ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో నిర్మితమైన చర్చి వివరాలు ఫీల్డ్ లెవెల్ సర్వే చేపట్టి తమకు 5 రోజుల్లోగా అందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అన్ని జిల్లా విభాగాలను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ మతమార్పిడులు సాగుతున్నాయని, ఎస్సీ కులాలకు చెందిన సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి జరుగుతోందన్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, ఎస్సీ-ఎస్టీ రైట్స్ ఫోరమ్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన నివేదికపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మతమార్పిళ్ల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని, వాటి వివరాలు 15 రోజుల్లో తమకు సమర్పించాల్సిందిగా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులో కోరింది. లేని పక్షంలో తమకున్న విశేషమైన సివిల్ కోర్ట్ అధికారాలు ఉపయోగించుకుని తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని కూడా నోటీసులో పేర్కొనడం విశేషం.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘సర్వే’ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే మొత్తం 13 జిల్లాల అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓ మెమో జారీచేశారు. మునిపాలిటీలలో, మండలాల్లో ఎన్ని చర్చిలున్నాయో లెక్క తీయాలన్నారు. కొన్ని ఎస్సీ కాలనీలకు వెళ్లి వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నారా… క్రైస్తవం స్వీకరించారా? తెలుసుకోవాలని… ఐదు రోజుల్లోపు ఈ నివేదికలను అందించాలని ఆదేశించారు.
అభ్యంతరం వ్యక్తం చేసిన కమ్యూనిస్టులు:
ఎస్సీలకు దక్కాల్సిన హక్కులు, రిజర్వేషన్లు మతం మారిన క్రైస్తవులకు దక్కుతుండటంపై జరుపుతున్న ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించింది. ఈ ప్రక్రియ అనవసర వివాదాలకు తావిస్తోందని, ఇది ఎస్సీల్లో చీలికలు తీసుకువస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
సీపీఐ లేఖపై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం:
ప్రభుత్వం ప్రారంభించిన సర్వేపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)పై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు మతమార్పడుల ద్వారా ఎస్సీల సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి చేశారని, ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఇక కాలం చెల్లిందని, ఇలాంటి చర్యలు ఇకపై సాగనివ్వం అని ఫోరమ్ తమ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
మేము కూడా నివేదిక సమర్పిస్తాం: లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రకటన
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వాగతించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల అక్రమ చర్చిల వివరాలు తాము అధికారికంగా సేకరించాము. వీటిలో ఎస్సీ కాలనీల్లో నిర్మించిన అనేక చర్చిలు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎస్సీ కమిషనుకు అందజేసే నివేదికతో పాటు మేము కూడా తమ నివేదిక జాతీయ ఎస్సీ కమిషనుకు అందజేస్తాం అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పేర్కొంది.
Source : NIJAM TODAY