Home News 100కోట్ల వ్యాక్సినేష‌న్ ఘ‌నత సాధించిన‌ భార‌త్

100కోట్ల వ్యాక్సినేష‌న్ ఘ‌నత సాధించిన‌ భార‌త్

0
SHARE

క‌రోనాపై పోరాటంలో భార‌త్‌ అసాధార‌ణ మైలురాయిని అందుకున్న‌ది. నేటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ చ‌రిత్ర సృష్టించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. భార‌తీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భార‌తీయుల స్పూర్తికి ఇది సాక్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. వ్యాక్సినేష‌న్‌లో వంద కోట్లు దాటిన నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. ఈ అద్భుత‌మైన ఘ‌న‌త సాధ‌న కోసం కృషి చేసిన వైద్యులు, న‌ర్సులు, అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో ఈ రోజు ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

100కోట్ల వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు దేశాలు భారత్‌ కృషిని ప్రశంసిస్తున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా 100కోట్ల మార్క్‌పై అభినంద‌న‌లు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో మైలు రాయిని దాటిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.