Home News సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

0
SHARE

– బల్బీర్ పుంజ్

పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేత, హింసలకు ముగింపు పలుకుతూ, తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రకారం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టాన్ని నోటిఫై చేసింది.

నిజానికి, సీఏఏ నిజమైన లబ్ధిదారులు ప్రధానంగా దళితులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఉన్న హిందూ జనాభాలో వీరే మెజారిటీగా ఉన్నారు. దేశ విభజన అనంతరం అక్కడి ఇస్లామిక్ పాలనలో పౌర హక్కులు లభించక, వివక్షకు గురైన దళిత హిందువుల విముక్తికి ఈ చట్టం మార్గం సుగమం చేస్తుంది. దేశవిభజన కాలంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లోని హిందువులు భారతదేశంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నప్పుడు, పెద్ద సంఖ్యలో దళిత హిందువులు సరిహద్దులు దాటకుండా బలవంతంగా అడ్డుకున్నారు. పాకీపనుల వంటి పలు పనులు చెయ్యడం కోసం వీరు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేలా చేశారు. అదే సమయంలో, కొత్తగా ఏర్పడిన దేశంలో పెద్ద ఎత్తున భూములు ఉన్న అగ్రవర్ణ హిందువులు దేశం విడిచి వెళ్లేలా మతోన్మాద ముస్లిం మూకలు చేశాయి. ఫలితంగా అగ్రవర్ణ హిందువులు వదలిపోయిన భూమి, ఆస్తులను దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికీ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని దళితులు అధమస్థాయి పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితులున్నాయి.

పాకిస్తాన్‌లోని మొత్తం మూడు మిలియన్ల హిందూ జనాభాలో దళితులు 80 నుంచి 85 శాతం వరకూ ఉన్నారు. పాకిస్తాన్‌లో భిల్లులు, మేఘవాల్‌లు, ఓద్‌లు, కోహ్లీల వంటి 42 వేర్వేరు దళిత కులాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని దళితులలో ఎక్కువ మంది సింధ్‌లో నివసిస్తుండగా.. దక్షిణ పంజాబ్ , బలూచిస్తాన్ ప్రాంతాలో దళితులు తక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని దళిత హిందువులు అత్యంత పేదరికంలో బతుకుతున్నారు. వీరిలో 70 శాతానికి పైగా నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో సుమారు 1కోటి 40లక్షల హిందూ జనాభా ఉన్నట్లు లెక్కించగా, ఆ దేశపు మొత్తం జనాభాలో వీరు 8.5 శాతం ఉంటారు. ఈ మొత్తం హిందువులలో 60 నుంచి 70 లక్షలకు పైగా దళితులు ఉన్నారు.

పాకిస్తాన్ నుండి అందిన నివేదికల ప్రకారం, అగ్రవర్ణ హిందువులతో పోల్చితే, దళితులే ఎక్కువ సంఖ్యలో దారుణమైన వివక్ష, అపహరణలు, అత్యాచారాలు, దైవదూషణ, పేదరికానికి గురవుతున్నారు. బహుశా, యావత్తు దక్షిణాసియాలో అత్యంత హింసకు గురవుతున్న మతపరమైన మైనారిటీ సమూహాలు వీరే కావచ్చు. ఇక బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ నాయకత్వంలో వ్యవస్థీకృతంగాను, సంస్థాగతంగాను కొనసాగుతున్న మతపరమైన హింస అక్కడి మైనారిటీలను మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టింది. బంగ్లాదేశ్‌లోని హిందువులకు వ్యతిరేకంగా “బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ” ప్రేరణతో కొనసాగుతున్న హింసాకాండ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం రోజుల నుంచీ క్రమంగా పెరుగుతూనే ఉంది. నివేదికలందించిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ శరణార్థులలో ఎక్కువమంది దళితులే.. పశ్చిమ బెంగాల్‌లో 1979 నాటి సీపీఎం ప్రభుత్వ ప్రేరేపిత మరీచ్‌ఝాపి ఊచకోతలో కూడా దాదాపుగా బాధితులంతా దళితులే.. నాటి పాలక వర్గం ఊతమివ్వగా కొనసాగిన హింస, పోలీస్ కాల్పులు, ఆకలి చావులు, వ్యాధులకు 15 వేల మందికి పైగా దళిత శరణార్థులు బలైపోయారు.

దళితులందరూ భారతదేశానికి తిరిగిరావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కోరుకున్నారు?

పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీల ప్రస్తుత పరిస్థితి దేశవిభజన సమయంలో జరిగిన తప్పుల ప్రత్యక్ష ఫలితం, సహజ పరిణామ క్రమం. నాటి చారిత్రాత్మక తప్పిదాలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించేందుకు సీఏఏ ప్రయత్నిస్తున్నది. మన భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇస్లామిక్ రిపబ్లిక్‌లో హిందూ మైనారిటీల ప్రస్తుత దుస్థితిని ఆనాడే ఊహించారు. అందుకే ఆయన రెండు దేశాల మధ్యా ‘జనాభా బదిలీ’ కోసం బలంగా పట్టుబట్టారు. పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ ‘తమకు దొరికిన మార్గాల ద్వారా’ భారతదేశానికి రావాలని ఆయన కోరుకున్నారు. ‘ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం’ షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని డాక్టర్ అంబేద్కర్ స్పష్టంచేశారు. పాకిస్తాన్, హైదరాబాదులోని దళితులు అగ్రవర్ణ హిందువులపై అయిష్టత కారణంగా ముస్లింల పక్షాన ఉండరాదని పలుమార్లు హెచ్చరించారు. అంతేగాక అటువంటి అభిప్రాయాన్ని (అగ్రవర్ణ హిందువులపై వ్యతిరేకతను) కలిగి ఉండటం ‘తప్పుడు అభిప్రాయం’ అని పేర్కొన్నారు.!

“పాకిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల వారు… తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే అటు పాకిస్తాన్‌లో గాని, ఇటు హైదరాబాదులో గాని, ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం’ షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకం. అగ్రవర్ణ హిందువుల పట్ల అయిష్టత కారణంగా ముస్లింలను తమ మిత్రులుగా చూడటం షెడ్యూల్డ్ కులాలవారికి అలవాటుగా మారింది. ఇది తప్పుడు అభిప్రాయం” అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. (ది ఫ్రీ ప్రెస్ జర్నల్, నవంబర్ 28, 1947 నాటి సంచికలో “డాక్టర్ అంబేద్కర్: లైఫ్ అండ్ మిషన్” పేరిట ధనంజయ్ కీర్ రచించిన వ్యాసం, పేజీ. 399)

ముస్లింల పట్ల బుజ్జగింపు విధానాన్ని అనుసరించడం ద్వారా దళితుల పట్ల ఉదాసీనతకు ప్రత్యక్ష కారణమైన నాటి ప్రధాని నెహ్రూ, అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీల తీరును విమర్శించడంలో అంబేద్కర్ ఏమాత్రం వెనుకాడలేదు. “కాంగ్రెస్ పార్టీ హృదయంలో షెడ్యూల్డ్ కులాల వారికి ఏ మాత్రం స్థానం లేదు. ప్రధాని నెహ్రూ ముస్లిం వ్యామోహంతో బాధపడుతున్నారు. షెడ్యూల్డ్ కులాల వారి విషయంలో ఆయనది దయలేని హృదయం…” అని డాక్టర్ అంబేద్కర్ 1951 అక్టోబర్‌లో జలంధర్‌లో జరిగిన బహిరంగసభలో అన్నారు (ది ఫ్రీ ప్రెస్ జర్నల్ పత్రికలో “డాక్టర్ అంబేద్కర్: లైఫ్ అండ్ మిషన్” పేరిట ధనంజయ్ కీర్ రచించిన వ్యాసం, పేజీ. 438). ఒక ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ముస్లిమేతరులు జీవించడం అసాధ్యమన్నది డాక్టర్ అంబేద్కర్ నమ్మకం. “ఇస్లాం అనేది ఒక గోప్యమైన పౌర వ్యవస్థ. అక్కడ ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య చూపే వ్యత్యాసం చాలా స్పష్టంగా, నిశ్చయాత్మకంగా, చాలాదూరంలో నిలిపేంతటి వివక్షతో కూడినది. ఇస్లాంలోని సోదరభావం అనేది మానవులందరి మధ్యా ఆశించే సార్వత్రిక సోదరభావం కానే కాదు. అది “ముస్లింల కోసం మాత్రమే ముస్లింలు..” అనే సోదరభావం. దీని ప్రయోజనం ఆ గోప్యమైన పౌర వ్యవస్థలోని వారికి మాత్రమే పరిమితం. ఈ వ్యవస్థకు బయటనున్నవారికి దక్కేవి ధిక్కారం, శత్రుత్వం మాత్రమే..” అని “పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా” అనే తమ విశిష్ట రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాశారు.

ఇస్లాం మత సూత్రాలననుసరించి రూపొందించిన ముస్లిం చట్టం ప్రకారం ప్రపంచం రెండు శిబిరాలుగా ఉంటుంది. దారుల్-ఇస్లాం (ఇస్లామిక్ రాజ్యం), దారుల్-హరబ్ (ఇస్లామిక్ పాలన లేని యుద్ధ భూమి). ఇస్లాం పాలన ఉన్న దేశం దారుల్‌ ఇస్లాం అయితే, ముస్లింలు ఉన్నప్పటికీ వారి పాలన లేని దేశం దారుల్‌ హరబ్‌. ఇస్లామిక్ మతసూత్రాల ప్రాతిపదికన రూపొందిన ముస్లిం చట్టం ప్రకారం భారతదేశం హిందువులు, ముస్లింలకు ఉమ్మడి మాతృభూమి కాజాలదు, అంతేగాక హిందూ ముస్లింలు సమానులుగా జీవించగలిగే భూమి కూడా కానేరదు. ముస్లింల పాలనలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ముస్లింల భూమి అవుతుంది. ఈ భూమి ముస్లిమేతరుల అధికారంలో ఉన్నప్పుడు, అది ముస్లింల భూమి కాజాలదు. అంటే, ఆ భూమి దారుల్-ఇస్లాం అవ్వడానికి బదులు, దారుల్-హరబ్ అవుతుంది” అని డాక్టర్ అంబేద్కర్ వివరించారు.

ఇక జనాభా మార్పిడి కోసం డాక్టర్ అంబేద్కర్ తమ వాదనకు మద్దతుగా ఇలా వివరించారు, “ముస్లింల దృష్టిలో హిందువులు (ముస్లిమేతరులు ఎవరైనా) అంటే కాఫిర్లు. ఈ కాఫిర్లు (ఇస్లాం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు) గౌరవానికి అర్హులు కారు. ఆ వ్యక్తులది ఒక హోదా అంటూ లేని తక్కువ స్థాయి జన్మ. అందుకే కాఫిర్ల (ముస్లిమేతరులు) పాలనలో ఉన్న ఏ దేశమైనప్పటికీ అది ముస్లింలు ఎలాగైనా జయించి తీరవలసిన దారుల్-హరబ్ (ఇస్లామిక్ పాలన లేని యుద్ధభూమి). దీనిని దారుల్-ఇస్లాం (ముస్లింల భూమి)గా మార్చాలి. ఈ ప్రకారం.. ముస్లింలు హిందువుల మాటను ఎంత మాత్రం ఖాతరు చెయ్యరని రుజువు చెయ్యడానికి మరే విధమైన సాక్ష్యమూ అవసరం లేదని దీనిని బట్టి అర్థమవుతోంది.”

చరిత్రలోని ఒక సంఘటనను గుర్తు చేస్తూ డాక్టర్ అంబేద్కర్.. “హిందువుల సామూహిక హత్యలకు పాల్పడే మతోన్మాద ముస్లింలకు, ముస్లిం నాయకత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎందుకంటే, ముస్లిం నాయకత్వం దృష్టిలో ఖురాన్ చట్టం ప్రకారం మతోన్మాద ముస్లింల చర్యలు సమర్థనీయమే..” అని వ్రాశారు. పాకిస్తాన్‌లో మితవాద ముస్లింలుగా పిలవబడే నేతల పాలన ఉన్నప్పటికీ అక్కడి మైనారిటీలకు న్యాయం జరగదని డాక్టర్ అంబేద్కర్‌కి బాగా తెలుసు.

గ్రీస్, బల్గేరియా దేశాల మధ్య జనాభా మార్పిడిని ప్రస్తావిస్తూ.. భారత్-పాకిస్తాన్ మధ్య కూడా జనాభా మార్పిడి కోసం డిమాండ్ చేసేలా డాక్టర్ అంబేద్కర్‌ని ప్రేరేపించిన అంశం శత్రు దేశంలోని దళితుల జీవితాల పట్ల ఆయనకు గల ఆందోళన తప్ప మరొకటి కాదు. గ్రీస్-బల్గేరియా దేశాల తరహాలోనే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కూడా స్వచ్ఛంద ప్రాతిపదికన జనాభా మార్పిడి కోసం ఇరు దేశాల నేతలకూ డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదన చేశారు. డాక్టర్ అంబేద్కర్ జీవితకాలంలో సాకారం కాక, చిరకాలంగా నెరవేరకుండా నిలిచిపోయిన ఆ స్వప్నాన్ని నెరవేర్చుతూ ఎన్డీయే ప్రభుత్వం సీఏఏని అమలు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెడుతూ, ఇది ముస్లింలకు లేదా మైనార్టీలకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారు. అంతేగాక, ఇందులో వీరిని గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ముస్లిం అనే పదం గురించి అత్యల్ప ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన హింసకు గురైనవారు, దేశ విభజన బాధితులు భారత పౌరసత్వం కోసం సహజ యోగ్యతను ఈ చట్టం మంజూరు చేస్తుంది. దాస్యం, దారిద్ర్యపు వేదనతో తనువులు చాలించే పరిస్థితులలో జన్మించిన దళిత హిందువులు, తమ మాతృదేశంలో భద్రత, హుందాయైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ పెట్టుకున్న ఆశలకు ప్రాణం పోసేలా ఈ చట్టం వారికి పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకని దీనిని అడ్డుకోవాలని చూస్తోంది? దేశ విభజన పరిణామాల్లో బాధితులైన మలక్షలాది దళితుల జీవితాలను కాపాడే ఈ చట్టాన్ని దళిత నాయకురాలిగా చెప్పుకుంటున్న మాయావతి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏ ‘ముస్లిం వ్యామోహం’ విషయంలో నెహ్రూపై డాక్టర్ అంబేద్కర్ ఆరోపణలు చేశారో ఆ వ్యామోహంలోనే మాయావతి పార్టీ ఇప్పటికీ బందీగా ఉన్నందుకా?

అనువాదం – శ్రీనివాస్