Home Telugu సార‌వంత‌మైన భూముల కోసం దేశవ్యాప్తంగా ‘భూ సుపోషణ్ ఉద్యమం’

సార‌వంత‌మైన భూముల కోసం దేశవ్యాప్తంగా ‘భూ సుపోషణ్ ఉద్యమం’

0
SHARE

బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే “భూ సుపోషణ” కార్యక్రమం ఏప్రిల్‌ 13 ఉగాది రోజున దేశమంతటా ప్రారంభమవుతోంది.

భూమిని సారవంతంగా ఉంచడానికి మ‌న పూర్వీకులు ఏం చేశారు?

భారతదేశంలో వ్యవసాయం వేలాది సంవత్సరాలుగా ప్రధాన భూమిక పోషిస్తున్నది. దీనికి ప్రామాణికంగా ‘కృషి పరాశర్’ లాంటి వైదిక గ్రంథాలున్నాయి. మన పూర్వులు మన భూమిని నిరంతరం సారవంతంగా ఉంచటానికి మన పరిసరాల్లో లభించే సాధనాలను ఉపయోగించేవారు. చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ, పంటల అవశేషాలను ఎరువుగా వాడి భూమిని సారవంతంగా ఉంచేవారు. మనదేశంలో వ్యవసాయం ముఖ్య ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తిని పెంచటం మాత్రమే కాదు. మన రైతులు మొదటి నుండి కూడా ప్రకృతి పట్ల ఆరాధనా భావం, మిగిలిన జీవ జంతువుల పట్ల బంధు భావన కలిగివుండేవారు. కానీ 60 సంవత్సరములకు పూర్వము అంటే 1960వ దశకంలో మన వ్యవసాయ రంగంలో నూత‌న మార్పులు వచ్చాయి. గోమూత్రం, పేడ ఆధారంగా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న మన వ్యవసాయం పూర్తిగా ఆధునిక రసాయనిక ఎరువులపై ఆధార ప‌డాల్సిన ప‌ర‌స్థితులు వ‌చ్చాయి. దీని వ‌ల్ల నేడు భూమి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ సమస్యలకు పరిష్కారం మనభూమికి అవసరమైన సహజ పోషక విలువలను అందించడం ద్వారా సారవంతంగా తయారుచేయడం.

అందుకోసం ఒక జాతీయ స్థాయి ఉద్యమానికి మన పెద్దలు మ‌హ‌త్త‌ర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ మహత్కార్యంలో వ్యవసాయం చేస్తున్న రైతులు, సంస్థలు, రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంస్థలు అన్నీ కలిసి పని చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా రైతు సోదర సోదరీమణులకు భూసారమును పరిరక్షించే పద్ధతులను తెలియజేసి వారిని జాగృతం చేయాలి.

భూమిని సరిగా పోషించటం అంటే ఏమిటి?

వేలాది సంవత్సరాలుగా మనదేశంలో భూమిని సారవంతంగా ఉంచే పద్ధతి ఆచారంగా వస్తున్నది. రైతులు అనేక తరాలుగా ఈ భూమిని తన తల్లిగా భావించి సరియైన పద్ధతిలో పోషించుకుంటూ వచ్చారు. భారతీయ రైతులు దేశవాళీ ఆవు మూత్రము, పేడ, పంటల అవశేషాలతో కూడిన ఎరువులు తయారు చేస్తుంటారు. అదేవిధంగా అనేక రకాలైన దేశీయ పద్ధతులలో భూమిని సారవంతంగానూ, ఉత్పాదకతను పెంచేదిగానూ చేసేవారు. అంతేకాకుండా భూమిని కొంత సమయం ఖాళీగా ఉంచడం ద్వారా, అంటే వ్యవసాయానికి విరామం ఇవ్వడం (Crop Holiday) ద్వారా, పంట అవశేషాలను కలిపి దున్నడం వంటి సులువైన పద్ధతుల ద్వారా మట్టిలో పోషక విలువలు పెరిగేలా చేస్తూ ఉండేవారు. భూమి పట్ల మనకున్న ఆలోచన ఒకటే. భూమిలో ఉన్న శక్తిని పీల్చిపిప్పి చేయడం కాదు. దానిని పెంచి పోషించడం ద్వారా భూమి పోషక విలువలను పెంచి సారవంతం చేయటం. అయితే దానికి జాతీయ ఉద్యమం ఎందుకు?

నేడు భారతదేశంలో భూమి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గడచిన 20 సంవత్సరాలుగా మితిమీరిన రసాయన ఎరువుల వాడకం, క్రిమికీటకాల నాశనానికి వాడే పురుగు మందులు వాడటం, మితిమీరిన రసాయనిక ఎరువులు వాడటం ద్వారా భూమి నిస్సారంగా తయారవుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. క్రమంగా భూమి చౌడు భూమిగా తయారవ్వడం, పంట భూమిలో మట్టి కొట్టుకు పోతూ ఉండడం వంటివి చూస్తూ ఉంటాం.

స్వాతంత్రం వచ్చిన తరువాత ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లేదు. అందువల్ల ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచవలసి వచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను, క్రిమి నాశక మందులను వాడటం ప్రారంభించారు.

ఆధునిక వ్యవసాయంలో ఆవు పేడతో కూడిన ఎరువు యొక్క వాడకం పూర్తిగా తగ్గి, రసాయనిక ఎరువుల వాడకం అధికంగా పెరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే విత్తనాల వాడకం కూడా భూసారం తగ్గటానికి కారణం అయింది. తక్కువ సమయంలో ఎక్కువ పంట పండించాలనే తొందరపాటు కూడా తోడయ్యింది.

ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల మనదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందనటంలో సందేహం లేదు. అయితే ఏ స్థాయిలో ఉత్పత్తి పెరిగిందో అదే స్థాయిలో భూమి యొక్క సారము క్షీణిస్తూ వచ్చింది. కేవలం ఉత్పత్తి మీద దృష్టి పెట్టడం వల్ల భూమికి చాలా నష్టం జరిగింది. సామాన్య రైతుని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఎంత అయితే పెట్టుబడి పడుతున్నాడో ఆ స్థాయిలో రాబడి లేదు.

గత 60 సంవత్సరాలుగా ఆధునిక రసాయనిక ఎరువుల వాడకం, ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో భూమికి సరి అయిన నీటి వినియోగం జరగకపోవడం వంటి వాటి వల్ల మట్టిలో అనేక మార్పులు వచ్చాయి. మట్టిలో సహజంగా ఉండే మిత్ర కీటకాలు తగ్గిపోయాయి. పక్షి జాతులు కూడా అంతరించిపోయాయి. ఒకే రకమైన పంటను అధికంగా పండించే పద్ధతి కూడా అమలులోకి వచ్చింది. అంతర పంటలుగా నువ్వులు, పప్పులను పండించే పద్ధతిని వదిలి పెట్టేశారు. ఈ అంతరపంటలు తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని ఇచ్చేవి. ఈ రకమైన పంటలు కనుమరుగైపోయాయి.

“మాతా పృథ్వీ పుత్రోహం పృధివ్యాః” “భూమిని దోచుకోవడం కాదు. భూమిని పోషించుకోవాలి.”ఈ జాతీయ జాగరణ కార్యక్రమంలో పరంపరానుగతంగా వస్తున్న మన వ్యవసాయ పద్ధతులను కాలానికి అనుగుణంగా అవలంబించడం, వాటిని ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రజలలో జాగృతిని కలుగజేయాలి.

అభియాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?

చైత్ర శుక్ల పాడ్యమి 13–4–2021 మంగళవారం నుంచి ఆషాఢ పూర్ణిమ 24–7–21 శనివారం వరకు మూడు నెలలు ఉంటుంది. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది రోజున ఉదయం 10 గంటలకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని గ్రామాలలోని రైతుల కుటుంబాలతో సహా అత్యంత భక్తి శ్రద్ధలతో ” భూమి పూజ” కార్యక్రమంలో పాల్గొని భూమాతకు పూజ చేయాలి. దానితో బాటు భూ సంరక్షణ నిమిత్తం సంకల్పం తీసుకోవాలి.

ఈ అభియాన్ మొదటి దశలో ప్రశిక్షణ, ప్రత్యక్ష అనుభవం కోసం అనుభవజ్ఞులైన రైతులతో కలిపి మాట్లాడించాలి. జిల్లా కృషి విజ్ఞాన కేంద్రాలలో భూసార పెంపుకు మెళకువలు తెలియజేసే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పట్టణాలలో నివసించే సోదర సోదరీమణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కృషి చేయాలి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి రైతు కుటుంబం, పట్టణాలలో నివసించే ప్రతి వినియోగదారుల కుటుంబము కలిసి పని చేయాలి.  దేశం పట్ల ఈ భూమి పట్ల మన బాధ్యతను గుర్తెరిగి ఈ కార్య‌క్ర‌మంలో అంద‌రం భాగ‌స్వాముల‌మ‌వుదాం.

వి.ఎస్‌.కే ఆంధ్ర సౌజ‌న్యంతో