Home Telugu Articles బ్రిటన్‌ పార్లమెంటుపై దాడి: పెనంమీద నుంచి పొయ్యిలోకి…

బ్రిటన్‌ పార్లమెంటుపై దాడి: పెనంమీద నుంచి పొయ్యిలోకి…

0
SHARE

మాటు వేసిన ఐఎస్‌ ఉగ్రవాద వ్యాఘ్రం మరోమారు పంజా విసరింది. బ్రిటిష్‌ పార్లమెంటు సముదాయ సమీపంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి యావత్‌ ప్రపంచాన్నే దిగ్భ్రాంతపరచింది. ఖాలిద్‌ మసూద్‌ (52) అనే ఉన్మాది చరిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్‌ వంతెనపై విచ్చలవిడిగా కారు తోలి 40మంది పాదచారుల్ని తీవ్ర క్షతగాత్రుల్ని చేసింది చాలక, సమీప పార్లమెంటు భవనంలోకి చొరబడే ప్రయత్నంలో అక్కడి పోలీసు అధికారిని కిరాతకంగా కడతేర్చాడు. ముంచుకొచ్చిన ముప్పుపై అప్రమత్తమైన భద్రతాదళాల కాల్పుల్లో మసూద్‌ హతమారిపోయాడు. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆదేశాల మేరకు బ్రిటన్‌ పార్లమెంటుపై తాజా దాడి జరిగిందని ఐఎస్‌ ప్రకటించింది. పదకొండు దేశాలకు చెందిన ప్రజలు తీవ్రంగా గాయపడ్డ ఈ మృత్యుదాడిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బ్రిటన్‌ ప్రజాస్వామ్యం పీక నులమడానికి చేసిన విఫలయత్నంగా ఈ ఘోరకలిని ప్రధాని థెరెసా మే తోసిపుచ్చినా- మసూద్‌కు సైదోడుగా మరికొందరూ ఉగ్రదాడికి పాల్పడితే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకొంటేనే భయమేస్తోంది. ఈ ఏడాది మొదట్లో టర్కీలోని ఇస్తాంబుల్‌ నైట్‌ క్లబ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు సహా 40మందికి పైగా బలైపోయారు. తుపాకులతో విచ్చలవిడి కాల్పులకు తెగబడి టర్కీ ఉగ్రవాది నెత్తుటేరుల్ని పారించడం గమనిస్తే- మసూద్‌ ఆ తరహా మారణాయుధాల జోలికి పోకపోబట్టే, ప్రాణనష్టం పరిమితంగా ఉందని చెప్పకతప్పదు. ఆ దుర్ఘటన జరిగిన మరునాడే బ్రసెల్స్‌లో రద్దీగా ఉండే ఓ దుకాణ సముదాయ ప్రాంగణంలోకి తీవ్రవేగంతో కారును నడిపిస్తూ వచ్చిన దుండగుణ్ని పోలీసులు నిర్బంధించారు. కత్తులు, షాట్‌గన్‌, ద్రవీకృత గ్యాస్‌ డబ్బాతో వచ్చిన ఆ దుండగుడి ఉద్దేశం ప్రజల్ని చంపడమే కావచ్చని ఫ్రాన్స్‌ అధ్యక్షులు హొలాన్‌ చెబుతున్నారు. ధనిక, పేద అన్న వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా అన్ని దేశాలకూ ఉగ్రవాదం పెనుముప్పు పొంచి ఉందన్నది నిజం. సాధారణ పౌరుల్ని సామూహిక జనహనన ఆయుధంగా మార్చేస్తున్న ఐఎస్‌ తరహా ప్రతీప శక్తుల ఆట కట్టించాలంటే- ఐక్యరాజ్య సమితి సారథ్యంలో ఉమ్మడి కార్యాచరణే శరణ్యం!

ఇరాక్‌ యుద్ధం సరికొత్త ఇస్లామిక్‌ జిహాదీల పుట్టుకకు కారణభూతమై ఇతర దేశాల్లో చిచ్చు రగిలించే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన సీఐఏ 2005లోనే నివేదించింది. ఇరాక్‌ గడ్డపై ఉగ్రవాద శిక్షణ పొందినవారు తమ నైపుణ్యాల్ని బ్రిటన్‌లో పరీక్షించే ప్రమాదం లేకపోలేదన్న హెచ్చరికలు వెలుగుచూసిన పక్షంరోజుల్లోనే లండన్‌ రవాణా వ్యవస్థపై అల్‌ఖైదా ఉగ్రదాడి భయోత్పాతం సృష్టించింది. ‘ఉగ్రవాదం పరమోద్దేశమే ప్రజల్ని భయకంపితుల్ని చేయడం… మేము భయపడబోం’ అని అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్‌ అన్న మాటల్నే కాస్త అటూఇటూగా నేటి ప్రధానమంత్రి వల్లెవేస్తున్నా, ఈ పుష్కరకాలంలో టెర్రరిస్టుల యుద్ధతంత్రం గణనీయంగా మారిపోయింది. 2013 లగాయతు 13 ఉగ్రకుట్రల్ని ఛేదించామంటున్న బ్రిటన్‌- ఒంటరిగానే విధ్వంసాలకు తెగబడే ఐఎస్‌ సానుభూతిపరుల ఆచూకీ పసిగట్టడం కష్టసాధ్యమేనని అంగీకరిస్తోంది. అల్‌ఖైదాను మించిన ఉగ్రశక్తిగా ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఐఎస్‌ను సర్వనాశనం చెయ్యడమే అమెరికా లక్ష్యమని 2014 సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా చాటారు. ఇరవై రెండు నెలల సుదీర్ఘ కార్యాచరణ తరవాతా ఐఎస్‌ ఉగ్రవాద సామర్థ్యాన్ని తలచిందే తడవుగా దాడి చేయగల శక్తిని ఏ మాత్రం తగ్గించలేక పోయామని సీఐఏ సంచాలకుడు నిరుడు జూన్‌లో అంగీకరించారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాధిపతిగా ట్రంప్‌ రాక- ఉగ్రవాద శక్తులకు కొత్తకోరల్ని మొలిపించే హ్రస్వదృష్టి విధానాల్ని తెరపైకి తెచ్చింది. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షల విధింపు నిర్ణయం- ఐఎస్‌కు అనుకూలంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పెనంమీదనుంచి పొయ్యిలోకి… చందంగా పరిస్థితులు దిగజారకూడదంటే, సర్వామోద కార్యాచరణ సత్వరం పట్టాలకెక్కాలి!

ఉగ్రవాదం కోరలు పెరికేందుకు అనుసరించాల్సిన విధి విధానాల్ని 1998 ఫిబ్రవరిలో ‘కైరో డిక్లరేషన్‌’ నిర్దేశించింది. అప్పటికి పన్నెండేళ్ల క్రితమే ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని పట్టాలకెక్కించిన భారత్‌- ఉమ్మడి పోరుకు కూడిరావాలని చెవినిల్లు కట్టుకొని పోరినా అగ్రరాజ్యాలనుంచి సరైన మద్దతు కొరవడింది. ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఇవ్వలేక ఐక్యరాజ్య సమితి నేటికీ నీళ్లు నములుతోందంటే, అది దేశాల నడుమ స్వార్థపర దుర్రాజకీయాల చలవే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నేడు బ్రిటన్‌కు సందేశం పంపినా, పాక్‌ ప్రాపులోని హఫీజ్‌ సయీద్‌పై ఉగ్రవాద ముద్రపడకుండా అడ్డుకోవడం నయవంచక నవ్యచాలనే! రెండేళ్లలో పాతికవేల మంది ఐఎస్‌ ఉగ్రవాదుల్ని, 120మంది కీలక నేతల్ని అంతమొందించామని, 2014లో నెలకు 2,000మంది ఐఎస్‌లో చేరినవారుంటే, ఇప్పుడు ఆ సంఖ్య రెండొందలకు పరిమితమైందని అమెరికా చెబుతోంది. అయితేనేం? అంతర్జాలం ద్వారా యువజనం మనసుల్ని విషకలుషితం చేస్తున్న ఐఎస్‌- దేశ దేశాల్లోకీ చొచ్చుకుపోయి, స్థానిక పౌరుల్నే తన మాట జవదాటని యోధులుగా మార్చేస్తోంది. ఈ వైపరీత్యాన్ని కాచుకొనే సమర్థ వ్యూహం అమెరికా చెంత కూడా లేదని నిరుడు జూన్‌ 12న అర్లాండో నైట్‌క్లబ్‌పై జరిగిన మృత్యుదాడి వెల్లడిస్తోంది. ఈ పరిస్థితుల్లో- అమాయక జనహననానికి పాల్పడే వికృతత్వాన్నే ఉగ్రవాదంగా పరిగణించి, టెర్రరిస్టు స్థావరాలు ఎక్కడున్నా నేలమట్టం చేసే పటుతర అంతర్జాతీయ ఉమ్మడి పోరాట వ్యూహం వెంటనే రూపుదాల్చాలి. మతాన్ని, ఉగ్రవాదాన్ని ఒకే గాటన కట్టే పెడధోరణుల్ని విడనాడి టెర్రరిజంపై ఏకోన్ముఖ యుద్ధం సాగించాలి!

(ఈనాడు సౌజన్యం తో)