట్టం తేవవలసిన అవసరం ఉందని అన్నారు. అందులోనూ ఆయా మతాచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా కొన్ని వెసులుబాట్లు కల్పించవచ్చని సూచించారు. పోర్చగీసు ఏలుబడి నుంచి బయటపడిన గోవాలో ఇప్పటికే యూసీసీ ఉండగా, తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసిందని చెప్పారు. విడిపోవాలనుకునే కేథలిక్ లకు (గోవా) విడాకులతో నిమిత్తం లేదని, అయినా గోవాలోని వారు ఉమ్మడి పౌరస్మతిని పాటిస్తున్నారని తెలిపారు. సమాజంలో వ్యక్తిగత స్వార్థకోసమే కొన్ని ఆచార సంప్రదాయాలు ప్రచారంలోకి తెచ్చారని, ‘సతి’, బాల్యవివాహాలు వంటివి అలాంటివేనని శ్రీనివాసమూర్తి అన్నారు.
చట్టంలోని వెసులుబాటును ఆసరాగా చేసుకుని కొందరు ప్రయోజనం పొందుతున్నారని,  అందుకు బహుభార్వత్వం  ఒక ఉదాహరణ అని  నీహారికా రెడ్డి అన్నారు.  ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు మతం మారుతున్నారని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించే వారు స్వార్థ ప్రయోజనాలు  చూసుకుంటున్నారు తప్ప మహిళ భద్రత గురించి ఆలోచించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బాధిత పిల్లలు, మహిళలకు న్యాయం జరగాలంటే  ఉమ్మడి పౌరస్మృతి అవసరమని అన్నారు.  తలాక్ తో విడాకులు తీసుకున్న మహిళలకు ఆర్ధిక భద్రత ఉండదని, షబానా ఉదంతమే అందుకు ఉదాహరణ అని అన్నారు. హిందుమతంలో కారణాంతరాల వల్ల  విడాకులు అనివార్యమైనా  ఆ మహిళలకు ఆర్థిక భరోసా ఉంటుందని, అదే  భద్రత ముస్లిం మహిళలకు  అందాలన్నది అందరి అభిప్రాయమని, అందుకు  యూసీసీ అనివార్యమని అభిప్రాయపడ్డారు. అది రావడంలో ఆలస్యమైనా  ప్రజాచైతన్యంతో సాధ్యమేనని అన్నారు. రాష్ట్రాలు ఆ  దిశగా స్పందించాలని అంటూ ఇప్పటికే గోవాలో  సివిల్ కోడ్ అమలులో ఉందని గుర్తు చేశారు.