సినిమా సమాజాన్నీ ప్రభావితం చేస్తుందా? అని అనుమానాలు ఎవరికైనా ఉంటే నా సమాధానం కచ్చితంగా ప్రభావితం చేస్తుంది అని, వెంటనే బుజువులు ఉన్నాయా అని అడిగితే నేను చాలా చూపించగలను. మచ్చుకు “శంకరాభరణం”, “సాగర సంగమం” వంటి సినిమాలు అనేక మంది ని “సంగీతం”, “నాట్యం” నేర్చుకోవటానికి మరలించేలా చేశాయి అనేది అందరికి తెలిసిన విషయమే. “త్యాగయ్య” సినికూ చూసి యోగిగా మారిన కాశినాయన గురించి కూడా చాలామందికి తెలుసు. ఇలా అనేక ఉదాహరణలు నేను ఇక్కడ ఉదహరించిన సినిమాలు మంచి వైపు నడిపినవి. ఇక యువతను హింసవైపునకు అరాచక ఆలోచనల వైపునకు నడిపించిన సినిమాలు కొకొల్లలు. వేణు యేల్డండి దర్శకత్వం వహించిన ” బలగం ” సినిమా భారతీయ సమాజంలో ఒక అద్భుతమైన మంచి మార్పును తేగలిగిన సినిమా.
వ్యక్తి, కుటుంబం, సమాజం, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం ప్రపంచం ఇలా ఏ స్థాయిలో చూసినా ప్రస్తుతం రెండు అంశాలు ఘర్షణ(Conflict) కి కారణం అవుతున్నాయి. మొదటిది ‘నేను’ అన్న అహం. రెండవది ‘నాది’ అనే స్వార్థం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తగ్గినా సనాతన ధర్మం ప్రతిపాదించే వసుధైకతత్వం అర్థమవుతుంది. ‘ బలగం’ సినిమా పై రెండు అంశాల ఆధారంగా మనుషుల మధ్య జరిగే సంఘర్షణను ప్రధానంగా చూపిస్తూ ఎలా మారాలో తెలిపిన కళారూపం. ప్రతీ పాత్ర అద్భుతంగా ఇమిడిపోయిన కథ.
“తెలంగాణా” పల్లె వాతావరణం నేపథ్యంలో సాగిన ఈ కథలో నాయకుడు ఎవరై ఉంటారా అని వెతికితే మనకు ‘దర్శకుడే’ నాయకుడు అనిపిస్తాడు. “అహం” కలిగిన లేదా “స్వార్థం” కలిగిన పాత్రలు చివరికి ఎలా “మానవత్వపు” పోకడ పోతాయో, బంధుత్వాలు ఎలా నిలుపుకోవాలో, ఊరి పెద్దలు ఎంత విలువ కలిగి ఉండాలో, పంచాయతీ ఎంత గౌరవంగా జరగాలో, ఊరి కట్టుబాటుకు కుటుంబం ఎంత విలువ ఇవ్వాలో మళ్లా మన సమాజం సనాతన వ్యవస్థ మూలాలకు ఎలా వెళ్లాలో ఆలోచించడానికి ఈ సినిమా ఒక ఆధారం అవుతుంది. ఇక్కడి నుంచి కొందరి ఆలోచనలు కచ్చితంగా మారుతాయి. కుటుంబాలు కలుస్తాయి. బంధుభావన మళ్లా వెల్లివిరుస్తుంది. పెద్దలు మాటలకు ఎట్లా గౌరవం ఇవ్వాలి, అంటీ ముట్టనట్టుగా అన్నీ గమనిస్తూ మౌనంగా ఉండకుండా అవసరం అయినపుడు ఎంత గట్టిగా వ్యవహరించాలో, ఎలా పెద్దరికం చూపాలో, ఆప్యాయతలు ఎలా పెంపొందించుకోవాలో, ఇరుగు పొరుగు ఎలా కలవాలో.. ఇట్లా అనేక విషయాలను అద్భుతంగా చూపింది ఈ సినిమా. కథ ఏమిటో చెప్పబోవడం లేదు. నటీ నటుల నటన గురించి చెప్పబోవటం లేదు. వాటన్నింటినీ మించి అనేక ప్రాచీన, జానపద కళారూపాలను ఈ దర్శకుడు అద్భుతంగా ఉపయోగించాడు. ప్రతి పాటకి ఓ అవార్డ్ ఇవ్వచ్చును. కథని ఈ పాటలు పరిగెట్టిస్తాయి. అంతా పాటలల్లో చెప్పి ఆ బరువుకి గుండె కరిగి నీరైపోతే ఇక స్మశాన వైరాగ్యం’ వస్తుందేమోనని సామాన్యుల స్థాయికి దిగి సంభాషణలు కూడా పెట్టినట్టు అనిపిస్తుంది.!.
భారతీయతకు, భారతీయ విలువలకు భారతీయ కుటుంబ వ్యవస్థకు, భారతీయ సమాజవ్యవస్థకు, సనాతన సాంప్రదాయలకు రూపమే ఈ ‘ బలగం’.
– చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి