గంధం పూయడం, కానుకల స్వీకరణపై అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్‌ నిషేధం

    0
    SHARE

    అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి నుంచి అక్కడి ఆచారాలు, పద్ధతుల్లో గణనీయ మార్పులు తీసుకురావడానికి కొన్ని కీలక మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇక నుంచి అర్చకులు భక్తుల నుదుటిపై తిలకాలు పెట్టడం, అలాగే భక్తులపై పవిత్రమైన నీటిని చల్లడాన్ని నిషేధించింది. అంతేకాకుండా భక్తులు కానుకల రూపంలో ఇచ్చుకునే (దక్షిణ) వాటిని కూడా నిషేధించింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి వస్తాయని తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తెలిపింది. అయితే భక్తులెవరైనా కానుకలు వగైరాలు ఇవ్వాలనుకుంటే కేవలం అక్కడ ఏర్పాటు చేసిన హుండీలనే వేయాలని ట్రస్ట్‌ సూచించింది. అయితే.. ఈ నూతన మార్గదర్శకాల విషయంలో అక్కడి అర్చకులు కొంత అసంతృప్తి వున్నా… తాము ట్రస్ట్‌ ఆదేశాలనే పాటిస్తామని తెలిపారు. అయితే.. ఈ నిర్ణయాలన్నీ ట్రస్ట్‌ సమష్టిగా కలిసి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

    అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నుంచి రామ దర్శనానికి భారత దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రాముడ్ని దర్శించుకోవడమే కాకుండా… దగ్గరి నుంచి పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే… భక్తులను నియంత్రించడానికి ట్రస్ట్‌ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయినా… ఇప్పటికీ రాముడ్ని అతి దగ్గరి నుంచి దర్శించుకునేలా ట్రస్ట్‌ ఏర్పాట్లు చేసింది.

    సాధారణ భక్తులు రాముడి దర్శనం కోసం బారికేడ్లతో నిర్మించిన క్యూలో నిలబడాలి. వీఐపీలకు మాత్రం రాముడ్ని అతి దగ్గరి నుంచి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ దర్శనం తర్వాత అర్చకులు భక్తుల నుదుటిపై చందనాన్ని పూస్తారు. ఆ తర్వాత చరణామృతాన్ని భక్తులపై చల్లుతారు. ఈ సందర్భంగా భక్తులు తమకు తోచిన దక్షిణను ఇచ్చుకుంటున్నారు. దీంతో అర్చకులకు ట్రస్ట్‌ ఇచ్చే నెలవారీ వేతనాలు కాకుండా, అదనపు ఆదాయం కూడా వస్తోంది. ఇక్కడి నుంచే అర్చకులకు నేరుగా భక్తులు తమకు తోచిన కానుకలు సమర్పించుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ పద్ధతినే ట్రస్ట్‌ నిషేధించింది.

    భక్తులు ఇచ్చే ప్రతి విరాళాన్ని కూడా తాము లెక్కిస్తున్నామని, ఆలయం కోసమే వాడుతున్నామన్న నిర్ధారణ భక్తులకు కలగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా తెలిపినట్లు ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. భక్తులు తమకు తోచినట్లుగా ఇచ్చే కానుకలను అర్చకులు కచ్చితంగా హుండీలోనే వేయాలని ఆయన సూచించారు. రాముల వారి సేవలో దాదాపు డజన్‌ మంది అర్చకులను వినియోగించుకుంటున్నారు. షిఫ్టులలో వీరు తమ విధులు నిర్వర్తిస్తుంటారు. ఆలయ ప్రధాన అర్చకులకు 35,000 రూపాయలు ఇస్తుండగా… సహాయ అర్చకులకు 33,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక… ఆలయంలో పనిచేస్తున్న ప్రతి అర్చకుడికి కూడా న్యాయమైన వేతనాన్నే ట్రస్ట్‌ చెల్లిస్తోంది. మందిరాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ట్రస్ట్‌ కొన్ని సమష్టి నిర్ణయాలు తీసుకుందని, దానికి అందరూ కట్టుబడి వుండాల్సిందేనని ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్‌ స్పష్టం చేశారు.