Home News పర్యావరణ పరిరక్షణ కోసం అన్నీ సంస్థలు కలిసి పనిచేస్తాయి – దత్తాత్రేయ హోసబలే

పర్యావరణ పరిరక్షణ కోసం అన్నీ సంస్థలు కలిసి పనిచేస్తాయి – దత్తాత్రేయ హోసబలే

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ సమావేశాలు మూడు రోజులపాటు పుష్కర్ లో జరిగాయి. 36 సంస్థలకు చెందిన 195మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఎలాంటి తీర్మానాలు ఆమోదించలేదు. అలాగే ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ సంస్థలన్నీ స్వతంత్రమైనవి కనుక వాటి విధాన నిర్ణయాలు అవే తీసుకుంటాయి. ఇతరుల అనుభవాలు, నిర్వహించిన కార్యక్రమాల వివరాలు తెలుసుకుని వాటి నుంచి ప్రేరణ పొందడం కోసం మాత్రమే ఈ సమావేశాలు. గత ఏడాది మంత్రాలయంలో జరిగిన సమావేశాల్లో `చెట్లు పెంచడం – జల సంరక్షణ – ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి’ అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమం అన్ని సంస్థలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే సమాజంలో సంస్కృతిక విలువల క్షీణతను అరికట్టడం పైన కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ప్రయత్నం కూడా జరిగింది. ఈ విషయంలో చేపట్టిన కార్యక్రమాలు, పొందిన అనుభవాలను వివిధ సంస్థల ప్రతినిధులు ఈసారి సమావేశాల్లో వివరించారు.

సమావేశాల గురించి వివరాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పత్రికలవారికి తెలియజేశారు. రాగల రోజుల్లో మధ్య భారతంలోని గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఉపాధి, అభివృద్ధి, రాజ్యాంగ పరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధవహించాలని సమావేశాల్లో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో విద్యా, అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తగినవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ఈ విషయాన్ని తెలియచెప్పేందుకు అన్ని సంస్థలు జన జాగరణ కార్యక్రమాలు చేపడతాయి. ఈ ప్రాంత ప్రజల్లో జాతీయ భావాన్ని జాగృతం చేసేందుకు కూడా కృషి చేస్తాయి. జాతీయ పౌర జాబితా (ఎన్ ఆర్ సి) ఏర్పాటును స్వాగతించిన దత్తాత్రేయ హోసబలే, జాబితా తయారీలో బయటపడిన చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలన్నారు. రిజర్వేషన్ ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ రాజ్యాంగపరమైన రిజర్వేషన్ లను సంఘ్ సమర్ధిస్తుందని, సమాజంలో భేదభావాలు పూర్తిగా తొలగిపోయెవరకు రిజర్వేషన్లు కొనసాగాలని అన్నారు.

మూక దాడుల గురించిన ప్రశ్నకు సమాధానం చెపుతూ ఏ రకమైన హింసనైనా ఖండిస్తామని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించవలసిందేనని అన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ లో అధికరణం 370 తొలగించడం సరైన నిర్ణయమని, దీని పట్ల దేశమంతటా ఆనందం వెల్లివిరిసిందని ఆయన అన్నారు. ఇక ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి సాధించాలని అన్నారు. సంఘతోపాటు సంస్థలన్నీ ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక జెండా ఉండాలని చాలా కాలంగా కోరుతున్నాయి. కాశ్మీర్, లఢక్ ప్రాంతాల్లో సంఘ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నాయి. కాశ్మీర్ లో కొందరు రాజకీయ నాయకుల అరెస్ట్ లు జరిగాయి. ప్రభుత్వం తగిన ఆధారాలతోనే ఇలాంటి చర్యలు చేపట్టింది. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అధికారం కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించేవి.  

స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ స్వదేశీ జాగరణ్ మంచ్ చేపట్టిన ఉద్యమం మూలంగా చైనా వస్తువుల విక్రయాలు బాగా తగ్గాయి. అయితే స్వదేశీ భావన కేవలం ఉద్యమాలకే పరిమితం కాకూడదు.