Home Telugu Articles మతం వైపుగా బెంగాల్‌ మార్క్సిస్టులు

మతం వైపుగా బెంగాల్‌ మార్క్సిస్టులు

0
SHARE

కమ్యూనిస్ట్‌లకు మతం మత్తుమందు వంటిది. వారికి విగ్రహారాధన మాత్రమే కాకుండా ధార్మిక అంశాలకు సంబంధించిన ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అంటే గిట్టవు. దేవాలయాల సందర్శన, పూజలు, పండుగలు సహితం పట్టవు. ఇక ముహుర్తాలు పట్ల ఏమాత్రం విశ్వాసం ఉండదు. తిరుమల ఎందుకు వెళ్లారంటే విహార యాత్రకోసం అని చెప్పిన కమ్యూనిస్ట్‌ యోధులు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో తమ సుదీర్ఘ పాలన అంతం కావడం, ఇప్పట్లో తేరుకొనే అవకాశాలు కనబడక పోవడం, ఈ ‘ఏర్ర భూమి’లో కమలం వికసించే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో వారు తమ నమ్మకాలను, విశ్వాసాలను కూడా రాజకీయాల కోసం మార్చుకొంటున్నారు.

గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని పార్టీ పొలిట్‌ బ్యూరోలో కేంద్ర నాయకులు నిలదీస్తే, తాము ఆ విధంగా కలవని పక్షంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి ఉండేదని సిపిఎం రాష్ట్రకార్యదర్శి సూర్యకాంత్‌ నివేదిక ఇవ్వడం గమనార్హం.

నాలుగు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష నాయకులు ఎవరూ అక్కడ పండుగల సందర్భంగా ప్రతిసంవత్సరం జరిగే రథయాత్రలలో గాని, ముస్లింలు జరుపుకొనే ఈద్‌ మిలాప్‌ వంటి ఉత్సవాలలో గాని ఎప్పుడూ పాల్గొన్న ఉదంతమే లేదు. కనీసం ఇటువంటి పర్వదినాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలుపరు.

కానీ ఇప్పుడు వారు తమ దారి మార్చుకున్నారు. అందుకు ‘ప్రజల విశ్వాసాలను గౌరవించాలి. వారు జరుపుకొనే సామాజిక, ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలి’ అంటూ సిద్ధాంతీకరణ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు చేరువై అంతరించిన తమ వైభవాన్ని తిరిగి పొందాలంటే మతమే మార్గం అనే నిర్ధారణకు వచ్చారు. ముందుగా ధార్మిక కార్యక్రమాలకు దూరంగా ఉండరాదని నిర్ణయించు కున్నారు. ప్రజలు ఎక్కడ ఎక్కువగా గుమికూడితే అక్కడకు కమ్యూనిస్ట్‌లు కూడా వెళ్ళవలసిందే అంటూ సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారు.

రథయాత్రలో ఉత్సాహం

గత నెలలో బెంగాల్‌, ఒడిశాలలో ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొనే రథయాత్ర శనివారం నాడు వస్తే, ఈద్‌ మిలాప్‌ ఆ మరుసటి రోజు వచ్చింది. భారీ వర్షాలు సహితం ప్రజలలో పండుగ ఉత్సాహాన్ని మార్చలేకపోయాయి. అయితే ఈ పండుగలు, వర్షాలు అనూహ్యం కాకపోయినప్పటికీ ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్‌లో ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. ఈ రెండు పండుగల సందర్భంగా వామపక్ష నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సందేశాలు పంపారు. గతంలో ఎన్నడూ ఆ విధంగా జరుగలేదు.

బహుశా మొట్టమొదటిసారి ఈ పండుగకు రాష్ట్ర సిపిఎం కార్యదర్శి సూర్యకాంత్‌ మిశ్రా వాట్సాప్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల హదయాలలో తాము నిలబడటం కోసం వారికి ఇంతకన్నా మరో మార్గం తోచినట్లు లేదు. 24 పరగణాల జిల్లాలో సిపిఎంకు చెందిన డం డం ఉత్తర శాసన సభ్యుడు తన్మయ్‌ భట్టాచార్య మరో అడుగు ముందుకు వేసి రథయాత్రలో పాల్గొన్నారు.

జిల్లాల్లో ఇఫ్తార్‌ విందులకు హాజరయ్యారు. తిరిగి ఎన్నికల విజయాలు పొందటం కోసం పార్టీ విధానాలకు తిలోదకాలు ఇస్తున్నారని వామపక్షాలలో తీవ్రవాదులుగా భావించే నాయకుల నుండి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న నాయకులలో రాష్ట్రంలోని ఈ శాసన సభ్యుడు ఉండటం గమనార్హం.

పైగా సిపిఎం కమ్యూనిస్ట్‌ స్వభావాన్ని కోల్పోతున్నదని, తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ వంటి ఇతర పార్టీల కన్నా ఎటువంటి భిన్నమైన పార్టీ కాకుండా మారిపోతున్నదని తీవ్రవాద వామపక్ష నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు.

గతంలో తెర వెనుక నుండే

తాము నాస్తికులమని, మతం ప్రజలకు మత్తుమందు వంటిదని పైకి విమర్శలు కురిపిస్తున్నా, గతంలో సిపిఎం నాయకులు రాష్ట్రంలో పెద్ద పెద్ద పండుగలైన దుర్గా పూజ, కాళీ పూజలకు తెర వెనుక ఉండి మద్దతు అందజేసేవారు. ఈ పూజలను కోల్‌కతాలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కాలనీలో జరుపుతూ ఉంటారు. సంప్రదాయం ప్రకారం యువజన, క్రీడా క్లబ్‌లలోని యువకులు ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటారు.

34 ఏళ్ళ పాటు సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి క్లబ్‌లు అన్ని ఆ పార్టీ కార్యకర్తలతోనే నిండి ఉండేవి. గత ఆరు సంవత్సరాలుగా ఈ క్లబ్‌లు అన్ని తణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే తణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం సిపిఎం వలె తెర వెనుక నుండి కాకుండా బహిరంగంగానే వీటికి మద్దతు ఇస్తున్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డజన్‌ల కొద్ది క్లబ్‌లు నిర్వహించి, నగరంలో పూజలను ప్రారంభించారు.

ఆమెను అనుసరిస్తూ ఆమె మంత్రులు పలు చోట్ల తామే పూజలు జరిపారు. అయితే ఇంతకాలం మతపర ఉత్సవాలలో బహిరంగంగా పాల్గొనకుండా, వాటికి బహిరంగ మద్దతు ఇవ్వకుండా సిపిఎం నాయకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. గతంలో పొరుగున ఉన్న కాళీ దేవాలయంలో పూజలు చేస్తూ సిపిఎంకు చెందిన మాజీ రవాణా మంత్రి సుభాష్‌ చక్రవర్తి ‘పట్టుబడ్డారు’ అని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు సతీమణి తారకేశ్వర్‌ దేవాలయాన్ని తరచూ సందర్శించే వారు అంటూ ఉంటారు.

అయితే సాధారణంగా పూజా మందిరాల వద్ద గల షాపులు, స్టాళ్ళు ఏర్పాటు చేయడం వరకే సిపిఎం కార్యకర్తలు బహిరంగంగా పాల్గొంటూ ఉండేవారు. ఈ పూజా మందిరాల వద్ద మార్క్సిస్ట్‌ సాహిత్యం, ప్రముఖ కమ్యూనిస్ట్‌ నాయకుల జీవిత గ్రంథాలను అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దానితో కమ్యూనిస్ట్‌లు ఏర్పాటు చేస్తున్న స్టాళ్ళకు ప్రజాదరణ లేదు.

తాము అధికారంలో ఉన్న సమయంలో మేధావులను ఆకట్టుకోవడానికి పుస్తక ప్రదర్శనలపై ఆధారపడుతుండేవారు. రాష్ట్రం అంతటా విస్తతంగా పుస్తక ప్రదర్శనలు జరుపుతూ ఉండేవారు.

బంగియా శాఖారట ప్రసార సమితి (బెంగాల్‌ విద్యా విస్తరణ సంస్థలు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వత్తి విద్య, ఇతర శిక్షణ కార్యక్రమాలను, వివిధ రకాల శిబిరాలను, రక్తదాన కేంద్రాలను యువత కోసం నిర్వహిస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు ఏర్పరచుకొనేందుకు వామపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉండేవి. అయితే అధికారం పోయిన తరువాత ఈ సంస్థలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.

ఇటువంటి పరిస్థితులలో బెంగాల్‌ ప్రజలను చేరడానికి, వారితో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి సిపిఎం, ఇతర వామపక్షాలకు ధార్మిక ఉత్సవాలు తప్ప మరో సందర్భాలు కనబడటం లేదు. అధికారం నుండి తాము వైదొలగడం రాష్ట్రంలో పెద్ద అగాధాన్ని ఏర్పర్చిందని, దానిని తణమూల్‌ కాంగ్రెస్‌ పూడ్చలేదని సిపిఎం నాయకులు భావిస్తున్నారు.

బిజెపి ఎదుగుతున్నదనే భయం

తాము ధార్మికపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉన్న కారణంగానే తణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రజలకు సన్నిహితం అయ్యే అవకాశం ఏర్పడిందని సిపిఎం ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకొంటున్నది. తాము మతపర విశ్వాసాలకు దూరంగా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాపకం సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బిజెపికి బలం పుంజుకొనే అవకాశం కల్పించినట్లే కాగలదని ఆందోళన చెందుతున్నారు.

తణమూల్‌ కాంగ్రెస్‌ కన్నా బిజెపి ప్రమాదకర మైనదని సిపిఎం నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. తాము దూరంగా ఉంటే రాష్ట్రంలో రథయాత్ర వంటి ధార్మిక ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను వారే చేపట్టే ప్రమాదం ఉంది. అందుకే మతపర ఉత్సవాలకు వామపక్షాలు దూరంగా ఉండరాదని మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్‌ భట్టాచార్య స్పష్టం చేస్తున్నారు. వామపక్షాలను ధార్మిక ఉత్సవాలలో క్రియాశీల పాత్ర వహించమని ప్రోత్సహిస్తున్నారు.

కారణాలు ఏమైనప్పటికీ ఒకప్పుడు సిద్ధాంతాల పట్ల మొండితనం ప్రదర్శిస్తూ తప్పులు చేస్తూ, తరువాత చెంపలు కొట్టుకోవడంలో క్విట్‌ ఇండియా ఉద్యమకాలం నుండి అలవాటు పడిన మార్క్సిస్టులు పశ్చిమ బెంగాల్‌లో జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ తాము చరిత్రలో కలవక ముందే మేల్కొని, తమ పూర్వ వైభవం కోసం మతాన్ని ఆలంబనగా చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు.

– వివేక్‌

(జాగృతి సౌజన్యం తో)