హిందూ యువతితో పెళ్లి కోసం మతం మారేందుకు సిద్ధపడ్డ ముస్లింకి షాక్

    0
    SHARE

    హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు, మతం మారేందుకు సిద్ధపడిన ఒక ముస్లిం వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. అప్పటికే పెళ్లయిన అతను మొదటి భార్య వద్ద ఈ విషయం దాచాడు. ఇది తెలుసుకున్న ఆమె.. వెంటనే చంకలో పిల్లాడితో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన యూపీలోని మొరాదాబాద్‌లో జరిగింది. ఆమిర్ అలీ, గుల్ఫాషా బేగం భార్యాభర్తలు. వీరికి ఒక బాబు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో తన భర్త సడెన్‌గా మతం మార్చుకొని హిందువుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడని గుల్ఫాషాకు తెలిసింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం తెలిసిన ఆమె వెంటనే ఇంటి పెద్దలకు ఈ విషయం చెప్పింది.

    ఆమిర్‌కు 2014 నుంచి నేహా అనే ఇంజినీరింగ్ విద్యార్థినితో అక్రమ సంబంధం ఉంది. ఇలాంటి చెత్త వేషాలు వేయొద్దని గుల్ఫాషా అతన్ని హెచ్చరించింది. కానీ అతను మాట వినలేదు. ఆమెకు తెలియకుండా తన రాసలీలలు కొనసాగించాడు. అయితే నేహను పెళ్లి చేసుకుందామంటే తన హిందూ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరని ఆమె చెప్పింది. దీంతో తను మతం మార్చుకునేందుకు ఆమిర్ రెడీ అయ్యాడు. ఈ విషయం తెలిసిన గుల్ఫాసా.. ‘ఆమిర్‌కు హిందువులంటే అసహ్యం. అలాంటి వాడు హిందూ మతం ఎందుకు తీసుకుంటాడు? ఆ హిందూ పిల్లని పెళ్లి చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు. మా పెద్దవాళ్లకు చెప్తే మగాళ్లంతే అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాకు న్యాయం చేయండి యోగీ గారూ.. ఒక ఇంట్లో దీపం పెట్టేందుకు మరో ఇంటి దీపం ఆర్పేయకండి’ అని ఒక వీడియో చేసింది. ఇది వైరల్ అయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న అధికారులు.. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆమిర్‌ మతమార్పిడిని అడ్డుకున్నారు. దీంతో తనకు న్యాయం చేసినందుకు యోగీ ప్రభుత్వానికి గుల్ఫాషా ధన్యవాదాలు తెలిపింది. ‘ఈ కూతురికి న్యాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు యోగీ జీ’ అని ఆమె చెప్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.