Home Telugu Articles చర్చి ముసుగులో ఘోర నేరాలు..  వెలికి వస్తున్న దారుణ వాస్తవాలు

చర్చి ముసుగులో ఘోర నేరాలు..  వెలికి వస్తున్న దారుణ వాస్తవాలు

0
SHARE

 – ప్రదక్షిణ

సిస్టర్ అభయ కేసు

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (బీనా థామస్) హత్య కేసులో  కేరళ తిరువనంతపురం సిబిఐ ప్రత్యేక కోర్టు  28 సంవత్సరాలకు, 23 డిసెంబర్ 2020 తేదీన తీర్పు వెలువరించింది. నిందితులైన చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సేఫిలను నేరస్థులుగా ప్రకటించి, వారికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

కొట్టాయం సెయింట్ జోసెఫ్ సైరో-మలబార్ చర్చిలో నన్ గా సేవలందిస్తున్న 19 ఏళ్ల సిస్టర్ అభయ 27 మార్చి 1992న జరిగిన దారుణ హత్యో ఘటనలో బావిలో శవమై కనిపించింది. కేరళ పోలీసు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును నీరుగార్చారు. అయితే జోమేన్ పుతెన్పురకల్ వంటి మానవహక్కుల కార్యకర్తల ప్రయాసల కారణంగా, కేరళ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐకి చెందిన మొదటి బృందం కూడా ఈ కేసుని విచారించడంలో విఫలమైంది. రెండవ సిబిఐ బృందం దీన్ని హత్యగా నిరూపించినా నేరస్థులను కనిపెట్టడంలో విఫలమైంది. చివరిగా, 2008లో సిబిఐ మూడవ బృందం తన విచారణను సరైన దిశలో చేపట్టి, ఇద్దరు క్రైస్తవ మతాధికారులతో పాటు ఫాదర్ థామస్ కొట్టూర్, జోస్ పుతురుక్కయిల్, మరొక సిస్టర్ సేఫి ఈ హత్యకి బాధ్యులని ఆరోపించి వారిని అరెస్ట్ చేసింది. తాజాగా డిసెంబర్ 2020లో, దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత, ఈ బృందం కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి హంతకులకి శిక్ష పడేలా చేయడంలో విజయం సాధించారు.
పరీక్షల కోసం చదువుకుంటున్న సిస్టర్ అభయ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంచి నీళ్ళ కోసం కాన్వెంట్లోని వంటింట్లోకి వెళ్ళగా, నిందితులు ఇద్దరూ అసాధారణ స్థితిలో ఆమెకి కనిపించారు. ఈమె ఆ సంగతి బయటకి చెప్తుందని వాళ్ళు భయపడ్డారు.  ఈ క్రైస్తవ ఫాదర్, సిస్టర్ల మధ్య ఉన్న అక్రమ సంబంధం గుట్టు రట్టుఅవడం, ఇది చర్చి నియమాలకి విరుద్ధం కావడంతో ఈ విషయాన్ని బయటపెడుతుందన్న భయంతో వారిద్దరూ కలిసి సిస్టర్ అభయను గొడ్డలితో నరికి చంపేసి, బావిలో పడేసారు.
కాకతాళీయంగా రాజు అనే వ్యక్తి దొంగతనం చేయడానికి అదే సమయంలో ఈ కాన్వెంట్ డాబా మీదకి ఎక్కగా, అతనికి ఈ హంతకులిద్దరూ కనపడ్డారు. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతోమంది సాక్షులు వారి వాంగ్మూలాలను ఉపసంహరించుకున్నా, ఆశ్చర్యకరంగా దొంగతనమే జీవనోపాధిగా బ్రతుకుతున్న రాజు, ఏమాత్రం రాజీ పడకుండా, స్వార్థపరుల ఒత్తిడి, లంచాలు, చాలా శక్తివంతమైన చర్చి బెదిరింపులకి లొంగకుండా ఈ కేసులో నిజాయితీగా సాక్ష్యం చెప్పి, దోషులకి శిక్ష పడేటట్లు చేయగలిగాడు. ఫాదర్ థామస్ కొట్టూర్ వెనక అపారమైన ధనసంపత్తి కల చర్చి అండగా ఉండటం వల్ల, కేరళ హైకోర్టునుంచి ఎన్నోసార్లు `స్టే’ తెచ్చుకోవడమే కాక, మొత్తం చర్చి కాన్వెంట్ సిబ్బంది అంతా నిందుతుల పక్షానే ఉన్నారని సీబీఐ న్యాయస్థానం తన తీర్పులో పేర్కొనడం గమనార్హం.
చర్చి మతస్వేచ్చ ముసుగులో జరుగుతున్న ఎన్నో అక్రమాలు కొంతకాలంగా వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఎన్నో రాష్ట్రాలలో, ముఖ్యంగా కేరళలో చర్చి వ్యవస్థ రాజకీయంగా చాలా శక్తివంతమైనది. ఈ రాష్ట్రంలో రెండు రాజకీయ  పార్టీలు – కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ..  ఒకరి తర్వాత  తరువాత మరొక పార్టీ పదవిలోకి వస్తుంటారు. కానీ చర్చి పరపతి, క్రైస్తవ ఓటుబ్యాంక్ రాజకీయాలకు ఈ రెండు పార్టీలు ఎప్పడూ దాసోహమే. ఈ రెండు పార్టీలు పదవిలో ఉండగా, చర్చి అక్రమాలు బయటకి రావడం దుర్లభమే.

రాజకీయంగా చర్చి ప్రభావం అర్ధం కావాలంటే, ఒక చిన్న ఇతివృత్తం తెలుసుకోవాలి. ప్రముఖ నటుడు సురేష్ గోపి హీరోగా నటించిన మలయాళం  సినిమా `క్రైమ్ ఫైల్’ సిస్టర్ అభయ కేసు ఆధారంగా తీసిన సినిమా. 1999లో ఈ సినిమా విడుదలైన తరువాత, కాథలిక్ చర్చ్ పట్టుబట్టి సినిమా అంతిమ ఘట్టాన్ని, తిరిగి షూటింగ్ చేయించి, చర్చ్ కి అనుకూలంగా మార్చగలిగింది.

ఫాదర్ ఫ్రాంకో ములక్కల్ కేసు:
ఇదే కేరళ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన క్రైస్తవ ఫాదర్ ఫ్రాంకో ములక్కల్ సాగించిన అత్యాచారం కేసును కూడా కాథలిక్ చర్చ్ ఈ విధంగానే కప్పిపుచ్చాలని చూసింది. కేరళ కొట్టాయంకి చెందిన ఇతను పంజాబ్ జలంధర్ జిల్లాలో క్రైస్తవ ప్రబోధకుడిగా ఉన్నాడు. అతను కేరళకి వెళ్ళినప్పుడు 2014-16 సంవత్సరాల మధ్య తనమీద పదే పదే  అత్యాచారం చేసాడని, ఒక క్రైస్తవ మతప్రబోధకురాలు (నన్) ఆరోపించింది. మరో ముగ్గురు స్త్రీలు కూడా ఇతనిపై బలాత్కారం ఆరోపణలు చేసారు. అయినా చర్చి ఎంతమాత్రం ఖాతరు చేయకపోగా, బాధితురాలిని చర్చి నుంచి తొలగించింది. ఈ ఫాదర్ ఫ్రాంకో తాను భారతదేశ చట్టాల ద్వారా విచారణ చేయడానికి అంగీకరించనని, ఇది చర్చి అంతర్గత వ్యవహారం కాబట్టి, ఇటలీలో ఉన్న `వాటికన్’కి మాత్రమే ఆదేశo ఇచ్చే హక్కు ఉందని బహిరంగ ప్రకటన చేసి, భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసాడు. చర్చిలో సిస్టర్స్, స్త్రీల హక్కుల కార్యకర్తలు, సాధారణ ప్రజలు,  కొన్ని నెలలు నిరసనలు జరిపిన తరువాత కూడా, చర్చి మాత్రం  ఫాదర్ ఫ్రాంకో తరపునే నిలబడింది, `మిషనరీస్ అఫ్ జీసస్’ సంస్థ కూడా అతనినే సమర్థించి. చర్చి సభ్యులు బాధిత సిస్టర్ కి వ్యతిరేకంగా ప్రకటనలు చేసారు. అలాగే కేరళ కమ్యునిస్టు ప్రభుత్వం కూడా ఏ చర్య తీసుకోలేదు. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కమ్యూనిస్టు పత్రిక `దేశాభిమాని’లో, చర్చ్ సిస్టర్ల నిరసన చర్చ్ కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని చేస్తున్న నిరసన అని ఆరోపించారు. కమ్యూనిస్టు ఎంఎల్ఏ పిసి జార్జ్, నేరారోపణ చేసిన సిస్టర్ని `వేశ్య’ అని దూషించాడు. బాధిత సిస్టర్ నేరుగా వాటికన్ కి తనపై జరిగిన అత్యాచారం గురించి తెలుపుతూ అభ్యర్థించినా, వాటికన్ పట్టించుకోలేదు. చివరికి సెప్టెంబర్ 2018లో ఫాదర్ ఫ్రాంకో అరెష్టై జైలు పాలయాడు. రెండవ సారి అప్పీల్ మీద కేరళ హైకోర్టు, ఇతనికి బెయిల్ ఇచ్చింది. ఇతను జలంధర్ చర్చికి తిరిగి వెళ్ళినపుడు, అక్కడి చర్చి సిబ్బంది పువ్వులవాన కురిపించి ఘనస్వాగతం పలికారు. ఎట్టకేలకు చర్చి ఎటువైపు ఉంటుందో ఇటువంటి కేసులు ఎన్నో ఎత్తిచూపుతున్నాయి.

చర్చి సంస్థల అనాగరిక వికృత వ్యాపార వ్యవహారాలు
ఫిబ్రవరి 2018లో వెలుగు చూసిన అతిదారుణ క్రూర సంఘటన..  స్థానిక మీడియా సంస్థలు ఈ వార్తలను ప్రసారం చేసినప్పటికీ , కొద్ది రోజులలోనే ఇది కప్పిపుచ్చబడింది. చెన్నై సమీపంలోని తాంబరంలోని `సెంట్ జోసెఫ్ హాస్పైస్/కరుణా ఇల్లం’ అనే క్రిస్టియన్ సంస్థ శవాల వ్యాపారం చేస్తూ పట్టుబడింది. ఒకరోజు సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని అంబులెన్సు నుంచి `రక్షించండి.. రక్షించండి’ అనే అరుపులు వినిపించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఎన్నో సంచలనకర వికృతమైన విషయాలు బయటపడ్డాయి. ఈ సంస్థలో వందలాది శవాలు బయటపడ్డాయి. అనాథ శవాలను చెన్నై తాంబరం హాస్పిటల్స్ నుంచి తీసుకువచ్చి అక్కడ ఉంచి, అస్థిపంజరాలు ఎముకల వ్యాపారం చేస్తున్నట్లు నేర పరిశోధనలో బయటపడింది. హాస్పిటల్స్ ఎందుకు ఇంత ఉదారంగా వీరికి శవాలు అందచేసాయో తెలియలేదు. అక్కడ `హాస్పైస్’లో చనిపోయిన వారి శవాలతో కూడా ఇదే విధంగా వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.  కనీసం 1600 శవాల గురించిన వార్తలు బయటకి వచ్చాయి. అంతేకాక, అనాథలు, బిచ్చగాళ్ళు, వృద్ధులు, మతిస్థిమితంలేని వారిని అక్కడ ఉంచి, వారికి గుండు చేసి కకావికలంగా చూపించి, వారిని బాగుచేసే నెపంతో ఈ ఎన్జీవో సంస్థ విదేశీ విరాళాలు పొందినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర లేక కేంద్ర మానవహక్కుల సంఘాలు, అక్కడి రాజకీయ పార్టీలు, జాతీయా మీడియా సంస్థలు ఎవరూ ఈ వ్యవహారంలో కల్పించుకోలేదు. వీరందరికీ క్రిస్టియన్ సంస్థల వ్యవహారాలలో కల్పించుకుంటే వారి `ఓటు బ్యాంకు’ రాజకీయాలు దెబ్బతింటాయనే భయం కారణం కావచ్చు. ఇటువంటి నేరాలు ఏ హిందూ సంస్థ అయినా చేసి ఉంటే, బహుశా ప్రభుత్వాలే కూలిపోయి ఉండేవి!

రాంచీ చర్చ్ సంస్థ బాలల అక్రమ రవాణా
2018 సంవత్సరం ఝార్ఖండ్ రాజధాని రాంచిలో మదర్ థెరెసా స్థాపించిన `మిషనరీస్ అఫ్ చారిటీ’ అనాథాశ్రమంలో పసిపిల్లలను అక్రమంగా అమ్మేసారనే నేరం మీద సిస్టర్ కొన్సిలియా, ఇంకా ఇద్దరు మహిళా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసారు. అనీమా అనే మహిళ నేరాన్ని ఒప్పుకుంది. ఆ హోంలో ఎంతోమంది అవివాహిత గర్భవతులు ఉన్నారని అప్పటి దినపత్రికల్లో వచ్చాయి. ఒక జంట అక్కడి ఒక పసిబిడ్దని రూ.1,25,000 కొనుక్కుని, పోలీసులకి తెలియజేయడంతో ఈ విషయం బయటకివచ్చింది. కనీసం ఆరుగురు పసిబిడ్దలని కొన్ని నెలలలో అమ్మారని పోలీసుల దర్యాప్తులో తేలింది.  దేశవ్యాప్తంగా ఈ సంస్థ అనేక బాలల అనాథాశ్రమాలు నడిపిస్తుంది. 1950లో అల్బేనియా దేశస్థురాలు ఆగ్నెస్ అనే నన్ కలకత్తాలో ఈ `మిషనరీస్ అఫ్ చారిటీ’ సంస్థను స్థాపించారు, ఈమే మదర్ థెరెసాగా, ఆ తరువాత సెంట్ థెరెసాగా చెలామణి అయారు. ఈవిడ `మిషనరీస్ అఫ్ చారిటీ’ కార్యకలాపాల గురించి ఆమె జీవించి ఉన్న రోజుల్లోనే అనేక వివాదాలుండేవి. అంతిమ దశలో ఉన్న రోగులకు `హోం ఫర్ ద డైయింగ్ డేస్టిట్యూట్’లో మందులు ఇవ్వకుండా, జీసస్ శిలువ మీద లాగా, రోగులు కూడా అలాగే బాధ భరించాలనేది ఆవిడ నమ్మకం. ప్రపంచంలో అనేక దేశాలు ఆవిడ పర్యటించి, హైతి లాంటి దేశాల నియంతల నుంచి కోట్లాది డాలర్ల విరాళాలు తెచ్చుకున్నారు, అయితే వాటికి లెక్కలు నిర్వహణ ఉండేదికాదని అనేక అభియోగాలు ఉన్నాయి.

పైన ఉదహరించిన ఘటనలు మచ్చుకు కేవలం కొన్ని మాత్రమే. సాధారణంగా ఎన్నో చర్చి సంస్థలు భారతదేశంలో కులమత వైషమ్యాలు, కుల వివక్ష, వెట్టిచాకిరి, బాలకార్మికులు, అనాథ పిల్లలకు బడులు వంటి అనేకానేక అంశాలమీద, ఉన్నవి లేనివి చెప్పి, విదేశీ విరాళాలు సేకరించి ఘరానా సంస్థలు నడుపుతుంటారు. ఇటువంటి సంస్థల్లో జరిగే మరెన్నో అక్రమాలు బయటకి రాకుండానే మరుగున పడిపోతున్నాయి.