Home News బాలికల ఆత్మబంధువు వైదేహీ ఆశ్రమం

బాలికల ఆత్మబంధువు వైదేహీ ఆశ్రమం

0
SHARE
  • బాలికలను చేరదీస్తున్న ఆశ్రమం
  • చేరదీసి ఆలనా.. పాలన
  • చదువు, పని, వివాహాలూ అక్కడే.

తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని, ఆశ్రయం లేని బాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు, వివాహాలూ చేస్తూ వారికి ఆత్మబంధువుగా మారింది సైదాబాద్‌ సరస్వతీనగర్‌లోని వైదేహీ ఆశ్రమం. వివేకానందుని ఆదర్శాలకు అనుగుణంగా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న సేవాభారతి ఆధ్వర్యంలో 1993లో చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి చేతుల మీదుగా మూడు చిన్న గదుల్లో తాత్కాలిక వసతిగృహంలో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. నాడు ముగ్గురు బాలికలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో నేడు 110 మంది బాలికలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఐదు సంవత్సరాల నుంచి.. 20 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు ఈ ఆశ్రమంలో ఉండగా.. వారు ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు సరస్వతీ శిశుమందిర్‌ హైస్కూల్‌లో చదువుతున్నారు. అలాగే, ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ బాలికలను చేర్పించి చదువు చెబుతున్నారు. అంతేగాక ఆశ్రమంలో వీరికి ప్రత్యేకంగా సంగీతం, నాట్యం, చిత్రలేఖనంతో పాటు వృత్తి విద్యలైన టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, స్ర్కీన్‌ప్రింటింగ్‌, వ్యక్తిత్వ వికాస శిక్షణ, కరాటే లాంటి శారీరక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆశ్రమ బాలికలు 43 మంది డిగ్రీ ఆపై వరకు చదువుకున్నారు. 20 మంది ఉద్యోగం, స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. అలాగే, ఆశ్రమంలోని 37 మంది యువతులకు సేవా సమితి ప్రతినిధులు తల్లిదండ్రులుగా మారి వైభవంగా, హైందవ పద్దతిలో వివాహాలు జరిపించారు.

విశాల ప్రాంగణంలో..

దాతల సహాయంతో అదే ప్రాంతంలోని విశాల స్థలం లో రూ. 50 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో బాలికలకు వసతి, గ్రంథాలయం, పూజ గదులు, రెండో అంతస్తులో బాలికలకు వసతి కల్పించారు. ఆశ్రమంలో బాలికలను పెంచి పోషించడం, విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా వారు తమ కాళ్ళపై తాము నిలబడే వరకు, వివాహం కూడా జరిగే వరకు ఆశ్రమం బాధ్యతను స్వీకరిస్తోంది. ఆశ్రమంలో గృహ వాతావరణం కల్పించి, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్విర్తించే రీతిలో భారతీయ మహిళగా బాలికలను తీర్చిదిద్దడంలో వైదేహి సేవా సమితి కృషి చేస్తోంది.

వైదేహి కిశోర్‌ వికాస్‌ యోజన..

వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో 2004లో వైదేహి కిశోర్‌ వికాస్‌ యోజనను ఏర్పాటు చేశారు. దీనిద్వారా కార్యకర్తలు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన 110 బస్తీలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు నిరుపేద బాలికలకు విద్య, యోజన, ఆరోగ్యం, సంస్కారం, స్వావలంబనలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది కార్యకర్తలతో 6,000 మంది బాలికలకు శిక్షణ ఇచ్చారు.

వైదేహి మహిళా వికాస్‌ యోజన…

2010 నుంచి వైదేహి మహిళా వికాస్‌ యోజన ద్వారా పేద యువతులను, మహిళలను చేరదీసి కంప్యూటర్‌ శిక్షణ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, వృత్తివిద్యలో శిక్షణ ఇస్తున్నారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం 200 మంది మహిళలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ చేశారు. అదేవిధంగా వైదేహి సంచార వైద్యశాల ప్రారంభించి బస్తీల్లో ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)