Home News వివాదాస్పద జ్ఞానవాపి మందిరం విశేషాలు

వివాదాస్పద జ్ఞానవాపి మందిరం విశేషాలు

0
SHARE

వారణాసిలో జ్ఞాన‌వాపి మందిరం పై వివాదం సరిగ్గా 31 ఏళ్ల క్రితం మొదలైంది. జ్ఞాన‌వాపిపై ఎంతో మంది హిందువులు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, న్యాయ పోరాటాలు చేశారు.

జ్ఞానవాపి మందిరం వివాదంలో కీలక అంశాల విషయానికి వస్తే.. 1991లో వారణాసి కోర్టులో స్థానిక పూజారులు జ్ఞానవాపి మందిరం  ప్రాంతంలో పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 16వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి ఆయన ఆదేశాల మేరకు మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్లు కోరిన మీదట భారత పురావస్తు శాఖ (ASI) సర్వేపై 2019లో అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఐదుగురు హిందూ మహిళలు జ్ఞానవాపి మందిర‌ సముదాయంలోని శృంగార్ గౌరీ, ఇతర విగ్రహాలను పూజించుకోవాలని అనుమతి కోరడంతో ప్రస్తుత వివాదం మ‌రింత ముదిరింది.

గత నెలలో వారణాసి కోర్టు ప్రాంగణంలోని పశ్చిమ గోడ వెనుక పూజలు చేయడానికి అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు పిటిషన్లు దాఖలు చేసిన తరువాత జ్ఞానవాపి మందిర‌ సముదాయం వీడియోగ్రాఫ్ సర్వేకు కోర్టు ఆదేశించింది. సర్వే నివేదికను మే 10లోగా సమర్పించాలని తొలుత ఆదేశించింది. అయితే ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, మసీదు కమిటీ ఈ ఉత్తర్వును సవాలు చేయడంతో జాప్యం జరిగింది. వారణాసి కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఏ సందర్భంలోనైనా ఇరు ప‌క్షాలు సహకరించినా, చేయకపోయినా సర్వే పనులు ఆగవని స్పష్టం చేసింది.

జ్ఞానవాపి మందిరం సర్వే మే 16న ముగిసింది. సర్వే సందర్భంగా మందిర‌ కాంప్లెక్స్‌లోని రిజర్వాయర్‌లో శివలింగం బ‌య‌ట‌ప‌డింద‌ని, శివలింగం దొరికిన ప్ర‌దేశాన్ని సీలు వేయాల‌ని కోర్టు ఆదేశించిన‌ట్టు హిందూ మ‌హిళ‌ల త‌రుపు న్యాయవాది నంద‌న్ చ‌తుర్వేది తెలిపారు.

ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేసి ఆ ప్ర‌దేశంలో జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేప‌ట్టినట్టు చ‌రిత్ర చెబుతుంది. అయితే ఆ కాలపు చరిత్రకారుడు.. సకీ ముస్తయిద్ ఖాన్ తన మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం, అతని అధికారులు కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినట్లు అందులో ఉంది. ఇక జ్ఞానవాపి మందిరం పశ్చిమ గోడ వెనుక శృంగార్ గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని చూపిస్తూ జ్ఞానవాపి మసీదు విశ్వేశ్వర ఆలయానికి అసలు గర్భగుడి అని హిందూ పిటిషనర్లు కోర్టులో పిటిష‌న్‌లు వేసి న్యాయ‌పోరాటం చేశారు. అయితే ఈ వాదనను మసీదు కమిటీ, ముస్లిం సంఘాలు తప్పు పడుతూ వ‌చ్చాయి.

చరిత్రను గ‌మ‌నిస్తే, 4వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం మధ్య కాలంలో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. భారతదేశ పాలకుల్లో ప్రముఖుడైన విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1194లో మహ్మద్‌ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌… కన్నౌజ్‌ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్లు చరిత్ర చెబుతోంది. 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే, మళ్ళీ 1489-1517 సంవత్సరాల మధ్య కాలంలో సికందర్‌ లోఢీ హయాంలో కూల్చివేశారు. ఇక ఔరంగజేబు మొఘల్‌ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేశారు. అప్పుడే విశ్వనాథుడి ఆలయం మీద మసీదు నిర్మించారని చెబుతారు.

ఇప్పటికీ జ్ఞాన‌వాపి మందిరం దక్షిణపు గోడను పరిశీలిస్తే.. రాతి శిలా తోరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా మసీదుల్లో ఇలాంటి శిల్పకళ ఎక్కడా కనిపించదు. కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి శిల్పకళ కనిపిస్తుంది. అయితే అప్పట్లో ఔరంగజేబు పూర్తిగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేయకుండా సగం కూల్చి, దాని మీద మసీదు నిర్మించారన్న వాదన కూడా ఉంది. ఔరంగజేబు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేసిన స్థానంలోనే మసీదు కట్టినట్లు 1698లో అంబర్‌ రాజు బిషన్‌ సింగ్‌ చెప్పినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే 1742లో కాశీ విశ్వనాథుడి ఆలయానికి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నం చేసినా, నాటి నవాబుల వల్ల అది సాధ్యం కాలేదు. మరాఠా సుబేదార్‌ మల్హర్‌ రావు హోల్కర్‌ కోడలు అహల్యాబాయ్‌ హోల్కర్‌ హయాంలో చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. అలా అప్పుడు కట్టిందే, మనకు ఇప్పుడు కనిపిస్తున్న కాశీ విశ్వనాథుడి ఆలయం.