– ప్రదక్షిణ
ప్రపంచంలోనే చాలా అరుదైన సత్యాగ్రహ మార్గంలో అహింసాయుతంగా స్త్రీలు జరిపిన అటవీ-సంపద పరిరక్షణ ఉద్యమంగా `చిప్కో’ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రకృతికి ప్రతీకలైన స్త్రీలు, ఆ ప్రకృతిని- పర్యావరణాన్ని కాపాడిన ఈ చరిత్రని `ఇకో-ఫెమినిజం’ అని పలువురు ప్రశంసించారు. పురుషులు నేతృత్వం వహించినా, ఉద్యమానికి భూమికగా, వెన్నెముకగా ఉండి నడిపించినది స్త్రీలే.
అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో(నేటి ఉత్తరాఖండ్), ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో, ప్రకృతి రమణీయంగా ఉండే గడ్హ్వాల్ ప్రాంతం, చమోలీ జిల్లాలో, 1973లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. దీని వెనుక ఎంతో నేపధ్యముంది. భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగే అవకాశమున్న హిమాలయాల్లో, అటవీ నిర్మూలన విపరీతంగా సాగి, పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్న దశలో, 1970లో బదరీనాథ క్షేత్రం వద్దనున్న హనుమానచట్టి స్థానంనుంచి, దాదాపు 350కి.మీ దూరంలోని హరిద్వార్ దాకా, అలకనందా నదికి భారీ వరదలు వచ్చాయి. గ్రామాలు, రహదారులు, వంతెనలు కుప్పకూలిపోయాయి. 200పైగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. అంతకుముందే ప్రముఖ గాంధేయవాది శ్రీ చండీప్రసాద్ భట్ట్ గోపేశ్వర్ గ్రామంలో, `దశోలి గ్రామస్వరాజ్య సంఘం’ స్థాపించారు, స్థానికంగా దొరికే వనరులతో, వ్యవసాయానికి కావలసిన పనిముట్లు తయారు చేసుకుని, ప్రజలు ఉపాధి, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాలని వారి ధ్యేయం. 1973లో గ్రామస్థులు స్థానికంగా వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవడానికి కలప నిరాకరించిన ప్రభుత్వం, `సైమన్ కంపెనీ’ అనే క్రీడా ఉత్పత్తుల కంపెనీకి, టెన్నిస్ ఆడే బాట్ల తయారీకి, 300 చెట్లు నరకడానికి అనుమతించింది. అసలే వరదలతో నాశనమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరింత ప్రకృతి వినాశనాన్ని ఇంక తట్టుకోలేదని, ప్రజలు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏప్రిల్ 1973లో ప్రతిఘటించి, చెట్ల నరికివేత ఆపించారు. అయితే ఇదే కంపెనీకి, జూన్1973లో కొంచెం దూరంలో ఉన్న `ఫాట’ గ్రామంలో, అటవీ నిర్మూలనకి మళ్ళి అనుమతినిచ్చారు. తరువాత మళ్ళీ అలకనందా నది పైభాగంలోని `రేని’ గ్రామంలో 2500 చెట్లు నరకడానికి అనుమతులు వచ్చాయి. ఇంక లాభంలేదని ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు ఈ గ్రామాలకు మూకుమ్మడిగా వెళ్లి, చెట్లను హత్తుకుని (చిప్కో అంటే హిందీలో అతుక్కోవడం)నిలబడి, చెట్లను నరకనివ్వకుండా కాపాడగలిగారు.
పూర్తిగా శాంతియుతంగా సత్యాగ్రహ మర్గాన స్త్రీల ఉద్యమం సాగింది. 1973-79 మధ్య కాలంలో, వందలాది గ్రామాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. క్రమక్రమంగా ఉద్యమం ఉత్తరభారతమంతా విస్తరించింది.
మరొక ప్రముఖ గాంధేయవాది
శ్రీ సుందరలాల్ బహుగుణ (ఇటీవల మే 2021లో ఈయన మరణించారు. భారత ప్రభుత్వం ఈయనకి పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది) ప్రజలకు పర్యావరణ పరిరక్షణ గురించి బోధించి, 2వారాలపాటు నిరాహారదీక్ష జరిపి, ఈ స్త్రీల-ప్రకృతి ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చి, అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మెడలు వంచి, చివరికి పర్యావరణ విధ్వంసాన్ని నివారించగలిగారు. అంతగా పర్యావరణ స్పృహ లేని ఆ రోజుల్లో ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. శ్రీ సుందరలాల్ బహుగుణ ఆనాటికి, ఈనాటికీ పాటించాల్సిన ముఖ్యమైన సందేశం ఇచ్చారు, `పర్యావరణమే సుస్థిర ఆర్ధిక వ్యవస్థకి నాంది’ (Ecology is the sustainable economy).
చిప్కో – హత్తుకో
ఒకప్పుడు అడవినుంచి తెచ్చే వంటచెరుకు, అటవీ వనరులు, నదుల్లో వాగుల్లో నీటి మీద ఆధారపడిన దైనందిన జీవనానికి, గ్రామీణులు, ముఖ్యంగా స్త్రీలు అడవులమీదే ఆధారపడేవారు. అటవీ నిర్మూలనతో గ్రామీణ వ్యవస్థ, ప్రజల జీవనోపాధులు పూర్తిగా నాశనమవడమే కాక, ఇళ్ళు నడిపించే స్త్రీలకు బ్రతుకులు మరింత భారమయినాయి. అడవుల నిర్మూలన జరిగితే, మరింత ఎక్కువగా భూకంపాలు, వరదలు వచ్చి, గ్రామీణులు పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలసపోవడం తప్ప వేరే మార్గం లేదని వారికి తెలుసు. కాబట్టే జీవనానికి, అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అని వారికి బాగా అర్ధమైంది. అంతేకాక, గ్రామీణ జీవనంలో, ముఖ్యంగా స్త్రీల జీవితాలకి ప్రకృతితో అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంది. అందుకే స్త్రీలు తమ జీవితాలకోసం, ప్రకృతి కోసం ముందడుగు వేసారు. హిమాలయ పర్వతాల్లోని గ్రామీణ స్త్రీలు ముందుండి నడిపించిన ఈ ఉద్యమం వృక్ష సంపదను పరిరక్షించడం, పెంపొందించడంపై ప్రజలకు అవగాహన కల్పించి, హిమాలయాల్లోని గ్రామాలని పర్యావరణ ఉద్యమానికి సమాయత్త పరిచింది. వారిలో గౌరాదేవి ప్రముఖ నాయకురాలు. సురక్షా దేవి, సుదేశా దేవి, బచ్నీ దేవి, విరుశ్కా దేవి మొదలైన వారు ఉద్యమ నాయకురాళ్ళు. వందలాదిమంది స్త్రీలు, మహావృక్షాలను హత్తుకుని నిలబడి, `నరికితే మమ్మల్ని నరకండి, చెట్లను కాదు’ అని నిరాహార దీక్షలు, సత్యాగ్రహం చేసారు. వృక్షాల చుట్టూ పవిత్ర దారాలని కట్టి, వాటి చుట్టూ నిలబడి, శ్రీ భగవద్గీత పారాయణం చేసారు. గోరాదేవి నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చి, కమిటీ ఏర్పరిచి, తరువాత 10సం. పాటు చెట్లు నరకడం నిషేధించింది. తదుపరి దశలో ఈ ఉద్యమమే 1980లో అటవీ సంరక్షణ చట్టం ( Forest Conservation Act) రావడానికి కారణమైంది. తరువాతి కాలంలో, ఉద్యమించిన ఈ స్త్రీలే పర్యావరణ రక్షణకై అడవుల పెంపకం చేపట్టి, మళ్ళి అక్కడి భూమిని సస్యశ్యామలం చేసారు. “భారతదేశ సహజ వనరుల పరిరక్షణ, పునరుద్ధరణ ఎంతో అంకితభావంతో సాధించిన” చిప్కో ఉద్యమానికి 1987లో ప్రఖ్యాత అంతర్జాతీయ “రైట్ లైవ్లీహుడ్ అవార్డు’ (జీవనోపాధులు) లభించింది. తరువాతి దశలో 1980లలో ఈ ఉద్యమం మరింత విస్తృతమై, హిమాలయ పర్వత శ్రేణుల్లో అటవీ సంపద కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా `హిమాలయాలను సంరక్షించుకుందాము’/`సేవ్ ద హిమాలయాస్’ ఉద్యమంగా కొనసాగింది. తెహ్రి ప్రాంతంలో భాగీరథీ నదిపై కడుతున్న అనేకానేక ఆనకట్టల వల్ల జరగబోయే అనర్థాలగురించి అవగాహన పెరిగింది. కొన్ని కట్టడాల నిర్మాణం ఆపగలిగారు. చెట్లు లేకుండా ఉన్న మొండికొండలపై లక్షలాది మొక్కలునాటి, క్రమేణా తిరిగి వాటిని పచ్చగా మార్చగలిగారు.
ప్రకృతి/వన సంరక్షణ- బిష్ణోయ్(విష్ణు/వైష్ణో) సముదాయం
భారతీయ సంస్కృతిలో ప్రకృతినుంచి ఎంత అవసరమో అంత తీసుకోవడం తప్ప, ప్రకృతిని కొల్లగొట్టడం లేదు. ప్రకృతి-స్త్రీల అవినాభావ సంబంధం కూడా అంతే సనాతనం. చిప్కో గతచరిత్ర తరిచి చూస్తే, అసలు మొదటగా వృక్ష-పరిరక్షణ వారి పవిత్ర కర్తవ్యంగా భావించే బిష్ణోయ్ సముదాయం గురించి తెలుసుకోవాలి. 15వ శతాబ్దoలో ఈ సంప్రదాయాన్ని `గురు జాంబేశ్వర్’ స్థాపించారు. వీరికి ఆ గురువుగారు 29సూత్రాలను ఉపదేశించారు, వాటిలో 8 పర్యావరణం ప్రకృతి పరిరక్షణ, జంతు జీవజాల సంరక్షణ ప్రముఖమైనవి. బిష్ణోయ్ సముదాయం, విష్ణుపూజ చేసే వైష్ణవులే కాక, ప్రకృతి ఆరాధకులు, వృక్షాలు, నీరు, సమస్త జీవజాతిని కాపాడే ప్రతిజ్ఞ్య చేసినవారు. వృక్షాలే లేని థార్ ఎడారి ప్రాంతమైన రాజస్తాన్ జోధపుర్ జిల్లాలో, ఖేజ్రి చెట్లని చాలా పవిత్రంగా చూస్తారు. ౩౦౦వందల సంవత్సరాలక్రితం 1730లో అప్పటి మార్వార్ రాజు ఖేజ్రి వృక్షాలను కూల్చేయమని ఆదేశాలిస్తే, ప్రసిద్ధి చెందిన బిష్ణోయ్ (వైష్ణో) సముదాయానికి చెందిన స్త్రీలు, వైష్ణవ సంప్రదాయంలో పవిత్రమైన చెట్లను కొట్టడం, ప్రకృతిని నాశనం చేయడం నిషిద్ధమని, అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో ప్రతిఘటించి, చెట్లని హత్తుకుని నిలబడి పడగొట్టనీయకుండా అడ్డుకున్నారు. చెట్లకు బదులు జరిమానా కట్టమని అధికారులు అనగా, `సర్ సంతే రుక్ రహే, ఫిర్ భీ సస్తో జాన్’ అంటే, `మనిషి తల బదులుగా ఒక చెట్టును కాపాడినా, అది సబబే’ అని అమృతాదేవి ప్రాణత్యాగం చేసింది. ఆ వార్త విని చుట్టుపక్కల ఉన్న 83 గ్రామాల ప్రజలు గుమిగూడి, అధికారులు ఇంకా చెట్లు నరుకుతుంటే, చెట్లకు హత్తుకుని నిలబడి, చివరికి 363 మంది స్త్రీ-పురుషులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసారు. ఇది తెలుసుకుని రాజు వ్యధచెoది, బిష్ణోయ్ గ్రామాల్లో శాశ్వతంగా చెట్లు పడగొట్టరాదని ఆజ్ఞ జారీ చేసాడు. నేటికీ అమృతాదేవి, మిగతా363 మందిని అక్కడి ప్రజలు దైవసమానంగా ఆరాధిస్తారు. హిందీ సినిమానటుడు సల్మాన్ ఖాన్ జోధపుర్లో 1998లో `కృష్ణ జింక’ని చంపిన కేసులో `అఖిల భారత బిష్ణోయ్ మహాసభ’ డబ్బు పరపతికి లొంగకుండా, పట్టువదలకుండా ఇంకా కేసు నడిపిస్తోంది.
చిప్కో ఉద్యమ స్ఫూర్తి
చిప్కో సత్యాగ్రహ ఉద్యమం ఆనాడే కాదు, ఇవాళ కూడా మనకు మన ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ప్రకృతితో మమేకమై జీవించడం మొదలైన ఎన్నో పాఠాలు మనకు ఈ ఉద్యమం నేర్పిస్తుంది. ప్రకృతిని అడ్డుఆపు లేకుండా కొల్లగొడితే ఎంతటి విధ్వంసం, విలయం సృష్టించి, ప్రజల ప్రాణాలు పోవడమేకాక, దేశ ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమైపోతాయి. విపరీతంగా జనాభా పెరిగి, అడవులను పశుపక్ష్యాదులను నాశనం చేసి, పర్యావరణ సమతుల్యత కోల్పోయి దేశ మనుగడ, భవిష్యత్తును దెబ్బతీసే స్థాయికి చేరుకుంటున్నాము. పర్యావరణ సమతుల్యత, ప్రకృతితో సహజీవనం మన హిందూ సంస్కృతిలో అంతర్భాగం. పర్యావరణ వినాశనం అంటే మానవాళి వినాశనం.
This article was first published in 2021