Home News చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

0
SHARE
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ‘చంద్రయాన్-3’.. నింగిలోకి దూసుకెళ్లేంది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నేడు మధ్యాహ్నం 2:35:18 గంటలకు చంద్రుడి పైకి బయలుదేరింది. చంద్రుడిపై అన్వేషణ కోసం ISRO చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా ప్రయాణించే ‘కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన LVM 3, M4 రాకెట్.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3  చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ను మోసుకుని ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్ నింగిలోకి ఎగిరింది. సకాలంలో పేలోడు మండించి తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు 02.42PM సమయంలో మూడో దశ పేలోడ్ను మండించింది. ఈ మూడు దశలు నిర్ణీత ప్రణాళిక ప్రకారమే సజావుగా జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్పేస్ క్రాప్టు అవసరమైన ఎత్తుకు చేర్చేందుకు ఈ దశలను పూర్తిచేసుకొంది. 02.54 సమయంలో మూడో దశ ముగియడంతో చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. దీని గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రుడిపై ప్రయోగాలకోసం భారత్ మూడోసారి చేపడుతోన్న ఈ యాత్రపై యావత్ దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. LVM3 M4 రాకెట్ సహాయంతో నేడు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3, 3,84లక్షల .కి.మీ దూరం ప్రయాణం చేయనుంది. దాదాపు 45 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై దిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్కడ సురక్షితంగా దిగిన అనంతరం ల్యాండర్, రోవర్లు 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
చంద్రుడిపై అన్వేషణ కోసం భారత్ ఇప్పటికే రెండు సార్లు ప్రయోగాలు చేపట్టింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజులపాటు పనిచేసింది. కానీ, నాలుగేళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం మాత్రం ఆఖరి క్షణాల్లో విఫలమైంది. అయితే, ల్యాండింగ్ క్రమంలో వైఫల్యానికి ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, దాన్ని అధిగమించేలా చంద్రయాన్-3ని ఇస్రో రూపొందించింది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్.. విజయవంతంగా కిందకు దిగేలా ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపై సురక్షితంగా దిగితే.. ప్రపంచంలోనే చంద్రుడిపై సురక్షితంగా దిగిన నాలుగో దేశంగా భారత్ ఘనకీర్తి సాధించనుంది.

చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్‌ పూజలు

ప్రయోగ నేపథ్యంలో ఇస్రో సీనియర్‌ శాస్రవేత్తలందరూ శ్రీహరికోటకు చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ గురువారం షార్‌ సమీపంలో సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి రాకెట్‌ విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా గురువారం తిరుమలలో రాకెట్‌ నమూనాను శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు

భవిష్యత్తులో చంద్రమండ‌లం జనావాసంగా మారొచ్చు – ప్ర‌ధాని మోడీ

అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడిపైకి చంద్రయాన్-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో చంద్రమండ‌లం జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు.