మణిపుర్ రాష్ట్రంలోని లెంగాంగ్చింగ్ గ్రామంలో గ్రామ పెద్దలు రీటా హోరై అనే క్రైస్తవ మహిళా శవాన్ని ఊరిలో ఖననం చేయడానికి అంగీకరించలేదు. కారణం ఏమిటంటే చనిపోయిన మహిళ కూడా క్రైస్తవ మతానికి చెందినదే అయినా ఊళ్ళో మిగిలిన వారు అనుసరించే క్రైస్తవ పంథా కు చెందినది కాదు. దీనితో ఆమె బౌతికకాయం ఎలాంటి అంతిమ సంస్కారాలకు నోచుకోకుండా 6 రోజులుగా అనగా 12 ఆగష్టు వరకు అదే విధంగా మిగిలిపోయింది. వివిధ పౌరసంఘాలు, సంస్థలు ఈ అమానుష సంఘటనను ఖండించాయి.
మణిపుర్ లోని కాంజోంగ్ జిల్లా సికిబుంగ్ గ్రామానికి దగ్గరగా ఉండే లెంగాంగ్చింగ్ ఒక తంగ్ ఖుల్ నాగా నివాసం. వీరు శతాబ్దం క్రితమే క్రైస్తవం పుచ్చుకున్నారు. అమెరికా బాప్టిస్ట్ పంథాను అనుసరించే ఈ గ్రామంలో కొద్దిమంది కాథలిక్ లు కూడా ఉన్నారు. వారిలో చనిపోయిన రీటా హోరై ఒకరు. 2009లో గ్రామంలోని కొంతమంది మహిళలు కాథలిక్ పంథాను స్వీకరించడానికి తమకు అనుమతి ఇవ్వాలని గ్రామ పెద్దలను కోరారు. కానీ లెంగాంగ్చింగ్ గ్రామ నిబంధనల ప్రకారం `ఇది బాప్టిస్ట్ క్రైస్తవ గ్రామం’ గానే ఉండాలని ఇందులో మరొక పంథా కు స్థానం లేదని గ్రామ పెద్దలు తేల్చేశారు. అంతే కాదు తమ మాట వినకుండా కాథలిక్ పంథాను అనుసరిస్తున్న వారిపై సాటి క్రైస్తవులని చూడకుండా 3 మే, 2010 న మిగిలిన గ్రామస్తులు దాడి చేశారు. 5 కాథలిక్ కుటుంబాలను ఊరు నుండి బహిష్కరించారు.
క్రైస్తవ తంగ్ ఖుల్ వర్గం ఇలాంటి అమానుష పద్దతులు పాటించడం సర్వత్ర విమర్శలకు దారితీసింది.
ఇలా ఒక గ్రామం ఒక మతం /మత వర్గం అనే విధానం అసలు దేశపు సెక్యులర్, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సాటి మనిషి భౌతిక కాయాన్ని ఖననం చేయడానికి అభ్యంతర పెట్టడం మానవ విలువలు, హక్కులను కాలరాయడమే అవుతుంది అని మండిపడుతున్నారు.
“ఈ సంఘటన క్రైస్తవ సమాజంలో ఉన్న అరాచక, దుష్ట పద్దతులు, ఆలోచనలను బయటపెడుతోంది. ఇది పరస్పర సహకారం, సౌభ్రాతృత్వం వంటి విలువలకు వ్యతిరేకం’’ అని TCFD అనే క్రైస్తవ సంస్థ ఒక ప్రకటనలో ఖండించింది.
“చనిపోయిన వ్యక్తి కేవలం కాథలిక్ వర్గానికి చెందినది కాబట్టి ఖననానికి అభ్యంతరం చెప్పడం చాలా దారుణం. ఇది క్రైస్తవ సమాజం అంతా ఒకటి అని చెపుతున్న భావానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇలా మత పద్దతులు, పంథాల ఆధారంగా క్రైస్తవ మత నాయకులు ప్రజలను విడగొట్టడం చాలా దురదృష్టకరం’’ అని నార్త్ ఈస్ట్ కాథలిక్ కమ్యూనిటీ సంస్థ ఒక ప్రకటనలో ఖండించింది.
(ANI సౌజన్యంతో)