పవిత్ర శబరిమలలో కేరళ రాష్ట్ర పోలీసులు అయ్యప్ప భక్తులపై అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వర్షం పడుతున్న కారణంగా అయ్యప్ప భక్తులు అరవాణా కౌంటర్ వద్ద తలదాచుకుని ఉండటంలో ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హుకుం జారీచేశారు. వర్షంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి అని భక్తులు ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై భక్తులు అయ్యప్ప భజనల ఆలాపన ద్వారా నిరసన తెలియజేశారు. దీంతో అసంతృప్తికి గురైన పోలీసులు భక్తులను సామూహికంగా అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుండి బలవంతంగా పంపించివేశారు. పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన భక్తుల్లో చిన్నారులు, యాభై ఏళ్లకు పైబడిన మహిళలు కూడా ఉండటం గమనార్హం.
మొదట భజనలు చేస్తున్న అయ్యప్ప భక్తులను అవి ఆపాల్సిందిగా ఆదేశించారు. దీనిపై భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భజనలు ఆపకపోవడంతో పాటుగా హరివరాసనం కార్యక్రమం పూర్తయ్యేదాకా అక్కడి నుండి కదిలేది లేదని పట్టుదలగా వ్యవహరించారు. దీంతో సహనం నశించిన పోలీసులు హరివరాసనం పూర్తవగానే శాంతియుతంగా అయ్యప్ప భజన సంకీర్తనలు చేస్తున్న భక్తులను రెండు వాహనాల్లో పంపా సమీపంలోని ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసు క్యాంపుకి తరలించారు.
ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా హిందువులు నిరసనలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల ఎదుట శాంతియుతంగా భజన సంకీర్తనలతో నిరసనలు తెలియజేసారు. దేవస్థానం బోర్డు పద్మకుమార్ ఇంటి ఎదుట కూడా భక్తులు నిరసనలు చేపట్టారు.
Source: VSK Bharat