Home Rashtriya Swayamsevak Sangh సంఘానిది స్థిరత్వం తో కూడిన సర్దుబాటు – మన్మోహన్ జి వైద్య

సంఘానిది స్థిరత్వం తో కూడిన సర్దుబాటు – మన్మోహన్ జి వైద్య

0
SHARE

డా. మోహన్ భాగవత్ మూడు రోజుల ఉపన్యాస కార్యక్రమం బాగా విజయవంతమయింది. ఇంతకు ముందెన్నడూ జరగని ఈ కార్యక్రమం గురించి అనుకున్నట్లుగానే అనేక రకాల ప్రతిస్పందనలు వినిపిస్తున్నాయి. కార్యక్రమానికి హాజరైనవారిలో కొందరు ఎప్పుడు సంఘ కార్యక్రమానికి వచ్చినవారు కాదు. కేవలం బయట సాగే ప్రచారం ద్వారానే సంఘ గురించి అభిప్రాయాలు ఏర్పరచుకున్నవారు. ఇలాంటివారు సర్ సంఘచాలక్ సంఘ గురించి చెప్పిన విషయాలు విని ఇప్పటిదాకా తమకు తెలిసిన దానికి అవి పూర్తి వ్యతిరేకంగా ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు. నిజంగా సంఘ ఇలాంటిదా అని అనుకుంటున్నారు. మరోపక్క సంఘాన్ని వ్యతిరేకించేవారికి ఏమనాలో తోచడం లేదు. ఎందుకంటే తాము ఇప్పటివరకు పదేపదే చేస్తూ వచ్చిన తప్పు ఆరోపణలకు బలం చేకూర్చే ఒక్క విషయం కూడా సర్ సంఘచాలక్ ఉపన్యాసాల్లో ఎక్కడా కనిపించకపోయేసరికి వాళ్ళు అయోమయంలో పడిపోయారు. అయినా తమ సంకుచిత ధోరణిని వదులుకోలేక గతంలో చేసిన అర్ధంలేని ఆరోపణలనే మళ్ళీ చేయడం మొదలుపెట్టారు.  విచిత్రమేమిటంటే ఈ కమ్యూనిస్ట్ విషప్రచారం మూలంగా కొందరు ఆర్ ఎస్ ఎస్ సమర్ధకులు, స్వయంసేవకులు కూడా, అర్ధంలేని ఆరోపణలను నిజమని నమ్మడమేకాక, వాటిని ప్రచారం చేయడం ప్రారంభించారు.

సర్ సంఘచాలక్ `బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంపై ఇచ్చిన వివరణ కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తే, మరికొందరికి ఆనందాన్ని కలిగించింది. ద్వితీయ సర్ సంఘచాలక్ శ్రీ గురుజీ చెప్పిన ఉపన్యాస సంకలనమే `బంచ్ ఆఫ్ థాట్స్’. దీనిపై సర్ సంఘచాలక్ ఇచ్చిన వివరణ కొందరికి ఎలా అనిపించిందంటే శ్రీ గురుజీ భావాలతో సంఘ్ ఇప్పుడు  ఏకీభవించడం లేదని, వాటిని పక్కకు పెట్టిందని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే సర్ సంఘచాలక్ రెండవ రోజు ఉపన్యాసంలో హిందువు, హిందుత్వం గురించి చెప్పిన విషయాలన్నీ శ్రీ గురుజీ ప్రతిపాదించిన విషయాల ఆధారంగా చెప్పినవే.

బంచ్ ఆఫ్ థాట్స్ గురించి మాట్లాడేటప్పుడు అందులోని ఉపన్యాసాలు ఏ సమయంలో, ఏ సందర్భంలో చెప్పినవో గుర్తుపెట్టుకోవాలి. అవి 1940 నుండి 1965 మధ్య కాలానికి చెందినవి. స్వాతంత్ర్యానికి ముందు, తరువాత పరిస్థితులు ప్రత్యేకమైనవి. జాతీయత, అస్తిత్వాన్ని గురించి చర్చ బాగా సాగిన రోజులవి. మతం ఆధారంగా పాకిస్థాన్ ఏర్పాటు మొదలైన పరిస్థితుల నేపధ్యంలో ఈ విషయాలపై వ్యక్తపరచిన అభిప్రాయాలు అవి.

సర్ సంఘచాలక్ గా బాధ్యతలు చేపట్టేనాటికి శ్రీ గురుజీ వయస్సు 34 సంవత్సరాలు. అంత చిన్న వయస్సులో ఒక సంస్థను నడపడం, దారి చూపించడం, విస్తరింపచేయడం సవాలుతో కూడుకున్న పని. సర్ సంఘచాలక్ అయ్యేనాటికి దేశమంతటా పాకిస్థాన్ గురించి చర్చ జోరుగా సాగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఊపు అందుకుంది. అందులో పాల్గొంటూ అనేకమంది స్వయంసేవకులు ప్రాణాలు కూడా కోల్పోయారు. 1946లో పాకిస్థాన్ డిమాండ్ తో ఎన్నికలు జరిగాయి. ముస్లిములు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగాయి. `ప్రత్యక్ష చర్య’ మూలంగా బెంగాల్ లో హిందువులు పెద్దఎత్తున హింసకు గురయ్యారు. భారత్ స్వతంత్రమయిందికానీ ముక్కలయ్యింది కూడా. ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూడని రీతిలో పెద్ద ఎత్తున వలసలు ఆ సమయంలో జరిగాయి. సమస్తం వదిలిపెట్టి కట్టుబట్టలతో హిందువులు భారత్ కు శరణార్ధులుగా వచ్చారు. అలా వస్తున్న వారికి రక్షణ కల్పించి, ఆశ్రయం చూపించారు స్వయంసేవకులు. ఆనాడు చవిచూసిన హింస, దారుణాలను హిందూ సమాజం ఎప్పటికీ మరచిపోలేదు.

గాంధీజీ హత్య తరువాత సంఘ పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది. ఆరోపణలను ఏమాత్రం నిరూపించలేకపోయినా ప్రభుత్వం సంఘపై నిషేధం విధించింది. ఇక్కడ నుండి స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ ద్వేషపూరిత, నీచ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆరోపణలపై సరైన దర్యాప్తు జరిపి వాటి నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ తప్పు ఆరోపణలపైనే శ్రీ గురూజీని నిర్బంధించారు. దానితో స్వయంసేవకులు శాంతియుతమైన పద్దతిలో సత్యాగ్రహానికి పూనుకున్నారు. చివరికి ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. ఇదిలాఉంటే మరోవైపున వేర్పాటువాదానికి ఊతమిచ్చే, జాతీయ అస్తిత్వాన్ని మరుగునపరచే కమ్యూనిస్ట్ సిద్దాంతం ప్రధాన ఆలోచనగా ప్రచారం పొందింది. కమ్యూనిస్ట్ ల ఈ విజాతీయ ధోరణి 1962లో బాగా బయటపడింది. చైనా దాడితో దేశ ప్రజానీకం తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన తరుణంలో కమ్యూనిస్ట్ లు మాత్రం చైనాను ప్రశంసించారు. దేశం కంటే తమ సిద్ధాంతమే ముఖ్యమని చెప్పకచెప్పారు. అదే సమయంలో క్రైస్తవుల మతమార్పిడులు జోరందుకున్నాయి. మిషనరీల కార్యకలాపాలపై జస్టిస్ నియోగి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా  కాంగ్రెస్ పాలిత ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలో ప్రభుత్వాలు మతమార్పిడి నిరోధక చట్టాలను చేశాయి.

ఈ కల్లోలిత కాలంలోనే శ్రీ గురూజీ దేశమంతా పర్యటిస్తూ జాతీయతకు సంబంధించిన అంశాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అలా ఆనాటి పరిస్థితుల్లో గురూజీ ఇచ్చిన ఉపన్యాసాల (1965వరకు) సంకలనమే బంచ్ ఆఫ్ థాట్స్. ఆ తరువాత కూడా 18 ఏళ్ళు శ్రీ గురూజీ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అందుకనే ఆయన జన్మ శతాబ్దిని పురస్కరించుకుని 2006లో వారు చెప్పిన విషయాలన్నింటిని 12 సంపుటాలలో శ్రీ గురూజీ సమగ్ర దర్శన్ గా ప్రచురించాం. ఈ సంపుటాలు చదివితే గురూజీ ఆలోచనవిధానం, వేరువేరు సమయాల్లో, సందర్భాల్లో వారు చెప్పిన విషయాలు అర్ధమవుతాయి. సంఘ ప్రత్యర్ధులు ఎవరు గురూజీ చెప్పిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

12 సంపుటాలు చదివే ఓపిక, తీరికా లేదనుకునేవారు`శ్రీ గురూజీ – హిజ్ విజన్ అండ్ మిషన్’ అనే పుస్తకం చదవవచ్చును. అందులో కూడా శ్రీ గురూజీ ఆలోచన పూర్తిగా తెలుస్తుంది. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని డా. భాగవత్ కోరారు కూడా. అయినా సంఘం శ్రీ గురూజీ ఆలోచనలను పక్కనపెట్టిందని ఎందుకు అనుకుంటున్నారో అర్ధంకావడంలేదు.

బంచ్ ఆఫ్ థాట్స్ లోని కొన్ని ఎంచుకున్న విషయాల గురించి మాత్రమే ప్రశ్నలు సంధించే వారికి డా. భాగవత్ ఎలాంటి సమాధానం ఇచ్చారో సాక్షాత్తు గురూజీ కూడా అలాంటి జవాబే చెప్పారు. 70 దశకంలో డా. జిలానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ గురూజీ ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పారు. కానీ విమర్శకులు ఈ ఇంటర్వ్యూని పెద్దగా పట్టించుకోరు. ఆ విధంగా తమకు కావలసిన విషయాలనే పదేపదే ప్రస్తావిస్తూ, ప్రచారం చేస్తూ ఉంటారు.

ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి –

డా. జిలానీ : `భారతీయకరణ’ అనే దాని గురించి చాలా చర్చ జరుగుతోంది. అలాగే దీని గురించి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు ఏవిధంగా తీరుస్తారు?

శ్రీ గురూజీ : `భారతీయకరణ’ అనేది జనసంఘ్ నినాదం. అయినా దాని గురించి సందేహాలు ఎందుకు కలుగుతున్నాయో అర్ధం కాదు. `భారతీయకరణ’ అంటే అందరినీ హిందూ మతంలోకి మార్చేయడం కాదు.

మనమంతా ఈ భూమి పుత్రులం, దీనికే కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనమంతా ఒకే సమాజానికి చెందినవాళ్లం. మన పూర్వజులు కూడా ఒక్కరే. ఈ విషయాన్ని అర్ధంచేసుకోవడమే నిజమైన భారతీయకరణ.

భారతీయకరణలో తమ మతాన్ని వదిలిపెట్టవలసి వస్తుందనుకునే భయం అవసరం లేదు. మేము ఎప్పుడు అలా చెప్పలేదు, చెప్పబోవడంలేదు. పైగా మొత్తం సమాజానికి ఒకే మత వ్యవస్థ సరికాదని మేము భావిస్తాము.

డా. జిలానీ : మీరు చెప్పినది నిజమే. నూటికినురుపాళ్లు నిజం. ఇలాంటి వివరణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ వివరణను ఏ కాస్త తెలివితేటలు ఉన్న వ్యక్తి అయినా అర్ధం చేసుకోగలడు.

ఈ మతపరమైన భేదాభిప్రాయాలను తొలగించుకునేందుకు మీతో సహకరించే ముస్లిం నాయకులతో సమావేశం కావాలని మీకు అనిపించలేదా?

శ్రీ గురూజీ : అలాంటి సమావేశం అవసరమని అనుకోవడమేకాదు అది జరగాలని నేను కోరుకుంటున్నాను.

ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ కూడా 1972లో శ్రీ గురుజీని ఇంటర్వ్యూ చేశారు. అందులో శ్రీ గురూజీ స్పష్టం చేసిన విషయాలను చూస్తే అనేక అపోహలు, భ్రమలు తొలగిపోతాయి. పైగా ప్రసార , విద్యా మాధ్యమాలను ఆక్రమించుకున్న కమ్యూనిస్టులు ఏ విధంగా ఈ అపోహలు, భ్రమలను ప్రచారం చేశారో అర్ధమవుతుంది.

ఆ ఇంటర్వ్యూ ప్రారంభంలో కుష్వంత్ సింగ్ ఇలా వ్రాసారు – “కొందరు వ్యక్తులపట్ల ఉద్దేశ్యపూర్వకంగా, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే దురభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. అలా నేను పొరపాటు అభిప్రాయాలు ఏర్పరచుకున్న వారిలో శ్రీ గురూజీ ఒకరు. కానీ జర్నలిస్ట్ గా ఆయనని కలవకుండా ఉండలేకపోయాను’’. చివరలో ఆయనే ఇలా వ్రాసారు-“ప్రభావితుడనయ్యానా? అంటే అవుననే ఒప్పుకుంటాను. ఆయన (గురూజీ) నన్ను ఒప్పించాలని ప్రయత్నించలేదు. పైగా ఏదైనా విషయాన్ని ఆయనకే చెప్పి ఒప్పించవచ్చనే భావాన్ని కలిగించారు’’.

ఈ రెండు ఇంటర్వ్యూలు పూర్తిగా చదవాల్సినవి. గురూజీ చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధంచేసుకోకుండానే కమ్యూనిస్ట్ లు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. ఈ ‘బురదజల్లే’ పనిలో వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.

బంచ్ ఆఫ్ థాట్స్ లో శ్రీ గురూజీ వ్యక్తపరచిన ఆందోళనే నేడు ఒక ప్రత్యేకమైన సిద్దాంతం(అది ఒక మతంలో భాగం) ప్రచారం చేస్తూన్న జిహాది మనస్తత్వం, పిడివాదం వల్ల ప్రపంచమంతటా కలుగుతోంది. అలాంటి శక్తులు భారత్ లో కూడా ఉన్నాయి. దీనికి తోడు బలవంతపు మతమార్పిడులు, నగర నక్సలిజం వంటివి సమాజంలో హింసను, వేర్పాటువాదాన్ని పెంచుతున్నాయి. జాతి పునర్నిర్మాణ కార్యంలో ముస్లింలు, క్రైస్తవులను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నా, మైనారిటీల పేరు చెప్పి వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్న జిహాదీ, విఘటన శక్తులపట్ల అప్రమత్తంగా ఉండడం కూడా చాలా అవసరం. ఈ నేపధ్యంలో జాతి ఎదుర్కొనే ప్రమాదాల గురించి శ్రీ గురూజీ చేసిన హెచ్చరికలు ఇప్పటికీ కూడా వర్తిస్తాయి.

మారుతున్న కాలానికి తగినట్లుగా హిందూ జీవన విధానం ఎలా మారుతుందో సంఘ కార్యం కూడా అలా రూపాంతరం చెందుతూ ఉంటుంది. 92 ఏళ్ల సంఘ ప్రయాణంలో అనేక ఎగుడుదిగుళ్ళు ఉన్నాయి. విపరీతమైన వ్యతిరేకత, అణచివేత, విష ప్రచారాన్ని సంఘం ఎదుర్కొంది. అయినా సంఘ కార్యం పెరుగుతూ పోయింది. దీనికి కారణం హిందూ తత్వంలో కనిపించే `స్థిరత్వంతో కూడిన సర్దుబాటు’ అనే గుణం.

డా. మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్