కమ్యూనిజం విఫలమైన సంగతి 1990లలో లోకానికి తెలిసింది, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పెట్టుబడిదారి విధానం కూడా చతికిలపడిన వాస్తవం కూడా వెల్లడైంది అంటున్నారు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు సజ నారాయణన్ సి.కె. కాబట్టి ఒక కొత్త వ్యవస్థ కోసం, అందరికీ సుఖశాంతులు పంచాలని చెప్పే తాత్వికత కోసం ఇవాళ ప్రపంచం ఎదురుచూస్తున్నదని ఆ సంస్థకు రెండవసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన నారాయణన్ అభిప్రాయపడతున్నారు. బీఎంఎస్, బీజేపీ రెండూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను ఆదర్శంగా తీసుకుని పనిచేసేవే. ఆ సంస్థ అడుగుజాడను అనుసరించేవే. కానీ కొన్ని అంశాలలో బీజేపీకీ, బీఎంఎస్‌కూ వైరుధ్యాలు ఉండేవి. అయితే ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి కార్మిక అనుకూల ప్రభుత్వంగా అవతరించిందని సజ నారాయణన్ అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు నీతి ఆయోగ్‌ను బీఎంఎస్ స్వాగతించలేదు. నీతీ ఆయోగ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సర్వరోగ నివారణిగా భావించడాన్ని బీఎంఎస్ జీర్ణించుకోలేకపోయింది. పైగా నీతి ఆయోగ్ వల్ల కొత్తగా ఉద్యోగాలు రావడం కాదు, ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయని ఆ సంస్థ అభిప్రాయం. అలాగే అమెరికా నిపుణుల సలహాలతో భారతీయ ఆర్థిక వ్యవస్థను నిర్వహించాలన్న ఆలోచనను కూడా బీఎంఎస్ నిరాకరిస్తోంది. 1998 నాటి ఆసియా ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని ప్రభావితం చేయలేకపోయింది. 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం కూడా తాకలేకపోయింది. ఇందుకు కారణం భారత్‌కు సహజ సిద్ధంగా సంక్రమించిన సంపదేనని సజ నారాయణన్ అంటున్నారు. ఈ సహజ సంపదనే ఆర్థిక సంస్కరణల ద్వారా ధ్వంసం చేసే యత్నం జరిగిందని ఆయన చెప్పారు. ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు నారాయణన్ తో జరిపిన ముఖాముఖీలోని అంశాలు.
భారత కార్మిక రంగంలో ప్రస్తుతం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) స్థానం ఏమిటి?
దేశంలోనే బీఎంఎస్ ఇప్పుడు అతి పెద్ద సెంట్రల్ ట్రేడ్ యూనియన్. గిరిజన సంస్థల మొదలు, బీమా కార్యాలయాల వరకు 40 రంగాలకు చెందిన 5, 300 సంఘాలు ఇందులో ఉన్నాయి. మన ముప్పయ్ రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలలో బీఎంఎస్‌దే ఆధిపత్యం, ఆధిక్యత. చాలాకాలం పాటు దేశంలో ఒక భావన ఉండేది. కార్మికోద్యమం అంటే అది కమ్యూనిస్టుల సొంతమని! కానీ బీఎంఎస్ బలపడిన తరువాత సీఐటీయు ఐదో స్థానంలోకి పడిపోయింది. దీనితో కార్మికోద్యమం అంటే కమ్యూనిస్టుల గుత్త సొత్తు కాదని స్పష్టమయింది. ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి కార్మిక సంఘాల స్థితిగతులు, బలాబలాల గురించి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. దాని ప్రకారం 1989 నుంచి కూడా దేశంలో బీఎంఎస్ ప్రథమ స్థానంలో ఉన్నట్టు తేలింది.
కార్మిక వ్యవస్థలో కమ్యూనిస్టులు పని సంస్కృతిని భగ్నం చేశారన్న ఆరోపణ ఉంది. ఇదెంతవరకు నిజం?
అది నిజమే! నిజమని నేను, మా బీఎంఎస్ చెప్పడం కాదు, ఆ విషయం చారిత్రకంగా రుజువైనదే కూడా. భారతదేశంలో ఏఐటియు మొదటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్. దీనిని భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆనాడు ప్రారంభించారు. గాంధీజీ దీనికి వ్యతిరేకం. రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలను ఏర్పాటు చేయరాదన్నది ఆయన సిద్ధాంతం. కాంగ్రెస్ నాయకత్వం నిర్వాకం వల్ల ఈ ఏఐటీయు తరువాత నాటి సీపీఐ చేతిలోకి వెళ్లిపోయింది. దీని పర్యవ సానం ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ సంస్కృతి, ధోరణి కార్మిక రంగ సంస్కృతిగా, ధోరణిగా పరిణమించింది. అదే వర్గ పోరాటం. కార్మికులకు, యాజమన్యాలకు మధ్యన ఉండవలసినది సంఘర్షణ మాత్రమేనన్న ధోరణి ప్రబలింది. యాజమాన్యాలను కార్మికులు శత్రువుల మాదిరిగా చూడడం మొదలయింది. ఐఎన్‌టీయూసీ సహా మిగిలిన కార్మిక సంఘాలు కూడా ఈ ధోరణినే అనుసరించాయి. ఇదంతా గమనించిన తరువాతే 1955లో దత్తోపంత్ ఠేంగ్డీ భారతీయ మజ్దూర్ సంఘ్‌ను స్థాపించారు. ఇందులో కార్మికులను ఉద్యోగ పరివారంగా భావించడం ఒక సంస్కృతి. యాజమాన్యం, ఉద్యోగ పరివారం కలపి ఒకే కుటుంబంగా భావిస్తాం. పైగా మా సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. 34 సంవత్సరాలుగా దేశంలో ప్రథమ స్థానంలో బీఎంఎస్ నిలబడి ఉండడం వెనుక విజయ రహస్యం ఇదే.
అరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం… అందులో 34 ఏళ్లు అగ్రస్థానం. ఈ మొత్తం ప్రస్థానంలో ప్రభుత్వాలకీ, బీఎంఎస్‌కీ మధ్య సంబంధాలు ఎలా సాగాయి?
1991 వరకు కూడా మన దేశ ఆర్థిక విధానంతో సహా, చాలా అంశాలకు సోవియెట్ రష్యా ఆదర్శంగా ఉండేది. 1991 తరువాత ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశించాయి. ‘ఎల్’, ‘పి’, ‘జి’ వచ్చింది. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దీని ఫలితంగా మన దేశంలో చాలా పరిశ్రమలు మూతపడిన మాట నిజం. లక్షల సంఖ్యలో కార్మికులు ఉద్వాసనకు గురైనారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. అటు వస్తుతయారీ రంగంలో, ఇటు సాగులో కూడా సంక్షోభం తలెత్తింది. రైతుల బలవన్మరణాలు తీవ్రమైనాయి. అందుకే కార్మిక సంఘాలు ప్రభుత్వంతో ఘర్షణ పడక తప్పలేదు. పోరాడక తప్పలేదు. యూపీఏ హయాంలో ఇదే కొనసాగింది. తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మొదట్లో బీఎంఎస్ చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. నిజానికి 1947 తరువాత కూడా కార్మిక రంగం ప్రభుత్వంతో ఇబ్బంది పడింది. కొత్తగా స్వాతంత్య్రం వచ్చింది కాబట్ట చాలా వ్యవస్థలకు కొత్త రూపు ఇచ్చుకుంటున్న తరుణంలో కార్మిక చట్టాలు కూడా చర్చ కోసం పార్లమెంటు ఎదుటకు వచ్చాయి. కానీ కార్మి సంఘాలను సంప్రతించకుండానే ఇది జరిగింది. ఇది అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఒ) నిబంధనలకు విరుద్ధం. ఈ పరిస్థితిని ఎదుర్కొన డానికి బీఎంఎస్ అనుసరిస్తున్న విధానమే సంఘర్ష్ -సంవాద్ విధానం. అంటే మొదట చర్చలు జరుపుతాం. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి మా వంతు కృషి మేం చేస్తాం. అప్పటికీ సయోధ్య సాధ్యం కాకుంటేనే ఉద్యమ బాట పడతాం. ఇది బీఎంఎస్ విధానం.
ఇప్పుడు ఎన్డీఏ కార్మికులను బాగా అర్థం చేసుకోగలుగుతోంది. చట్టాలకు సంబంధించి అన్ని కార్మిక వ్యతిరేక సవరణలను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రపంచీకరణ తరువాత మొదటిసారి నీతి ఆయోగ్ ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం అవలంబిస్తున్నది. ఇందులో కార్మిక వ్యతిరేకత లేదు. అంతేకాదు, నీతి ఆయోగ్ పత్రం మేరకు కార్మిక చట్టాలలో, వాటి సవరణలలో సానుకూల చర్యలు కూడా ఆరంభించిందది. దీని ప్రకారం-బోనస్ ప్రయోజనాలు రెట్టింపు అయ్యాయి. గ్రాట్యుటీ, ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కూడా మెరుగయ్యాయి. అసంఘటిత కార్మికరంగంలోని వారికి వేతనాలు పెరిగాయి. అంగన్‌వాడి, ఆశా వర్కర్ల జీతాలు రెట్టింపు అయ్యాయి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు కూడా రెట్టింపు అయినాయి. దాదాపుగా 30 లక్షల మంది కార్మికులకు వీటితో లబ్ధి చేకూరింది. ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగులకు కూడా ఉన్నారు. కమలేశచంద్ర నివేదిక అమలుకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కార్మికుల ప్రయోజనాలకు సంబంధించి ఈ ప్రభుత్వం మరొక పెద్ద ముందడుగు వేసింది. అదే లేబర్ కోడ్ ఆన్ వేజెస్‌కు రూపం ఇవ్వడం. చిట్టచివరి కార్మికునకు కూడా కనీస వేతనం అందించాలన్నదే ఈ కోడ్ ధ్యేయం. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. స్థాయీ సంఘం ఆమోదం కూడా లభించింది. ఈ బడ్జెట్‌లో లేబర్ కోడ్ ఆన్ వేజెస్ చోటు చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇంకొక చట్టం గురించి కూడా చెప్పాలి. అది లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఇది చర్చల స్థాయిలో ఉంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం అవుతుంది. దీనితో చిట్టచివరి కార్మికునికి కూడా దాదాపు 14 ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.
కార్మికుడు అన్న పదానికి ఉన్న నిర్వచనాన్ని విస్తరించబోతున్నారు. ఇలాంటి ప్రయత్నం జరగడం ఇక్కడ ఇదే మొదటిసారి. స్వయం ఉపాధి కార్మికులు, విదేశాలలో ఉండే భారతీయ కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు కూడా దీని పరిధిలోకి వస్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కార్మికమంత్రిగా పనిచేసిన తరువాత కార్మికులకు ఇంత పెద్ద ప్యాకేజీ కోసం ఆలోచించడం ఇదే మొదటిసారి. ఇదంతా మోదీ అనుసరిస్తున్న కార్మికు సానుకూల విధానానికి నిదర్శనమే. ఇకపై కార్మికులకు వ్యతిరేకంగా ఉండే ఏ విధమైన చట్టం తీసుకురావడం జరగదని కూడా ఆయన హామీ ఇచ్చారు.
నవరత్నాల విక్రయం ఆలోచనతో నాడు వాజపేయి ప్రభుత్వం కొంత ఇరకాటాన్ని ఎదుర్కొన్నది కదా! అందులో బీఎంఎస్ వైఖరి ఏమిటి?
పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రభుత్వాధీనంలోనే ఉండాలన్నది మనం అనుసరించిన మునుపటి విధానం. దీనినే ‘1940 బాంబే పథకం’ అని అంటాం. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల తొలి ప్రాధాన్యం లాభాలు సాధించడం కాదు. సేవ వాటి ప్రథమ లక్ష్యం. అంటే మొత్తంగా చూస్తే సేవే ప్రభుత్వ రంగ సంస్థల ధ్యేయమవుతుంది. అయితే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలను కురిపించవు. అయినా ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు చక్కని లాభాలనే తెచ్చిపెడుతున్న సంగతిని మరచిపోరాదు. గుర్తుంచుకోవలసిన అంశం- ఇప్పటికీ పారిశ్రామిక రంగం నుంచి ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంలో ప్రభుత్వ రంగంలోని పరిశ్రమల నుంచి వస్తున్న వాటాయే పెద్దది. కానీ, మనం నష్టాలు తెస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల గురించే పదే పదే చెబుతూ ఉంటాం. మోదీ వచ్చాక చార్టర్డ్ అకౌంటెంట్ల బృందంతో మాట్లాడుతూ ఒక హామీ ఇచ్చారు. నష్టాలతో ఉన్నాయన్న పేరుతో పరిశ్రమలను మూసేయబోమని హామీ ఇచ్చారు. పైగా వాటిని ప్రొఫెనలైజ్ చేస్తామని చెప్పారు. ఇది మంచి విధానం.
ఎల్‌పిజీ సంస్కరణల ప్రభావం ఏమిటి?
ఎల్‌పీజీ సంస్కరణలు ఎంత ప్రమాదకరమో 2008 నాటి ఆర్థిక సంక్షోభమమే ప్రపంచానికి చాటి చెప్పింది. మన వస్తు తయారీ రంగం సంక్షోభంలో ఉంది. దీనికి మూలం కూడా ఎల్‌పీజీ సంస్కరణలే. స్వదేశీ ఆర్థిక విధానాలే ఈ సమస్యకు సమాధానం. మన ఆర్థికాభివృద్ధికి కూడా అవే దోహదం చేస్తాయి. విఫలమైన విదేశీ ఆర్థిక సంస్కరణలతో, విధానాలతో భారత్ ముందుకు వెళ్లలేదు. వాటితో సాధించేదేమీ ఉండదు. 27 ఏళ్ల ఎల్‌పీజీ సంస్కరణల ఫలితాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, డబ్ల్యుటివో ప్రభావం వంటి అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ బీఎంఎస్ తీర్మానం చేసింది.
కార్మికుల పనిగంటలు అనే అంశం చరిత్రాత్మకమైనది. దీనికి ఉన్న మానవీయ కోణాన్ని, ఇందులోని సంక్షేమ దృక్పథాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఇప్పుడు కార్మికులకు పనిగంటలు అనే అంశమే మరచిపోయే విధంగా ప్రైవేటు, సేవారంగాలు వ్యవహరిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల సమష్టి పోరాటం తరువాత కార్మికులు సాధించుకున్న గొప్ప హక్కుకు తీవ్ర స్థాయిలో భంగం వాటిల్లినట్టే కదా! ఈ అంశంలో బీఎంఎస్ స్పందన ఏమిటి?
ఐటీ పరిశ్రమలు, సెజ్‌లు, వస్తు తయారీ జోన్లు, బహుళజాతి సంస్థలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న మాట వాస్తవం. కొన్ని సంస్థలు ఉద్యోగుల చేత 14 గంటలు కూడా పని చేయిస్తున్నాయి. ఇంటి నుంచి పని చేయమని ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఈ సంస్థలు, రంగాలు అసంఘటితంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు ఇక్కడ పనిచేయవు. అయినా బీఎంఎస్ ఇప్పుడిప్పుడు అవతరిస్తున్న కొన్ని రంగాలలో తన శాఖలను ఏర్పాటు చేయగలిగింది. అసలు విషయానికి వస్తే, చాలా ప్రైవేటు సంస్థలు, ప్రధానంగా ఐటీ రంగం కార్మిక చట్టాల నుంచి నాలుగు మినహాయింపులను కోరుతున్నాయి. కానీ ఇందుకు బీఎంఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకే ప్రభుత్వం కూడా అలాంటి కార్మిక వ్యతిరేక మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించడం లేదు.
వ్యవసాయ రంగం గురించి బీఎంఎస్ దృష్టి కోణం ఏమిటి?
భారత వ్యవసాయరంగం పెను సంక్షోభంలో ఉన్నమాట నిజం. ఆర్థిక సంస్కరణలు కూడా ఆ సంక్షోభం ఉధృతం కావడానికి తనవంతు సాయం చేశాయి. రైతుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. సంస్కరణల పేరిట ఒక వింత విధానం దేశం మీద రుద్దారు. వ్యవసాయ భూములను పారిశ్రామిక భూములుగా మార్చారు. పారిశ్రామిక భూములని సేవారంగానికి కట్టబెట్టారు. దీనితో వృద్ధి సాధ్యమవు తుందని అనుకున్నారు. చాలా కర్మాగారాలను మాల్స్‌గా మార్చేశారు. సేవల రంగాన్ని ఇంజన్ ఆఫ్ గ్రోత్ అనడం మొదలయింది. వాస్తవంలో అదేమీ కనిపించలేదు. దేశంలో యాభయ్ శాతం కార్మిక శక్తికి పని కల్పిస్తున్నది సేద్యమే. 60 శాతం ఎగుమతులు ఆ రంగం నుంచే జరుగుతున్నాయి. ఉపాధి కల్పనలో తరువాతి స్థానం మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీది. దురదృష్టవశాత్తు ఈ రెండు రంగాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. నగరాలకు, పట్టణాలకు ఉపాధి కోసం జరుగుతున్న వలసలన్నీ వ్యవసాయం రంగం నుంచే కదా! పల్లెల నుంచి కూడా పట్టణాలకు భవన నిర్మాణ రంగం తదితర రంగాలలో పనిచేయడానికి జనం వలస పోతున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయక పోతే భారత్ ఉద్యోగాలను, ఉపాధిని కల్పించలేదు. అంటే ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోలేదు.
– ఇంటర్వ్యూ : కోరుట్ల హరీష్, జాగృతి