కాంగ్రెస్ పార్టీ తన “భారత్ జోడో యాత్ర” ప్రారంభించి వారం కూడా కాలేదు. ఇంతలోనే ఆ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. రాజకీయ లబ్ధి కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని బాలల విభాగం ‘జవహర్ బాల్ మంచ్’పై లీగల్ రైట్స్ ప్రోటెక్షన్ ఫోరం(LRPF), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)లో ఫిర్యాదు చేసింది.
వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒక ఫాన్సీ రోడ్-ట్రిప్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది.
ఇందులో భారత్ జోడో బచ్చే జోడో ప్రచారాన్ని ‘జవహర్ బాల్ మంచ్’ నిర్వహిస్తుంది. ఇది 7 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభాగం. “పిల్లలలో సామాజిక విలువలు, సృజనాత్మకత, ఆవిష్కరణలు, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక, జాతీయవాద అంశాల్లో చురుకైన భాగస్వామ్యం, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద ఆదర్శాలకు కట్టుబడి ఉండటం వంటి లక్షణాలను పిల్లలలో పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది.” అని జవహర్ బాల్ మంచ్ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది.
అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రచారంలో భాగంగా పాఠశాలలను సందర్శిస్తూ, మైనర్ పిల్లలతో సంభాషిస్తూ వారిని రాజకీయ ప్రచారాల్లో పాల్గొనేలా చేసి వారిలో రాజకీయ భావజాలాన్ని పెంపొందిస్తున్నారు.
పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రాహుల్ గాంధీ యాత్ర, అతని పరస్పర చర్యలకు సంబంధించిన అనేక వీడియోలను ప్రచురిస్తోంది. ‘భారత్ జోడో బచ్చే జోడో’ నినాదంతో రాజకీయ ఎజెండాతో పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్న పలు చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రచారంలో పాల్గొన్న మైనర్ పిల్లలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని రాజకీయ నినాదాలు చేస్తూ కనిపించారు.
“ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద ఉన్న నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలలో మైనర్ పిల్లలను సమీకరించడానికి ఒక రాజకీయ పార్టీ అంతర్గత విభాగాన్ని ఏర్పాటు చేయడం పిల్లల స్వేచ్చకు భంగం కలిగించే విషయం.” అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF), NCPCRకి దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
ఎన్నికల సమయంలో లేదా రాజకీయ ప్రచార సమయంలో పిల్లలను ఊరేగించడం బాలల హక్కులను ఉల్లంఘించడమేనని భారత ఎన్నికల సంఘం, NCPCRతో సహా క్వాసీ-జ్యుడీషియల్ సంస్థలు స్పష్టం చేశాయని కూడా ఫిర్యాదు పేర్కొంది.
“పిల్లలు రాజకీయ ర్యాలీలు, నినాదాలు చేయడం మొదలైన వాటిలో పాల్గొనడాన్ని పూర్తిగా నిషేధించాలి. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు ఓటు వేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి చట్టబద్ధమైన హక్కు లేదు.” అని కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ పి గోపీనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
“పిల్లలను వారి వ్యక్తిగత రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి ఆసరాగా ఉపయోగించడం పిల్లల దుర్వినియోగం, ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.”, LRPF దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
“ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్ బాల్ మంచ్, రాహుల్ గాంధీ సంబంధిత వ్యక్తులపై అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, భారత జాతీయ కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించకుండా భారత ఎన్నికల కమిషన్‌కు సిఫార్సులు చేయాలని అభ్యర్థిస్తున్నట్టు ” అని LRPF తన ఫిర్యాదులో పేర్కొంది.
Lodged complaint with @NCPCR_ against 'JawaharBalManch', a wing of Indian National Congress targeting minor children & using them for its Nation-wide political campaign 'Bharat Jodo' launched by Rahul Gandhi in contravention to provisions of Representation of People Act 1951 pic.twitter.com/wMUzDkN9p5
— Legal Rights Protection Forum (@lawinforce) September 12, 2022