Home News సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

0
SHARE
  • గోవు ఆధారిత సేద్యం.. యోగిక్‌ సాగు!
  • వేదకాలం నాటి పద్ధతుల వ్యవసాయానికీ రాయితీలు
  • రసాయనాలు వాడకుండా సహజ పంట పండాలి
  • సేంద్రియ వ్యవసాయ పథకంలో కీలక మార్పులు చేసిన కేంద్రం

ప్రాచీన వేదకాలం నాటి పద్ధతుల్లో గోవుల ఆధారిత పంటలు పండించినా రాయితీలతో ప్రోత్సహిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు తాజాగా భరోసా ఇచ్చింది. సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి పథకం (పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన-పీకేవీవై) పథకంలో పలు కీలక మార్పులు చేసిన ముసాయిదాను అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు పంపింది. దీనిపై తెలంగాణ వ్యవసాయశాఖ బుధవారం తన అభిప్రాయాలను సైతం తెలిపింది. రసాయనాలు లేకుండా సహజ జీవ ఎరువులు, జీవ పురుగుమందులు మాత్రమే వాడుతూ పంటలు పండించాలని ముసాయిదాలో స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయ రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల సేంద్రియ పంటల సాగు పద్ధతుల్లో దేనినైనా అనుసరించే స్వేచ్ఛను రైతులకు ఇచ్చింది.

* ఈ పథకంలో రైతుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. సహజ ఎరువులు, జీవ పురుగుమందులు వంటి వాటిని కొన్నా వాటికీ ఇస్తారు.

* ఏ పంటకు ఎంత మోతాదులో ఇవి వాడాలన్నది రైతు ఇష్టానికే వదిలేశారు.

* రైతులే సొంతంగా సహజ ఎరువులు, పురుగు మందులు తయారుచేసుకున్నా అనుమతిస్తారు.

* ఇప్పటిదాకా రసాయనాలు వాడుతున్న పొలంలో పీకేవీవై కింద పంటలు పండించాలంటే కచ్చితంగా వరసగా మూడేళ్లు సాగుచేస్తేనే ‘సేంద్రీయం’ అనే పూర్తిస్థాయి గుర్తింపు ఇస్తారు.

* కనీసం 50 ఎకరాల రైతులు ఒక సంఘంగా ఏర్పడాలి. ఒకేచోట 2500 ఎకరాల వరకూ రైతులు ఈ పథకం కింద పంటలు పండించడానికి ముందుకొస్తే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

* రెండున్నర ఎకరాల్లో పంటలు పండించడానికి ఒక్కో రైతుకు తొలి ఏడాది రూ.17,300, రెండో ఏడాదిలో రూ.16,100, మూడో ఏడాదిలో రూ.16,600 రాయితీ కింద రాష్ట్ర వ్యవసాయశాఖ ద్వారా అందుతాయి.

* ఈ సంఘాలు పండించే పంటకు ప్రత్యేక బ్రాండ్‌’ ఏర్పాటు చేసుకుని మార్కెట్‌లో అమ్ముకోవడానికి ‘వ్యవసాయోత్పత్తుల కంపెనీ’(ఎఫ్‌పీఓ) ప్రారంభించొచ్చు.

* పంట కోత అనంతర నష్టాలు తగ్గించేందుకు అధునాతన సాంకేతిక సాయం అందిస్తారు. పంటల శుద్ధి పరిశ్రమలు, గోదాములు, శీతల గిడ్డంగులు తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

* రసాయనాలు వాడకుండా పంటలు పండించారా? లేదా? అన్నది ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి పంటల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు.

* ప్రతి క్లస్టర్‌లోని రైతులకు సేంద్రీయ విధానాలు, పంటల మార్కెటింగ్‌, ఆదాయం పెంపుపై ఏటా కనీసం 3 సార్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

* కొండలు, గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ రసాయనాలతో పంటలు పండించే భూముల రైతులను ఈ పథకం కింద ఎక్కువగా ప్రోత్సహించాలి.

* వ్యవసాయ డిగ్రీ చదివిన వారిని క్లస్టర్‌ సమన్వయకర్తగా, డిప్లొమా చదివిన వారిని ‘ప్రధాన వనరుల వ్యక్తి’గా నియమించాలి.

గోవుల ఆధారిత సేద్యం, యోగిక్‌ వ్యవసాయం, అవధూత శివానంద వ్యవసాయం, శివయోగి సేద్యం, టిక్కా సేద్యం, అహింసా వ్యవసాయం, బయో వ్యవసాయం, వేదిక్‌ సేద్యం, జీవన సేద్యం, సేంద్రీయ వ్యవసాయం, అవుమా సేద్యం, సజీవ సేద్యం, జీరో బడ్జెట్‌ సేద్యం, సహజ పర్యావరణ పరిరక్షణ వ్యవసాయం, సహజ సేద్యం, హోమ వ్యవసాయం.. ఇలా ఏ పేరుతో ఉన్న సహజ సేద్యానికైనా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్‌ సదుపాయాలు కూడా పెంచుతామని ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది.

(ఈనాడు సౌజన్యం తో)