Home News రైతుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి – భారతీయ కిసాన్ సంఘ్

రైతుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి – భారతీయ కిసాన్ సంఘ్

0
SHARE

భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం హైద‌రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లో రైతు గర్జన బహిరంగ సభ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు సుమారు 30వేల మంది అన్నదాతలు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జోగినపల్లి శ్రీ రంగారావు గారు అధ్యక్షత వహించిన ఈ స‌మావేశానికి భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహిని మోహన్ మిశ్రా జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులు పండించిన పంటల ఉత్పత్తులకు లాభసాటి ధరకు కొనుగోలు చెయ్యాల‌న్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంజాబ్, హర్యానా ఇతర రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ, తెలంగాణ రాష్ట్ర రైతుల మీద ప్రేమ లేద‌న్నారు. పంజాబ్ మండిలో రైతుల వద్ద నుండి కోట్ల రూపాయలు లూటీ చేస్తూ రైతులకు మోసం చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం వడ్లకు క్వింటాల్ కు 10 కేజీలు తాలు పేరుతో నష్టం చేస్తున్నార‌న్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కోసం కిసాన్ సమ్మన్ నిధి పెంచడం, వ్యవసాయ ఇన్ ఫుట్స్ కి GST లేకుండా చేయడం కోసం డిసెంబర్19 న ఢిల్లీలో రాంలీల మైదానం లో కిసాన్ గర్జన ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చింద‌ని తెలిపారు.

ప్రముఖ రైతు నాయకుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పర్యాద ఏండ్ల గారు మాట్లాడుతూ కూరగాయలు అమ్మే వాళ్లకు ఉన్న ఆదాయం పండించిన రైతుకు లేద‌ని, దయచేసి రైతులు భూమి అమ్ముకోవద్దన్నారు. మూడేండ్ల నుండి రుణమాఫీ చెయ్యని ముఖ్యమంత్రి పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షల అప్పు వేశాడ‌న్నారు. రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నార‌ని, రైతు సంక్షేమం కోసం పని చేసే వారిని ఎన్నుకోవాల‌న్నారు. రైతుల ఐక్యత ద్వారా మాత్రమే రైతు సమస్యలు పరిష్కార‌మ‌వుతాయ‌న్నారు. వ్యవసాయ రంగం సమస్యలు హక్కుల కోసం కిసాన్ సంఘం పోరాటం చేస్తోంద‌న్నారు.

జాతీయ కార్యదర్శి శ్రీ కొండెల సాయి రెడ్డి మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఏ పార్టీ సంబంధం లేదని రైతు సమస్యల పరిష్కారం కృషి చేస్తోంద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మన రాష్ట్ర రైతు సంఘాలు కనబటం లేదా అని ప్ర‌శ్నించారు. అన్ని జిల్లాల రైతుల‌కు రుణమాఫీ అమలు చేయాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని, ధాన్యం కొనుగోలు సరిగ్గా చెయ్యాల‌ని, 24 గంటల కరెంట్ సరఫరా చెయ్యాల‌ని, చక్కెర పరిశ్రమ పునరుద్ధరించాలని, అడవి జంతువులు నుండి పంటలను కాపాడాలని, పసాల్ భీమా ను అమలు చెయ్యాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి దోనూరు రాము, అఖిల భారతీయ కార్యవర్గ సభ్యులు నానా ఆక్రే, అఖిల భారతీయ కార్యవర్గ సభ్యులు ముదుగంటి శ్రీధర్ రెడ్డి, జె. కుమారస్వామి అఖిల భారతీయ ఎఫ్ పి ఓ ప్రముఖ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల వెంకటరెడ్డి గైని త‌దిత‌రులు పాల్గొన్నారు.