మొన్నటి యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మహిళల విడాకులకు సంబంధించిన ‘తలాక్’పై ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి కనబర్చడంతో ఆ వర్గం మహిళల ఓట్లు బిజెపికి పడేలా చేశాయి. ఎన్నికల ప్రచార సభల్లో ‘ముస్లిం మహిళలకు న్యాయం చేయడం ప్రభుత్వ, ప్రజల బాధ్యత’ అని మోదీ అన్నారు. 20 ఏళ్లకు ముందు ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిజెపి అజెండాలో ఉండేది. అది మళ్ళీ ఈ ‘తలాక్’ వ్యతిరేకత రూపేణా ఇపుడు పురుడు పోసుకుంటున్నది. మూడుసార్లు ‘తలాక్’ చెప్పి అజరుద్దీన్ లాంటి విద్యావంతులు కూడా భార్యలకు విడాకులిచ్చారు. దేశంలో 170 మిలియన్ల మంది, యుపిలో 40 మిలియన్ల మంది ముస్లింలున్నారు. భర్త మూడుసార్లు ‘తలాక్’ అంటే విడాకులిచ్చేసినట్టేనన్న విషయాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలెందరో వ్యతిరేకిస్తున్నారు. పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ లేని ఈ పాపిష్టి సంప్రదాయం మనకెందుకని వాపోతున్నారు. ఈ మహిళలందుకున్న పల్లవికి శృతి కలపడం మోదీ పార్టీకి ఉభయ తారకమయింది. ముస్లిం మహిళల తరఫున ఈ విషయమై వకల్తా పుచ్చుకున్న జకియా సోమన్ ‘తలాక్’ విషయాన్ని గుజరాత్ అల్లర్లతో ముడిపెట్టకూడదన్నారు. ఈమేరకు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక ముస్లిం మహిళకు తలాక్ విషయంలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది పిటిషన్ వేసింది. గత అక్టోబరులో జాతీయ న్యాయప్రాధికార సంస్థ ‘ఉమ్మడి పౌరస్మృతి’ విషయమై చర్చను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింల సమస్యలపై అధ్యయనం చేస్తున్న ఇంద్రేష్‌కుమార్ ‘ముస్లిం మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ముస్లిం నేతలకు, సెక్యులర్ మేధావులకు లేదని అందుకేవారు ‘తలాక్’పై జరుగుతున్న చర్చను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ఇస్లాంలో విడాకుల పర్వాన్ని ‘షరియా’ శాసిస్తోంది. భార్యాభర్తల బంధం ప్రేమపై ఆధారపడి వుండాలని, దేనికైనా ఇద్దరి అంగీకారం కావాలని, విడాకుల విషయంలో సమాజం కల్పించుకోవాలని, మధ్యవర్తిత్వం వుండాలని షరియా చెబుతోంది. హడావుడి విడాకులను నివారించేందుకు మూడు నుంచి నాలుగు నెలల సమయం తీసుకోవాలని కూడా షరియా చెబుతోంది. ఇస్లాంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. విడాకుల విషయంలో మహిళయే ఆ విషయం ప్రస్తావించేందుకు, విడాకుల్ని నిరాకరించేందుకు, భర్త ఆస్తిపై హక్కును సవాలు చేసేందుకు ఆమెకు అధికారాలివ్వబడ్డాయి. స్వేచ్ఛ యివ్వబడింది. కాని షరియా కోర్టుల పేరిట యిష్టం వచ్చినట్లు ‘ముఫ్తీ’లు తీర్పులనిచ్చేవారు. భార్య అంటే పిల్లల్ని కనే యంత్రంగా, ఇంటికి పరిమితమయ్యే దాసిగా చూడడం నేటికీ జరుగుతోంది. ముస్లిం మహిళలు విద్యావంతులవుతున్నా తప్పని మూర్ఖపు పరిస్థితి యిది.
ప్రస్తుతం పాటిస్తున్న తలాక్ (విడాకులు) పద్ధతిలో న్యాయమూ లేదు, కోర్టుల అంగీకారమూ లేదు. ఆమెకు ఆస్తిలో వాటారాదు. భరణమూ లేదు. ఇదొక అమానవీయ పద్ధతి. అనాగరిక చర్య. స్ర్తిని శక్తిస్వరూపంగా భావించే మన దేశంలో మతం పేరిట జరుగుతున్న దమనకాండ యిది. మతం మారినంత మాత్రాన మానవత్వపు పరిమితులు కూడా మారతాయా? మనిషి జీవన అస్థిత్వాన్ని ప్రశ్నించేది మతమెలా అవుతుంది? అర్షియా అనే ముస్లిం వనిత తన భర్త ఫోన్‌లో మరో యువతితో మాట్లాడడాన్ని ప్రశ్నించింది. దీంతో ఆ భర్త- ‘తలాక్ చెబుతాన’ని భార్యను బెదిరించాడు. ఇలాంటి ఉదాహరణలెన్నో!
తలాక్ పదాన్ని ఉచ్ఛరించడం ద్వారానేకాక, ఫోన్ ద్వారా, ఇ- మెయిల్ ద్వారా ఆ సమాచారమిచ్చినా విడాకులిచ్చినట్లేనట! ఇది ఏకపక్షంగా జరిగేది. 45 ఏళ్ళ అర్షియా ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలో టీచరుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు భర్త జీతంలో 1/3వ వంతు భరణంగా కూడా లభించలేదు. భర్త తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో ఆమె సవాలు చేసింది. కేవలం భరణం కోసం కాదు, సామాజిక న్యాయం కోసం. పనె్నండేళ్లుగా కాపురం చేస్తుండగా భర్త తనను ఇంటినుంచి ఎలా గెంటివేస్తాడన్నది ఆమె ప్రశ్న. ఫాతిమా అనే వివాహితకు భర్త మూడుసార్లు ‘తలాక్’ అంటూ ఫోన్ ద్వారా సమాచారం పంపాడు. తరువాత ఫోన్ కట్ చేశాడు. పెళ్ళయిన రెండు వారాలకే ఫతిమాకు జరిగిన అనుభవం యిది. తరువాతి పరిణామాలు ఆమెలో బాధకన్నా భయం నింపాయి. అందుకే భర్త నుంచి మూడులక్షల రూపాయలు తీసుకొని ఆమె తన పోరాటం నిలిపివేసింది. ప్రతి 11 మంది ముస్లిం వివాహిత మహిళల్లో కనీసం ఒకరు తలాక్ బాధితులే. చాలామందికి ఎటువంటి భరణమూ లభించలేదు. భారతీయ ముస్లింల్లోని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం వంటి వాటిని అడ్డుపెట్టుకొని ఛాందసులైన కొందరు ముస్లిం వౌల్వీలు, ముల్లాలు ‘తలాక్’ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారనేది జకియా ఆరోపణ. ఖురాన్‌లో అసలు ‘తలాక్’ లేదంటారామె. 15వ శతాబ్దంలో హాజీ అలీ దర్గాను (ముంబయి) ముస్లిం మహిళలు దర్శించకూడదన్న నిబంధన ఉండేది. ఇటీవలే ఆ నిబంధనను కోర్టులు కొట్టేశాయి. ముస్లిం మహిళలకు విజయం లభించింది. ప్రస్తుతం మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే విషయమై కూడా కోర్టులు స్ర్తి, పురుష సమానత్వం ప్రాతిపదికన విచారించనున్నాయి. ఈ విషయంలో ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’- తలాక్ చెప్పి వెంటనే విడాకులివ్వని పక్షంలో ముస్లిం పురుషులు మహిళపై ‘హింస’ జరిపే ప్రమాదముందని వింతవాదన చేస్తోంది. ఇపుడు కల్పించుకోకపోతే ముస్లిం పర్సనల్ లా బోర్డునే ప్రభుత్వం రద్దుచేస్తుందన్న భయంతోనే ఈ తరహా వాదనకు దిగుతోందని ముస్లిం విలేఖరి సీమా ముస్త్ఫా అభిప్రాయపడ్తున్నారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసిన వాదనల్లో కొన్ని ఇస్లాంలో పురుషుడి ఆధిపత్యాన్ని, అహంకారాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ‘వివాహం ఒక కాంట్రాక్టు వంటిది. ఇందులో భౌతికంగా ఇరువర్గాలు సమానం కాదు. పురుషుడు బలవంతుడు. స్ర్తి బలహీనురాలు. పురుషుడు తన రక్షణకై స్ర్తిపై ఆధారపడడం లేదు. కాని స్ర్తిపురుషుడిపై ఆధారపడి వుంది’ అంటూ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. బోర్డు తరఫున న్యాయవాదులు ఆర్టికల్ 44ను కేవలం మార్గదర్శక సూత్రం వరకే పరిమితం చేయాలన్నారు. బహుభార్యాత్వాన్ని కూడా ఆయన సమర్ధించుకున్నారు. కన్యగా వుండి అనైతికంగా మారడం కంటె రెండవ పెళ్ళి ద్వారా న్యాయపరమైన జీవితం కోరుకోవడం మంచిదంటూ ఆయన వాదించారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తే లైంగిక విశృంఖలత చోటుచేసుకుంటుందని వింత వాదనలు చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదనలు సోమన్ కొట్టిపారేశారు. ఈ తరహా వాద ప్రతివాదనల తరువాత ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా వచ్చే తలాక్ సందేశాలను చెల్లనివిగా ప్రకటించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించేందుకు ముస్లిం పర్సనల్‌లా బోర్డు ముందుకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ‘మూడుసార్లు తలాక్’ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమంది. ఇది ముస్లిం మహిళల హక్కులను కాలరాయడమే అంది. రాజ్యాంగ నియమం ముందు ‘ముస్లిం పర్సనల్ లా’ చెల్లదని తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 21 దేశాలు ‘తలాక్’ చెప్పడాన్ని నిషేధించాయి.
భారతదేశం సెక్యులర్ దేశం. రాజ్యాంగం ప్రకారం ఎవరిపైనా వివక్ష చూపకూడదు. ముస్లిం మహిళల పరిస్థితి బాగుపడేందుకు జాతీయ న్యాయ కమిషన్ చర్యలు తీసుకుంటే అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయమై మహిళలపై ఒత్తిడి తెచ్చి సంతకాల సేకరణ చేపట్టింది. ‘్భరతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ తలాక్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టింది. మారిన పరిస్థితుల్లో ఛాందస వాదానికి చోటులేదు. ముస్లిం మహిళల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ ఉద్యమంలో ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశించాలని కోరుకోవడంలో తప్పేముంది?
– తాడేపల్లి హనుమత్ ప్రసాద్
(ఆంధ్రభూమి సౌజన్యం తో )