ఆంధ్రప్రదేశ్: కడప జిల్లాలో ప్రొదుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మేల్యే ఆర్.శివప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేయగా మైదుకుర్ రోడ్- జిన్నా రోడ్ జంక్షన్ వద్ద విగ్రహా నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.ఆర్.పి.ఎఫ్) కడప జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును తన ఫిర్యాదులో ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, రోడ్లు, భవనాల శాఖ జీవో నెంబర్ 18 జారీ చేసిందని, జారీ జీవో ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో, రోడ్డుకు ఇరువైపులా విగ్రహాలు లేదా ఏదైనా నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఎల్.ఆర్.పి.ఎఫ్ పేర్కొంది.
ఈ మేరకు పొద్దుటూర్ పట్టణంలో విగ్రహం ప్రతిపాదిత నిర్మాణం G.O.18 స్పష్టమైన ఉల్లంఘన మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించడమే అవుతుందని ఎల్.ఆర్.పి.ఎఫ్ తన ఫిర్యాదులో పేర్కొంది. సుప్రీకోర్టు తీర్పు నేపథ్యంలో టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు నిలిపివేయాలని ఎల్.ఆర్.పి.ఎఫ్ జిల్లా కలెక్టర్‌ను కోరింది. శివశక్తి సంస్థ కార్యకర్తలు కూడా ఈ మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ ను కలిసి తమ ఫిర్యాదు అందజేశారు.
మరోవైపు, టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బిజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిర్మాణాన్ని కూల్చివేస్తామని కూడా హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో మత ఉద్రిక్తతకు కారణమవుతుందని కాబట్టి ఆ విగ్రహానికి బదులుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని నిర్మించాలని బిజేపీ నాయకులు కోరారు.