పాడిపశువుల పోషణే జీవనాధారంగా ఉన్న రైతులకు పశుగ్రాసం లేకపోవడంతో ఆ మూగజీవుల భారంగా మారింది. కొందరు రైతులైతే ఉన్న పశువులను అమ్ముకుని ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లిపోయారు. అటువంటి రైతులకు భరోసా కల్పించే బాధ్యత చేపట్టింది సేవాభారతి స్వచ్చంద సంస్థ. రైతులకు ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేస్తున్నట్టు సేవాభారతి అనంతపురం జిల్లా ఆమడగూరు డివిజన్ కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పేర్కొన్నారు. మహ్మదాబాద్ పశువైద్యశాల వద్ద సేవాభారతి ఆధ్వర్యంలో జూన్ 8వ తేదీన ఉచిత దాణా పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో దాదాపు పదేళ్ల నుండి వర్షాలు లేకపోవడంతో ప్రజలు తాగడానికి కూడా బోరుబావుల్లో నీరు లేక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నోరు లేని మూగ జీవాలకు పశుగ్రాసం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల రైతులకు గడ్డి పంపిణీ చేయాలని పలుమార్లు రైతులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో తామే చొరవ తీసుకుని గడ్డి సరఫరాకు అవసరమైన మొత్తాన్ని సేవాభారతి ద్వారా చెల్లించినట్టు తెలిపారు.
అధికారులు స్పందించి దాణాను మహ్మదాబాద్ కు సరఫరా చేయడంతో రైతులను గుర్తించి గడ్డి పంపిణీ చేస్తున్నట్టు శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.
మండలంలోని కొట్టవారిపల్లి, కొత్తపేట, వెంకటనారాయణపల్లి, గుండువారిపల్లి, కంచరవాండ్లపల్లి, పూలకుంట్లపల్లి తదితర గ్రామాల నుండి 80 మంది రైతులకు ఒక్కొక్కరికి 7 బస్తాలు చొప్పున 15 టన్నుల దాణా సరఫరా చేసినట్టు తెలిపారు. సేవాభారతి మండల అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, బొట్టుస్వామి, లక్ష్మయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.