హిందూ సమాజంలో చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కొందరు షెడ్యూల్ కులాలవారిలో ఆర్.ఎస్. ఎస్ గురించి అపోహలు ప్రచారం చేస్తుంటారు. తామే దళిత సంరక్షకులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే విభేదాలను రూపుమాపి హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి ఆర్.ఎస్.ఎస్ నిరంతరం కృషి చేస్తుందని వారికి బాగా తెలుసు.
అలాంటివారు ఆర్.ఎస్.ఎస్ పట్ల అపోహలు కలిగించేందుకు రకరకాల తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి కథనాలు ప్రచురించే వెబ్ సైట్ లలో వెలివాడ(velivada.com) కూడా ఒకటి. అందులో ఇటీవల `అంబేద్కర్ నిజంగానే ఆర్ ఎస్ ఎస్ శిబిరాన్ని సందర్శించారా?’(Did Ambedkar Really visit RSS Camp) అనే వ్యాసాన్ని ప్రచురించారు. Arise bharat లో ప్రచురించిన `ఆర్.ఎస్.ఎస్ స్థాపకులు డా. హెడ్గేవార్’ (Dr. Hedgewar the Founder of RSS) అనే వ్యాసంలో డా.అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించినట్లుగా వ్రాసారని, అది ఏమాత్రం నిజం కాదంటూ తమ వ్యాసంలో ఖండించారు.
అంబేద్కర్ ఎప్పుడూ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించనేలేదని, అలా తాను ఆర్.ఎస్. ఎస్ శిబిరానికి వెళ్ళినట్లు ఆయన ఎక్కడా రాయలేదన్నది `వెలివాడ’ వ్యాసపు సారాంశం. అయితే అంబేద్కర్ కూడా ఆర్.ఎస్.ఎస్ శిబిర సందర్శన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడూ అది తప్పని, అలా తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పిన దాఖలాలు లేవన్నది వాస్తవం. `వెలివాడ’ వ్యాసం మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన కథనాన్ని ప్రచారం చేయడం విచిత్రం.
అంబేద్కర్ 1939లో శిబిరాన్ని సందర్శించారని అదే శిబిరంలో పాల్గొన్న శ్రీ గంగాధర్ బాగుల్ చెప్పిన విషయాన్ని Arise bharat తన వ్యాసంలో ఉటంకించింది. కానీ సదరు గంగాధర్ బాగుల్ స్వయంసేవక్ కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని నమ్మలేమంటూ `వెలివాడ’ వాదిస్తోంది. చెప్పిన వారు స్వయంసేవక్ అయినప్పటికీ ఆయన స్వయంగా ఆ శిబిరంలో పాల్గొన్నారనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
అయినా అంతకంటే ముఖ్యమైన ఆధారం మరొకటి ఉంది. అది అతి ముఖ్యమైనదెందుకంటే అంబేద్కర్ శిబిర సదర్శనాన్ని గురించి వ్రాసినది స్వయంసేవక్ కాదు. ఆయన ఎప్పుడూ ఆర్. ఎస్.ఎస్ శాఖకి కూడా వెళ్లలేదు. పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. ఆయనే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు శ్రీ బాలాసాహెబ్ సాలుంకే.
అంబేద్కర్ కు సన్నిహితులైన బాలాసాహెబ్ జీవిత విశేషాల గురించి వారి కుమారుడైన కశ్యప్ సాలుంకే, భానుదాస్ గయక్వాడ్ తో కలిసి `ఆంచే సాహెబ్’(మా సాహెబ్) అనే పుస్తకాన్ని వ్రాసారు. అందులో అంబేద్కర్ ఆర్ ఎస్ ఎస్ శిబిర సందర్శన గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. అంబేద్కర్ తోపాటు బాలాసాహెబ్ సాలుంకే కూడా శిబిరానికి వెళ్ళినవారిలో ఉన్నారు. పుస్తకంలోని పుట 25, 53 లలో అంబేద్కర్ శిబిర సందర్శన వివరాలు ఉన్నాయి.
పుట 53లో `అణచివేతకు గురైన వర్గాల ఉద్ధరణ కోసం పనిచేస్తున్న ఇద్దరు మహాపురుషుల సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. 1939.5.12న పూణేలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో (ప్రతాప్‌గడ్) పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు పూజ్య డా. హెడ్గేవార్ లు కలుసుకున్నారు’ అని వ్రాసారు.
పుట 25లో `డా. బాబాసాహెబ్ అంబేద్కర్, డా. హెడ్గేవార్ (ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు) పుణెలోని భావుసాహెబ్ గడ్కరి ఇంట్లో కలుసుకున్నారు. మమ్మలందరిని (బాలాసాహెబ్ సాలుంకేతో పాటు) శ్రీ భావుసాహెబ్ అభ్యంకర్ (ఆర్ ఎస్ ఎస్) వేసవి శిబిరానికి తీసుకువెళ్లారు. అక్కడ డా. అంబేద్కర్ స్వయంసేవకులను ఉద్దేశించి సైనిక క్రమశిక్షణ, వ్యవస్థ గురించి ప్రసంగించారు’ అని వ్రాసారు.
హిందువులలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకోవాలనుకున్న వెలివాడ వంటి వెబ్ సైట్ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెట్టడానికి పై ఆధారాలు సరిపోతాయి. అయితే తమ బండారం బయటపడిపోయినందుకు ఇలాంటి `వెలివాడ’లు షెడ్యూల్ కులానికి చెందినవారు, స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అయిన శ్రీ బాలాసాహెబ్ సాలుంకే చెప్పినది కూడా అబద్ధమని ప్రచారం చేయవని ఆశిస్తాము.
– ఆయుష్ నడింపల్లి