Home Telugu Articles అసోం ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీ

అసోం ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీ

0
SHARE

అసోమ్‌లో ఇటీవల వెలువరించిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాపై కాంగ్రెస్‌ అనవసర రభస సృష్టిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. దాదాపు 40 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ఈ జాబితా వెల్లడించింది. ఎన్‌ఆర్‌సీ జాబితా పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి అవకాశంగా మారింది. విదేశీయుల గుర్తింపు, వారిని వెనక్కి పంపడం వంటి హామీలను కాంగ్రెస్‌ గతంలో ఇచ్చింది. తన హయాములో ఆ పార్టీ వాటిని నెరవేర్చలేకపోయింది. ఇది భాజపాకు కలిసివచ్చే అంశం. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ, కుల ప్రాతిపదికన రాజకీయాలు నడిపే కొందరు నాయకులు రాష్ట్రానికి సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరిస్తున్నారు. ముస్లిములను ప్రభావితం చేసేందుకు, వారి ప్రాపకం కోసం తంటాలు పడుతున్నారు. అక్రమ వలసలపై గతంలో పార్టీ అధినేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీ నాయకులు విస్మరించినట్లు కనపడుతోంది. అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపుతామని 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు. 1985లో ఆమె తనయుడైన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆ హామీని పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపారు. ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఏఎస్‌యు- ఆసు), ఆల్‌ అసోం గణ సంగ్రామ పరిషత్‌ (ఏఏజీఎస్‌పీ)తో చర్చలు జరిపారు. ఫలితంగా 1985లో అసోం ఒప్పందం రూపుదిద్దుకొంది.

అక్రమ వలసలపై మాటమార్చిన కాంగ్రెస్‌

అక్రమ వలసదారుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాట తప్పడాన్ని, దాని వైఫల్యాన్ని చూస్తే ఒక విషయం గుర్తుకు రాక మానదు. 1998లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం నిర్వహించిన అణుపరీక్షలపై కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే మాట్లాడి అభాసుపాలైంది. మొదట పోఖ్రాన్‌-2 అణుపరీక్షలను నిరసించిన హస్తం పార్టీ ఆ తరవాత మాట మార్చింది. అణు పరీక్షల వల్ల భాజపా ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి కలిగిందని గ్రహించాక దాని స్వరంలో మార్పు వచ్చింది. ఎప్పుడో 1974లోనే తమ పార్టీ అధినేత, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పోఖ్రాన్‌లో పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశాన్ని అణుశక్తి దేశంగా తీర్చిదిద్దారని గంభీరంగా పేర్కొంది. కొత్తగా వాజ్‌పేయీ చేసిందేమీ లేదన్నది పరోక్షంగా దాని అభిప్రాయం. జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అలా మాట్లాడటం సరికాదని చివరికి గ్రహించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా లబ్ధి పొందింది. కాంగ్రెస్‌ నష్టపోయింది.

తాజాగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో కాంగ్రెస్‌ వైఖరి అవగాహన రాహిత్యాన్ని తలపిస్తోంది. దాని వైఖరిలో స్పష్టత లోపించింది. 1985 ఆగస్టు 15న నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ఆసు, ఏఏజీఎస్‌పీ మధ్య కుదిరిన అసోం ఒప్పందం రాష్ట్ర ప్రజలకు కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చింది. విదేశీయులను వెనక్కి పంపిస్తామన్నది వీటిలో ప్రధానమైనది. విదేశీయుల సమస్యను 1980 ఫిబ్రవరిలోనే ‘ఆసు’ నాటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకువెళ్లింది. అక్రమ వలసల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది. ఈ సమస్య రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వినతిపత్రాన్ని అందజేసింది. వారి ఆందోళన సహేతుకమని భావించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ‘ఆసు’, ఏఏజీఎస్‌పీతో చర్చలకు చొరవ చూపింది. 1985లో అసోం ఒప్పందం రూపుదాల్చడానికి ఈ చర్చలు దోహదపడ్డాయి. 1971 మార్చి 25 తరవాత వలస వచ్చినవారిని గుర్తించడం, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, వెనక్కి పంపడానికి చర్యలు చేపట్టడం ఒప్పంద ముఖ్యాంశాలు. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 24 మధ్యవచ్చిన వారిని 1946 నాటి విదేశీయుల చట్టం, 1964 నాటి విదేశీయుల (ట్రైబ్యునల్‌) ఉత్తర్వుల ప్రకారం గుర్తించడంతో పాటు ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు. వీటితో పాటు అక్రమ వలసలను అడ్డుకునేందుకు భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో గట్టి చర్యలు చేపడతామని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అసోం ఒప్పందం అనంతరం ప్రభుత్వం ఆర్భాటంగా అక్రమ వలసదారుల (నిర్ధారణ) చట్టం (ఐఎండీటీ) తీసుకువచ్చింది. ఆశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో ఇది విఫలమైంది. విదేశీయుల గుర్తింపు, వారిని వెనక్కి పంపడంలో విజయవంతం కాలేకపోయింది. లక్షల్లో విదేశీయులు ఉండగా, వేల మందిని మాత్రమే గుర్తించింది. ఈ చట్టం వైఫల్యంపై శర్బానంద సోనొవాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. అదే శర్బానంద కాలక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మారి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఐఎండీటీ చట్టం రాజ్యాంగ విరుద్ధమని 2005 జులై 12న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్రమ వలసలకు సంబంధించి 85 శాతం విచారణలు తిరస్కరణలకు గురయ్యాయని, ట్రైబ్యునల్‌ పరిశీలనకు ఏమీ వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రమాణ పత్రంలో పేర్కొంది. ఐఎండీటీ చట్టం నిబంధనలు లోపభూయిష్ఠంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. అసోం సన్‌మిలిట మహాసంఘ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులోనూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పలు ఆదేశాలు ఇచ్చింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, జాతీయ పౌరపట్టికను రూపొందించాలనీ నిర్దేశించింది. ఈ ప్రక్రియ 2016 జులైలోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఓటు బ్యాంకు రాజకీయాలకు ఊతం

అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపిస్తామని ఇందిర, రాజీవ్‌గాంధీ ఎన్నోసార్లు ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీ లక్ష్యం సైతం ఇదే. ఎన్‌ఆర్‌సీ కసరత్తు, తీరుతెన్నులను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం ఈ దిశగానే ఆదేశాలు ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్న సంగతి కాంగ్రెస్‌ పార్టీ గుర్తించడం లేదు. భారతీయ జనతా పార్టీ విభజిత రాజకీయాల్లో ఎన్‌ఆర్‌సీ ఓ భాగమని చెప్పడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అంతేకాక ఈ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని చెప్పడానికి తంటాలు పడుతోంది. అదే సమయంలో ముస్లిం ఓటుబ్యాంకు నిలుపుకోవడానికి తన వైఖరి దోహదపడుతుందని భావిస్తోంది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించిన అక్రమ వలసదారులు కొన్ని రాజకీయ పార్టీలకు నికరమైన ఓటుబ్యాంకులుగా మారారు. సామాజిక ఉద్రిక్తతలకు, భద్రతాపరమైన సమస్యలకు కారణమవుతున్నారు. నిజమైన అసోం పౌరులు ఈ సమస్యపై ఉద్యమించాల్సిన అవసరం ఉంది. పౌరుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ నిలబడకపోతే అందుకు అది తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పోఖ్రాన్‌-2 అణు పరీక్షల అనంతరం మాదిరిగా ఇప్పుడూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది!

ఏ సూర్యప్రకాష్
ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)