యాభై మంది పిల్లలకు
అతిథి మానసిక దివ్యాంగుల నిలయం నిర్వాహకురాలు సాంబరాజు సుజాత. అన్నీ సక్రమంగా ఉండే పిల్లలతో బడులు నిర్వహిస్తేనే తలనొప్పులు తప్పని పరిస్థితుల్లో ఇట్లా మానసిక దివ్యాంగులుగా ఉన్నవారిని చేరదీసి సేవ చేయాలనే ఆలోచన ఎవరిది? అసలీ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఆశ్రమం నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు మొదలైన అంశాలను సుజాత వివరించారు. మాది హన్మకొండ పట్టణం కుమార్‌పల్లి. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెల్లు. అందరి కంటే నేనే చిన్నదాన్ని. డిగ్రీ చదివాను. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా రాజమండ్రిలో చేశాను. 1996 వరకు నేను సాధారణ గృహిణే. ఇద్దరు ఆడపిల్లల తల్లినే. కానీ అప్పుడు హైదరాబాద్ నుంచి నా యేడాదిన్నర పాప (భవానీ), నాలుగునెలల పాపతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగాను. స్టేషన్ నుంచి ఆటోకోసం ఒక బిడ్డను చంకన ఎత్తుకొని, మరోబిడ్డను (భవానీ), అదేచేతిలో సంచినీ పట్టుకొని ఆటోకోసం బయటకు వస్తున్నాను. నాతోపాటే నా బిడ్డ వస్తున్నది అనుకొని వెళుతున్నాను. తీరా ఆటో ఎక్కేముందు భవానీ లేదు. తప్పిపోయింది. అక్కడంతా చూశాను. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి చూశాను. ఏడ్చాను. ఎంత వెతికినా పాప జాడ తెలియలేదు. ఏడ్చి..ఏడ్చి కళ్లల్లో నీళ్లింకిపోయే దాకా రోజూ ఏడుపే అందరూ ధైర్యం చెప్పారు.
బిడ్డ సంతోషం కోసం
ఎవరు ఎంత ధైర్యం చెప్పినా నా మనసులోని బాధ మాత్రం అలానే ఉంది. నాలోనే ఏడ్చేదాన్ని.. ఒక దశలో నాకు పిచ్చిపడుతుందేమో అనుకున్నారు. నా పరిస్థితి అలాగే తయారైంది. నాలో నేను కుమిలిపోయేదాన్ని. ఎవరు ఎన్నిరకాలుగా ధైర్యం చెప్పినా కళ్లముందు తిరిగే పాప. కాళ్లల్లో కాలువేసి నడిచే పాప. చేతిలో ఉన్న పాప ఒక్కసారిగా నా నుంచి దూరం కావడం అనేది నా జీవితంలో మరచిపోని, మరపురాని క్షణాలు. అందరూ అన్నారు. తప్పిపోయిన వారితో మనమూ పోలేం కదా..అని ధైర్యం చెప్పారు. చివరికి నేను గట్టి ధైర్యం చేసుకున్నాను. నా బిడ్డకు గుర్తుగా నేను ఏదన్నా చేయాలె అనుకున్న. అప్పుడు తట్టింది. ఈ ఆలోచన. అయితే సహాయం ఎవరైనా చేస్తారు. అది అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లకు ఎవరైనా చేస్తారు. కానీ తప్పిపోయినప్పుడు నా బిడ్డ అమ్మా.. అమ్మా.. అంటూ అపురూపంగా పిలిచే యేడాదిన్నర వయస్సే. ఎంత పెద్దపెరిగినా మానసికంగా ఎదగని పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి అనుకున్నాను. నా బిడ్డ తప్పిపోతే ఏంటీ. చిన్నప్పుడు నా బిడ్డకు తల్లిలా ఎన్ని చేశానో.. చేయాలనుకున్నానో అదేరీతిగా నా వంతు సహాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అలా పుట్టిన ఆలోచనల్లోంచే వచ్చింది మానసిక దివ్యాంగుల నిలయ స్థాపన నేపథ్యం. ముందుగా (2007) డే స్కారల్స్‌గా మొదలుపెట్టి, తరువాత సంవత్సరానికి డే అండ్ నైట్ అదే పూర్తి ఆశ్రమంగా ఏర్పాటు చేశాను. ఇప్పుడిందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి యాభై మంది ఉన్నారు. వీళ్లంతా నా పిల్లలుగానే భావిస్తున్న. నేను వీళ్లకు ఈ రకంగా సేవ చేస్తే నా బిడ్డ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ భగవంతుడికి మొక్కుతున్నా అన్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ
అనాథలు. అమ్మానాన్నలు వదిలించుకున్నవాళ్లు. తల్లి, తండ్రి చనిపోతే నానమ్మలు, అమ్మమ్మ ఆలనలో వారు చేయాల్సినంత వరకు చేసి వారి వయస్సు సహకరించక వారికి అన్ని సపర్యలు చేసే ఓపిక లేక ఉన్నవాళ్లు. తప్పిపోయి వచ్చినవాళ్లు ఉన్నార్లు. పిలగాడు పుట్టి కొంతకాలం అయిన తరువాత ఆ పిలగాడి చేష్టలు చూడలేక, భరించలేక, తీవ్ర అవమానభారంతో ఉంటూ చివరికి ఆ పిలగాడిని వదిలేసినవాళ్లు చాలామంది పిల్లలు ఇక్కడ కనిపిస్తారు.
తల్లికి విడాకులిస్తే, తల్లి మరో పెళ్లి చేసుకొని వెళితే ఎటువంటి ఆలనా పాలనా లేక నిరాదరణకు గురైన వాళ్లు.. కుటుంబాల్లో కలహాలు పెరిగి పెరిగి వదిలించుకున్న పిల్లలు ఇలా అనేక రకాల నేపథ్యాలున్న వాళ్లు ఇందులో ఉన్నారు. కాలకృత్యాలకు వెళ్లే స్పృహ లేకుండా అన్నీ బట్టల్లోనే పోయే పిల్లల్ని చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నది సుజాత.మా చేతుల్లో పెరిగి బయటికి వెళ్లిన తర్వాత పిల్లలు పెండ్లి చేసుకొని జీవిస్తున్నారు. ఒకరు జనరల్‌స్టోర్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లు.. హాస్టళ్లలో వేరేచోట్ల ఉపాధి పొందుతున్నవాళ్లను చూస్తే సంతోషంగా ఉంది. అలా ఆశ్రమం నుంచి బయటకు వెళ్లి ఉపాధి పొందుతున్నవాళ్లే స్ఫూర్తిగా ఇతరులకు చెప్తూ అదే స్ఫూర్తిని వాళ్లలో ఏర్పడేలా అతిథి ఆశ్రమం కొనసాగిస్తున్నది. దీనిని మరింత మందికి చేరువయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాం. వారి ఆనందమే మా అతిథి లక్ష్యం.
కంటికి రెప్పలా
వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌బొజ్జా ఉన్నకాలంలో ఆశ్రమం కోసం కొంత స్థలం కేటాయిస్తే కొంతమంది అధికారుల అలసత్వం వల్ల, సహాయ నిరాకరణ వల్ల అది రాకుండా పోయిందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఎన్ని కష్టాలైనా భరిస్తా..వీళ్లకు సేవ చేస్తే తప్పిపోయిన నా బిడ్డకు ఆ భగవంతుడు మంచిచేస్తాడన్న నమ్మకమే నన్ను నడిపిస్తున్నది. మానసికంగా పరిపక్వతను పెంచి సమాజం పట్ల అవగాహనను కలిగించి తాను 11 యేండ్ల్లుగా చేస్త్తున్న కృషికి ఫలితం.. పిల్లల రూపంలో ఫలితాన్నిస్త్తున్నదంటున్నారు.