– డి. శారద
సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే గర్భాన్ని గౌరవించే పండుగే. ఆ రకంగానే సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ. పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి, పాడి, పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఇందులోని పరమార్థం.
బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు. మన ఆచార వ్యవహారాలను, మన సంబంధ బాంధవ్యాలను, మన సంస్కృతిని యాది జేసుకునే ఒక గొప్ప అవకాశం. తరతరాల సంస్కృతి సంపదను గుర్తు చేసుకొని మనఃపూర్వకంగా తలవంచి దండం బెట్టుకొనే ఉత్సవం.
బతుకమ్మ పండుగలోని భాగంగా బొడ్డెమ్మ చేసుడు, బతుకమ్మ పేర్సుడు, ఆడే విధానం, పాటల్లోని పుట్టు పూర్వోత్తరాలు, ఆచరించే విధి విధానాలలోని తేడాలు మొదలగు వాటిని మధించి చూస్తే అనేకానేక ప్రకృతి సత్యాలు, చరిత్ర కథలు తరతరాల జీవన విధానాలు దర్శన మిస్తాయి. ఉదాహరణకు బతుకమ్మ ఆకారంలోనే ఆమె పుట్టు పూర్వోత్తరాలు దాగి ఉన్నాయని అనిపిస్తుంది.
బతుకమ్మ ఆకారంలోని విశిష్టత
పేర్చిన బతుకమ్మలో లింగం, భూమి, గర్భం, ధాన్యరాశి, స్థనం ఆకారాలు కన్పిస్తయి. వీటి వెనుకగల జానపదుల కథనాలు గమనిస్తే బతుకమ్మ పుట్టుకకి గల ఆధారాలు దొరుకుతయి. తెలంగాణ పల్లెల్లో శైవమత ప్రాబల్యం కొంత ఎక్కువగా కన్పిస్తుంది. గ్రామదేవతలుగా కొలువుండే వారిలో ఎక్కువమంది శివాంశ సంభూతులే. అటువంటి శివుని లింగాకారంలో పూజించడం జగద్విదితమే. జానపదులు శివుని భార్య పార్వతిని ‘లింగు’గా సంబోధించే మనకు పాటలు వినిపిస్తయి.
‘తంగెడు చెట్టు కింద కోలు ‘లింగు’ పుట్టిందే కోలు’ అంటూ పార్వతిదేవి ప్రతిరూపంగా పూలతో లింగాకారంలో పేర్చి పూజించడం జరుగుతుంది. అలాగే ఒక ప్రాచీన కథ ప్రకారం పదహారు కోట్ల ఆదివాసులు కొండ ప్రాంతాలలో నివసిస్తూ ఉండేవారు. వారు అశువూభంగా ఉంటూ ఏది పడితే అది తింటూ ఉండేవారు. వారి సంస్కారాన్ని చీదరించుకొని మహాదేవుడు ఒక కొండగుహలో బంధించివేశాడు. వారిని రక్షించి, సంస్కరించడానికి పార్వతీదేవి తపస్సు చేసి ఒక పుత్రుడిని కన్నది. ఆ పుత్రుని పేరు ‘లింగో’. లింగో ఆ ఆదివాసులకు జీవన విధానాన్ని సంస్కారాన్ని నేర్పుతాడు. సంస్కృతి పరిరక్షణకు పూనుకొన్న పార్వతి వారికి ఆదిదేవతయ్యింది. ఈ విధంగా ఆదివాసులు తమ బతుక్కు ఆధారమైన పార్వతిని, ఆమె గర్భాన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్న విషయాన్ని కూడా బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయంగా పరిగణించాలి.
సృష్టి సీమంతం
సృష్టి నిత్య చైతన్యానికి, సజీవానికి పునాది పుట్టుక. మాతృత్వం జీవకోటి రక్ష. అండాన్ని, పిండాన్ని మోయడానికి, ప్రాణం పోయడానికి, అవయవ నిర్మాణానికి, జన్మ నివ్వడానికి ఒక మాతృక కావాలి. ఆ మాతృక విత్తన నిర్మాణానికి సహకరించే అండాశయం కావచ్చు, జీవి నిర్మాణం చేసే గర్భం కావచ్చు.ఈ విధంగా పుట్టుకకి ఆధారమైన ‘గర్భాన్ని’ పూజించడం, గౌరవించడం మన సంస్కృతి. అందుకే ఇప్పటికి, ఎప్పటికీ మన కుటుంబాలలో ‘సీమంతం’ అన్న ఆచారం ఒక సంస్కారంగా కనిపిస్తుంది.
పుట్టుకకి, బతుకు సాగడానికి ఆధారభూతమైన వారిని పూజించడం, గౌరవించడం మన సంస్కృతి. దానికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ ఆకారంలోనే ఆమె పుట్టు పూర్వోత్తరాలు దాగి ఉన్నాయని అనిపిస్తుంది.
మరో విధంగా సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే గర్భాన్ని గౌరవించే పండుగే.ఆ రకంగానే సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ. పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి, పాడి, పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఇందులోని పరమార్థం.
పచ్చని ఆడబిడ్డకి పూజలు
ఒకప్పటి ‘తెలగాడం’ పచ్చని పంటలకి పుట్టినిల్లు. ఊరికొక్క చెరువు మూడారు కాలాలు నిండుగ ఉండేది. అందువల్ల పంట పొలాలన్నీ మూడు పంటల్ని ఇస్తూ ధాన్యపురాసులతో కళకళలాడుతూ ఉండేవి. ఉదాహరణకి ఈ పాటలని గమనిద్దాం.
తూర్పున వానొచ్చె ఉయ్యాలో – తులసి వర్షం కురిసె ఉయ్యాలో
పడమటి వానొచ్చె ఉయ్యాలో – పాల వర్షం కురిసె ఉయ్యాలో
ఉత్తరపు వానొచ్చె ఉయ్యాలో – ఉరుములు, మెరుపులు ఉయ్యాలో
దక్షిణం వానొచ్చె ఉయ్యాలో – దండిగా కొట్టింది ఉయ్యాలో
ఆ వాన ఈ వాన ఉయ్యాలో – చెరువు నిండా వచ్చె ఉయ్యాలో
ఆ వాడ కప్పుడు ఉయ్యాలో – పండ్లమ్మ వచ్చింది ఉయ్యాలో
ముంగిట ఉన్నాయి ఉయ్యాలో – ముత్యాల రాసులు ఉయ్యాలో
కొంటవోరా పాపన్న ఉయ్యాలో – ముంచి మూడు దోసిళ్ళు ఉయ్యాలో
ముత్యాలు మా యింట ఉయ్యాలో – మొక్కజొన్నలు బోలు ఉయ్యాలో
ధనధాన్యాలతో తులతూగే నాటి ‘తెలగాడం’కి (తెలంగాణ) సాక్ష్యాలు ఈ పాటలు. అటువంటి ధాన్యరాసులను ప్రసాదించే పచ్చని ఆడబిడ్డని చేసి పూజించడమే బతుకమ్మ పండుగ
సృష్టే ఒక పెద్ద బతుకమ్మ
‘శ్రీలక్ష్మీదేవి సందమామ… సృష్టి బతుకమ్మయ్యె సందమామ…’ అని పాడడంలో సృష్టి పుట్టినప్పుడే, బతకడం మొదలయినప్పుడే బతుకమ్మ పుట్టింది. ఈ సృష్టే ఒక పెద్ద బతుకమ్మ. బతుకునిచ్చినయమ్మ. బతుకు నేర్చిన యమ్మ. ఈ సృష్టిని పూజించడం గౌరవించే క్రమంలో బతుకమ్మ పండుగ పుట్టింది. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైన పండుగ అని చెప్పుకోవలసి వస్తుంది. ఈ సృష్టి అంటే భూమి… బతుకమ్మ ఆకారంలో ఉందని చెప్పకనే చెప్పడం జానపదుల విజ్ఞాన విశిష్టత.
ధర్మాంగ రాజు పుత్రి బతుకమ్మ
‘ధరచోళ దేశమున ఉయ్యాలో… ధర్మాంగుడను రాజు ఉయ్యాలో…’ అనే ఉయ్యాల పాటలు ప్రసిద్ధమైనవి. ఈ పాట ద్వారా చోళదేశ రాజ్యంలో ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు శ్రీలక్ష్మీదేవి జన్మించినట్లు, ఆమెను కపిల మహర్షి, గాలవుడు, అత్రి, వశిష్ట, కశ్యప మహర్షులు దీవించి ‘బతుకమ్మ’ అని నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది.
బతుకమ్మ ఆడే ఆచారం గల ప్రాంతం ఏదైతే ఉందో అది ఆనాడు చోళ దేశంగా వ్యవహరింపబడేది. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర- మహిమ’ ప్రకరణం పుట 185లో చోళవాళి అనే మాట కనిపిస్తుంది. దీనిని బట్టి బతుకమ్మ పండుగ జరుపుకొనే ప్రాంతమే నాటి చోళ దేశమై ఉంటుంది. అయితే, చోళ వంశస్థులు వేరు. చోళ వంశస్థులలో ఎవరూ ధర్మాంగుడను పేరుగల రాజులేడు. అలాగే, చోళ వంశంలో బతుకమ్మ జన్మించినట్లయితే అత్రి, వశిష్టుల కాలం వేరు. చోళుల కాలం వేరు. కనుక అతి ప్రాచీన కాలం అంటే మహర్షులు, వేదకాలం నాటి మాట ఇది. బతుకమ్మ ఆడే ఆచారం గల ప్రాంతం ఏదైతే ఉందో అది ఆనాడు చోళ దేశంగా వ్యవహరింపబడేది. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర- మహిమ’ ప్రకరణం పుట 185లో చోళవాళి అనే మాట కనిపిస్తుంది. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా ఒకనాడు చోళనాడి అనే పేరుతో పిలువబడేదని సాహిత్య, చరివూతకారుల శోధనలో వెల్లడైంది.
ఈ విధంగా మనం తరచి చూస్తే మానవుడు ప్రకృతిలో తన జీవన గమనం మొదలు పెట్టినప్పుడే, సృష్టి పట్ల ఆరాధన మొదలైనప్పుడే బతుకమ్మ పుట్టిందని చెప్పవచ్చు.
– వ్యాసకర్త కవయిత్రి, ఉపాధ్యాయురాలు