— రాకా సుధాకర్
శివాజీ పాలన నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం నేటి పాలకులకు ఉంది. శివాజీ పాలన ఆధునిక యుగపు రామరాజ్యం. దానిని అధ్యయనం చేయడం అవసరం. భారతీయ పాలనా వ్యవస్థకు శివాజీ ఏలుబడి ఒక ఉత్తమ ఉదాహరణ.
రాజకీయం, సామాజికం, కుటుంబం.. ఇలా ఏ రంగంలోనైనా ఆర్థికమే కీలకం. అందుకే రాజకీయ తత్వవేత్త, మహానేత ఆచార్య చాణక్యుడు తన పుస్తకానికి రాజకీయ శాస్త్రం అని పేరు పెట్టకుండా అర్థశాస్త్రం అన్న పేరు పెట్టారు. అందుకే అనాదికాలంగా మన దేశంలో రాజ్య పాలనా వ్యవహారాలు చూసేవారికి, సమాజాన్ని ప్రభావితం చేసే నాయకులకు ఆర్ధిక వ్యవహారాలు, సంపదల గురించి తెలియచేయడం ముఖ్య ఆచారంగా వస్తూ ఉంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ కేవలం ఆదాయ వ్యయాలకు, ఉత్పత్తి, వాడకం, కొనుగోలు అమ్మకా లకు మాత్రమే పరిమితం కాదు. వ్యక్తిగత, సామాజిక జీవనాల్లోని అన్ని రంగాలనూ సంపద, ఆర్ధికం ప్రభావితం చేస్తాయి. మన ఋషులు, మునులు మనకు చతుర్విధ పురుషార్థాలను అందించారు. అవి – ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిలో భౌతిక ప్రగతికి, సమద్ధికి దారితీసే అర్థానికి రెండవ పురు షార్థపు స్థానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ వ్యవస్థ ఎలా ఉండేదన్నది అధ్యయనం చేయడం చాలా అవసరం.
నిన్నటి లెక్కలు పూర్తయ్యాయా ?
ఆయన చిన్న పెద్ద నిర్ణయాలు, కొన్ని ప్రత్యేక సంఘటనల ఆధారంగా శివాజీ ఆర్ధిక వ్యవహారాలను మనం అంచనా వేయవచ్చు. ఒక సందర్భంలో తన వివిధ మంత్రిత్వశాఖల ఆర్ధిక వ్యవహారాలను అడిగి తెలుసుకుంటున్నప్పుడు శివాజీ ఒక కింది స్థాయి ఆర్ధికాధికారి (ఆ రోజుల్లో దేశ్ కులకర్ణి అనేవారు) ని ముందరి రోజు లావాదేవీల లెక్కలు పూర్తయ్యాయా అని ప్రశ్నించారు. దానికి ఆ అధికారి లేదని సమాధానమిచ్చాడు. అంతేకాదు అలా చేయలేకపోవ డానికి గల కారణాలను కూడా అతను తెలియ చేశాడు. శివాజీ ఈ బాధ్యతా రాహిత్యానికి కఠినమైన క్రమశిక్షణ చర్య చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాడు.
ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా ?
ఒకసారి తన సైన్యాన్ని తనిఖీ చేస్తూండగా ఒక అధికారి ఒక గుర్రం యుద్ధంలో గాయపడి కుంటిదై పోయిందని, కాబట్టి దాన్ని అమ్మేందుకు అనుమతి కావాలని కోరాడు. శివాజీ అనుమతిని ఇచ్చాడు. కొద్ది నెలల తరువాత ఆ అధికారి వేరొక పనిమీద శివాజీని కలిశారు. ఆయన్ని చూడగానే శివాజీ ఆ గుర్రాన్ని అమ్మేశారా అని అడిగారు. తాను అమ్మినట్టు ఆ అధికారి చెప్పగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా అని ఆయన మరో ప్రశ్న వేశారు. ఇలా ఆర్ధిక రంగంలో అతి చిన్న చిన్న విషయాలను కూడా పర్యవేక్షించడం ఆయన ఆర్ధిక క్రమశిక్షణకు, నిజాయితీకి నిదర్శనం.
స్థానిక ఉత్పత్తులకు రక్షణ
శివాజీకి లక్షకు పైగా గుర్రాలతో కూడిన అశ్వదళ సైన్యం ఉండేది. ఆయన అందులో ఒక గుర్రం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివాజీ కాలం నాటి ఆర్ధిక మంత్రిత్వ శాఖ బయట నుంచి దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువుపై నిఘా ఉంచేది. ఫలితంగా వినియోగదారులు, వ్యాపారులు, ఉత్పత్తి దారుల ప్రయోజనాలను అన్ని వేళలా కాపాడారు. నేడు ప్రపంచ వాణిజ్యంలో స్థానిక ఉత్పాదనలను కాపాడేందుకు పలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను, దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక దిగుమతి సుంకాన్ని విధించడం వంటివి శివాజీ ఆనాడే చేశారు. గోవా నుంచి వచ్చిన పోర్చుగీసు వ్యాపారులు తాము తెచ్చిన ఉప్పును తక్కువ ధరకే తమ రాజ్యంలోని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్న విషయం ఒకసారి శివాజీ దష్టికి వచ్చింది. తక్షణమే శివాజీ పోర్చుగీసు ఉప్పుపై అధిక రక్షణాత్మక పన్నును విధించారు. తద్వారా స్థానిక ఉప్పు తయారీదారులకు రక్షణ కల్పించారు. తన రాజధాని రాయగఢ్ నుంచి డిసెంబర్ 7, 1671 నాడు కూడల్ ప్రాంతానికి సర్ సుబేదార్‌గా ఉన్న నరహరి ఆనందరావుకు రాసిన లేఖలో – ‘కళ్యాణ్, భివాండీ ప్రాంతాల్లో నువ్వు ఉప్పు ధరను బాగా ఎక్కువగా నిర్ధారించడం వల్ల మన ఉప్పు వ్యాపారులు బర్‌దేశ్ (గోవాలోని ఒక జిల్లా) నుంచి ఉప్పును కొనుగోలు చేయక తప్పడం లేదు. నీ ప్రాంతంలో ఉప్పు ధర ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారులు బర్‌దేశ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ప్రభావాళి, సంగమేశ్వర్ ప్రాంతాల్లో ఉప్పు ధరను, దానిపై పన్నును బర్‌దేశ్ నుంచి వస్తున్న ఉప్పుతో సరిగా ఉండేలా సవరించాలి. సంగమేశ్వర్‌లో లభ్యమయ్యే ఉప్పు కన్నా బర్‌దేశ్ ఉప్పు ధర చాలా ఎక్కువగా ఉండేలా ఉప్పు దిగుమతులపై పన్నును పెంచాలి. నీవు ఇలా చేయని పక్షంలో మన వ్యాపారులందరూ బర్‌దేశ్‌కి వెళ్ళి ఉప్పు తెస్తారు. మన ఓడరేవు వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి మనకు లబ్దిని చేకూర్చే ఈ సూచనలను మీరు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమలు చేయండి. ఇది మన రాజ్యానికి సంబంధించిన వేలాది రూపాయల ఆదాయానికి సంబంధించిన విషయం. కాబట్టి ఈ ఆదేశం మేరకు మీరు ఈ చర్యను వెంటనే అమలు చేయండి’ అని సూచించారు.
గుర్రాల వ్యాపారం నుంచి ఉప్పు వ్యాపారం దాకా, మందుగుండు నుండి యుద్ధనౌకల దాకా శివాజీ యుక్తులను, ప్రక్రియలను దిగుమతి చేసుకో వాలని భావించారే తప్ప ఉత్పత్తులను, పరికరాలను కాదు. ఏ దిగుమతి విషయంలోనైనా స్థానిక ఉత్పత్తిదారులను కాపాడే విధంగా నిర్ణయాలుండేవి. అప్పటి వరకూ దిగుమతవుతున్న ఏ విలువైన వస్తువునైనా లేదా పరికరాన్నైనా తయారు చేసేందుకు అవసరమైన ప్రతి సదుపాయాన్ని, సహకారాన్ని, రక్షణను కార్మికులకు, చేతి వత్తుల వారికి, వాణిజ్య సముదాయాలకి ఆయన కల్పించారు. ఈ నిర్ణయం వల్ల శివాజీ రాజ్యంలో ఆదాయం, తద్వారా ఖజానా అంచెలంచెలుగా ఎదిగాయి.
నౌకా పరిశ్రమ..
కళ్యాణ్, భివాండీ (క్రీక్ ప్రాంతం) లలో స్వదేశీ యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకల తయారీ కేంద్రాన్ని శివాజీ స్థాపించారు. శాంతి సమయాల్లో ఈ ప్రదేశాల్లో యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకలు లంగరు వేసేవి. యుద్ధంలో ఉపయోగపడే పడవల మరమ్మత్తుల నిమిత్తం విజయదుర్గం వద్ద ఒక హార్బరును నిర్మించారు. ఈ ఓడరేవులన్నీ ఓడలు లంగరు వేసేందుకు, మరమ్మత్తులు చేయించు కునేందుకు శాంతి సమయాల్లో ఉపయోగపడేవి. దీని వల్ల శివాజీకి తన నౌకా నిర్మాణ ప్రక్రియల రహస్యాలను కాపాడుకునేందుకు, మరమ్మత్తులు చేయించుకునేందుకు వీలుపడింది. ఇతరుల నుంచి పడవలను కొనుగోలు చేయడం వల్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. అలాగే మరమ్మత్తుల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా చేసింది.
మందుగుండు పరిశ్రమ..
శివాజీ పరిపాలనలో 12 మహల్‌లు (విభాగాలు) ఉండేవి. ఆయన రాజ్యంలో రాజ్యానికి అవసరమైన పరికరాలు, వస్తువుల తయారీ కోసం 18 ఫ్యాక్టరీలు ఉండేవి. మంచి మందుగుండు సామగ్రి కోసం ఆయన ఇంగ్లీషువారి సహాయాన్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ బ్రిటిషర్లు ఇందులో జాప్యం చేయడం ప్రారంభించారు. దాంతో ఆయన ఫ్రెంచి వారి సహకారంతో పురంధర్‌లో ఒక ఫిరంగి గుళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తయారయ్యే ఫిరంగి గుళ్లు ఇనుము, కంచు, మిశ్రమ ధాతువులతో తయారయ్యేవి. ఈ ప్రయత్నా లన్నీ తన రాజ్యంలోని వనరులను తన రాజ్యానికే పరిమితమయ్యేలా చేయడానికి, అనవసరమైన దిగుమతులను నిరోధించడానికి, తన రాజ్యంలో ఉపాధి కల్పనను మెరుగుపరచడానికి ఉద్దేశించినవే. స్వావలంబన పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరిగేది.
పనిలో వేగం..
శివాజీ తన ఏలుబడిలో పాలనా యంత్రాంగం పని వేగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. సమాచారాన్ని అందచేయడం నుంచి రహస్య సందేశాలను చేరవేయడం దాకా, రాజ్య రక్షణ నుంచి శత్రువుల రాజ్యంపై దాడి వరకూ, అన్ని విషయా ల్లోనూ వేగవంతంగా పనిచేయడానికి ఆయన పాలన, పాలనా యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. శివాజీ వేగమే విత్తమని భావించేవారు. ఎందుకంటే వేగంగా పనిచేయడం వలన తక్కువ సమయం ఖర్చయ్యేది. సమయమే ధనమన్న విషయాన్ని ఆయన తన పాలనలో, పనితీరులో పాటించేవారు.
నిర్లక్ష్యానికి శిక్ష..
ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో ఉన్నత స్థాయి అధికారులు పొరబాటు చేస్తే శివాజీ వారికి తీవ్రమైన శిక్షలు వేసేవారు. ఒకసారి ఆయన తన దేశ్‌ముఖ్‌లు, దేశ కులకర్ణి, మహాజన్ తదితర అధికారులందరిని పన్వేల్ దగ్గర ఉన్న ప్రచలగఢ్ కోటకు రప్పించి రాజ్యపు బడ్జెట్ తయారు చేయిస్తున్నారు. ఈ సమయంలోనే చేవుల్ (మూర్తజాబాద్) దేశ కులకర్ణి అయిన అప్పాజీ తన అధీనంలోని గ్రామాల నుంచి వసూలు చేసిన పన్నుల లెక్కలను సమర్పించ లేదని చెప్పారు. అంతేకాక ఆయన సరిగ్గా పన్నులు వసూలు చేయలేదని కూడా వెల్లడైంది. అంతటి ఉన్నతాధికారి నిర్లక్ష్యాన్ని శివాజీ సహించలేకపోయారు. ఆయన అప్పాజీని తీవ్రంగా విమర్శించారు. ‘ఇంత ఉన్నతమైన దేశకులకర్ణి పదవిలో ఉంటూ కూడా మీరు ఖాతాలు సరిగ్గా నిర్వహించమని మీకిచ్చిన బాధ్యతను నిర్వర్తించలేక పోయారు’ అన్నారు. శివాజీ అతని నేరాన్ని పట్టించుకోకుండా వదిలేయ లేదు. అది రాజ్యానికి ద్రోహంగా భావించారు. అందుకే తీవ్రమైన శిక్ష కూడా వేశారు. అప్పాజీకి భారీగా జరిమానా వేసి, ఆయనను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఆబాజీ మహాదేవ్‌ను నియమించారు.
రైతుల ఆదాయం పెంపు
శివాజీ వ్యవసాయాభివద్ధి, పంట సాగు భూమి పెంపు, ఆదాయ పెంపు విషయంలో ఒక వినూత్నమైన విధానాన్ని అవలంబించాడు.
తన పన్ను వసూలు ప్రధానాధికారి, అష్ట ప్రధానుల్లో ఒకరైన అన్నాజీ దత్తో ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంతుందో తెలుసుకునేందుకు ఒక అంచనా బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ భూమిలో ఎంత ఉత్పత్తి అవుతుంది, ఏ మేరకు నష్టాలు వాటిల్లుతున్నాయన్న విషయాన్ని కూడా ఆయన అంచనా వేయించేవారు. ఈ బదంలో ప్రతి గ్రామంలోని నలుగురు ప్రధాన రైతులు, ముగ్గురు పాలనాధికారులు (దేశ్‌ముఖ్, దేశపాండే, ఆ గ్రామపు పాటిల్) ఉండేవారు. ఈ బృందం ప్రతి రైతు తాలూకు దిగుబడిని లెక్కించేవారు. క్షామం వల్ల వచ్చిన నష్టం, అధిక వర్షపాతం వల్ల కలిగిన నష్టం, మరే ఇతర కారణాల వల్ల వచ్చిన నష్టం లెక్కించేవారు. అటు ప్రభుత్వం, ఇటు గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రతినిధులు ఉండటం వల్ల ఈ బృందం పనితీరు చాలా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేది. తమ గ్రామ పెద్దలు తమ ప్రయోజనాలను కాపాడతారన్న భరోసా రైతులకు ఉండేది. ప్రభుత్వాధికారులు ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్ల కుండా ఉండేది.
వస్తువుకు వస్తువే పరిహారం
విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఒక విలక్షణమైన వ్యవస్థ ఉండేది. ఎద్దు చనిపోతే ఇంకొక ఎద్దును ఇచ్చే ఏర్పాటు ఉండేది. విత్తనాలు పోతే కొత్త విత్తనాలు ఇచ్చేవారు. అదేవిధంగా నాగలి వంటి పరికరాలు పోతే వస్తువులు ఇచ్చేవారు. అంతే కానీ ధన రూపేణా నష్టపరిహారం ఇచ్చేవారు కారు. ధనరూపేణా ఇచ్చే పరిహారం వ్యవసాయానికి కాక ఇతర పనులకు ఖర్చవుతుందని అధికారులు భావించేవారు. డబ్బురూపేణా ఇస్తే అవి అనవసర మైన పనులకు, అనావశ్యకమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారని భావించారు. అందుకే ఉత్పాదకతకు తోడ్పడే వస్తువులను ఇచ్చినట్టయితే ఉపయోగం ఉంటుందని, ప్రకతి వైపరీత్యం తరువాత కూడా మళ్లీ ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించవచ్చునని వారు భావించేవారు. ఆ రోజుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి ఉన్నత స్థాయి ఆర్ధిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది.
నేడు ప్రభుత్వాలు రైతులకు నగదు రూపంలో పరిహారం ఇస్తున్నాయి. కేవలం రాజకీయ లబ్ది కోసం లేదా ప్రజల్లో మద్దతు పొందేందుకు చేసే ప్రజాకర్షక విధానాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయన్నది మనందరి ముందు ఉదాహరణ రూపంలో ఉంది. మొట్టమొదట నష్టం అంచనా వేయడంలో వివాదాలు ఉంటాయి. ఆ తరువాత పరిహారం పంపిణీలో విస్తృతంగా, తీవ్రమైన అవినీతి జరుగుతుంది. ఇవన్నీ కాకుండా వచ్చిన పరిహారాన్ని రైతు వ్యవసాయానికి కాక ఇతర పనులకు ఖర్చు చేస్తాడు. దీనివల్ల అతని పరిస్థితి మరింత దయనీయం అవుతుంది. కేవలం ప్రజాకర్షణ కోసం చేపట్టిన ఇలాంటి చర్యల దుష్పరిణా మాలు ఈరోజు మనముందు వేలాది రైతుల ఆత్మహత్యల రూపంలో ఉన్నాయి. తాత్కాలిక రాజకీయ లబ్దికోసం పెట్టే ఉరుకులు పరుగుల వల్ల ఈ దేశపు సామాజిక వ్యవస్థకు తీరని నష్టర కలిగింది. అదే శివాజీ హయాంలో వృద్ధులు, రోగులు, పిల్లలకు తప్ప మరెవరికీ ఉచితంగా ఏదీ లభించేది కాదు. ఇందువల్ల రాజ్యం అందించిన సదుపాయాలు ఏ ఉద్దేశ్యం కోసం ఇచ్చారో ఆ ఉద్దేశం కోసమే ఉపయోగపడేవి.
నేటి పాలనా యంత్రాంగపు ఆర్ధిక యాజమాన్య విధానాన్ని శివాజీ కాలంతో పోల్చి చూస్తే కొట్టొచ్చి నట్టు తేడా కనిపిస్తుంది. శివాజీ ఆదాయ వ్యయాల మీద గట్టి నిఘా ఉంచేవారు. అంతేకాక ఎప్పటికప్పుడు ధనం ఎలా వస్తోంది, ఎలా పోతోందన్నది గమనించేవారు.
స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎదుర్కొన్న స్కాముల భారీ జాబితాను ఒకసారి చూడండి. ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కాం కానీ, కొన్ని దశాబ్దాల కింద జరిగిన బోఫోర్స్ స్కాం కానీ, ఇతర స్కాంలను కానీ పరిశీలించండి. రక్షణ రంగ కొనుగోళ్ల నుంచి, రక్షణ శాఖ భూముల లావాదేవీలు, పరికరాలను తుక్కు కింద అమ్మేయడం, భూముల రిజిస్ట్రేషన్ ధరలు, ప్రజా పనుల విభాగంలో అభివృద్ధి పనులు, వైద్య రంగంలో మందుల కొనుగోళ్లు, యంత్రాల కొనుగోళ్లు, చెట్లు నాటడం, చెరువులు తవ్వడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు, దారిద్య్ర రేఖ దిగువన నివసించేవారికి ఆహార దినుసుల పంపిణీ వరకూ అన్ని రంగాల్లో తప్పుడు ఖాతాలు రాజ్యమేలు తున్నాయి.
మనకు ఆగస్టు 15, 1947 లో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా, పాలనా పరమైన స్వాతంత్య్రం ఇప్పటి దాకా రాలేదు. బ్రిటిష్ వారి పాలనా విధానం స్థానంలో భారతీయ పాలనా విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలన్నీ తూతూ మంత్రంగానే సాగాయి. ఇప్పటికీ బ్రిటిష్ వారు ఇచ్చి వెళ్లిన విధానమే కొనసాగుతోంది. భారతీయ అధికారులకు పనికిరాని, ప్రాముఖ్యం లేని చిన్న చిన్న బాధ్యతలను ఇచ్చి, తమ చేతుల్లోనే ప్రముఖమైన నిర్ణయాధికారాన్ని బ్రిటిషర్లు ఉంచుకునేవారు. స్వతంత్ర భారతదేశంలోనూ చిన్న పాటి మార్పులతో అదే విధానం కొనసాగుతోంది.
అందుకే శివాజీ పాలన నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం నేటి పాలకులకు ఉంది. శివాజీ పాలన ఆధునిక యుగపు శ్రీరామరాజ్యం. దానిని అధ్యయనం చేయడం అవసరం. భారతీయ పాలనా వ్యవస్థకు శివాజీ ఏలుబడి ఒక ఉత్తమ ఉదాహరణ.
(జాగృతి సౌజన్యం తో)