Home News ‘పురుషులతో బాధ్యతల నిర్వహణ, బాలలతో సత్యవ్రతం భారతీయ మహిళ కర్తవ్యం’

‘పురుషులతో బాధ్యతల నిర్వహణ, బాలలతో సత్యవ్రతం భారతీయ మహిళ కర్తవ్యం’

0
SHARE

ఆబాలగోపాలానికి బాధ్యతలు నేర్పించడం, సత్యవ్రతం చేయించడాన్ని ప్రతి భారతీయ స్త్రీ తన కర్తవ్యంగా చేసుకోవాలని, తద్వారా పెంపొందిన ఏకాత్మత భావనతో విశ్వజననికి వైభవంగా మంగళహారతులు ఇద్దామని రాష్ట్ర సేవికా సమితి ఉద్ఘాటించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను రాష్ట్ర సేవికా సమితికి చెందిన భాగ్యనగర్, సికింద్రాబాద్ విభాగ్‌లు భాగ్యనగరంలో ఆదివారం (ఆగస్టు 28) సంయుక్తంగా నిర్వహించాయి.

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి ఒడి మొదటి బడి అని అన్నారు. ఉగ్గుపాలతో మాతృమూర్తి నేర్పిన పాఠాలతో తాను పాకిస్తాన్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించే స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పారు. బాల్యం నుంచి మాతృమూర్తులు రంగరించిన ధైర్య సాహసాలతోనే అమరవీరులైన దేశభక్తులు నవభారత్ నిర్మాణానికి పునాదులు వేశారని కుమారి నైనా జైస్వాల్ గారు అన్నారు. తన ప్రసంగం మధ్యమధ్యలో సభికులతో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయించడం ద్వారా సభలో ఏకాత్మత భావనను ఆమె నెలకొల్పారు.

ప్రధాన వక్తగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ‘భారతీయమ్’ సత్యవతి గారు ప్రసంగిస్తూ ప్రస్తుతం భారతీయ సమాజంలో సానుకూలమైన దృక్పథంతో కూడుకున్న దేశభక్తిని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారతీయులు ఎవరికి వారు సక్రమంగా వారి బాధ్యతలను నిర్వర్తించడమే అసలైన దేశభక్తిగా సత్యవతి గారు తెలిపారు. భారతీయ మహిళ తాను తెరవెనుక ఉండి చేసే ప్రతిపనిలోనూ ఘనతను పురుషుడికి ఆపాదించాలని ఆకాంక్షిస్తారని వారు చెప్పారు.

ప్రస్తుత కాల, మాన పరిస్థితులలో పురుషుడికి బాధ్యతలు నేర్పించడమే స్త్రీ చేపట్టాల్సిన కర్తవ్యంగా సత్యవతి గారు తెలిపారు. ప్రతి మాతృమూర్తి తన కుమారుడితో సత్యవ్రతం చేయించాలని వారు చెప్పారు. ఏదైనా విషయానికి సంబంధించి పురుషులు మనస్సుతో ఆలోచిస్తే, స్త్రీలు హృదయంతో స్పందిస్తారని సత్యవతి గారు తెలిపారు. యావత్ భారత జాతికి ఏకాత్మతా భావన కలిగించడానికి మాతృమూర్తులు ప్రతినబూనాలని వారు చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా 75 గీతాలతో కూడిన పుస్తకం, సీడీ, రాష్ట్ర సేవికా సమితి యూట్యూబ్ చానల్‌ను అతిథులు ఆవిష్కరించారు. నాగోలుకు చెందిన భూపతి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఉరి’ నాటకం, ‘వందేమాతరమ్’ పేరిట వైదేహి ఆశ్రమానికి చెందిన ముగ్గురు విద్యార్థినుల నృత్య ప్రదర్శన, ఉప్పగూడకు చెందిన సరస్వతి శిశుమందిర్ విద్యార్థినుల సామూహిక నృత్య ప్రదర్శన సభికుల్లో దేశభక్తి భావనను పెంపొందించాయి.

రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కార్యవాహిక మాననీయ శ్రీపాద రాధ గారు, భాగ్యనగర్ విభాగ్ కార్యవాహిక మాననీయ గోవర్ధనం ప్రసన్నలక్ష్మి గారు, ప్రముఖ రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారితో పాటుగా 500 మంది సభికులు కార్యక్రమానికి హాజరయ్యారు.