Home News శిశు మందిర్ స్కూళ్ల‌పై వాఖ్యలకు దిగ్విజయ్ సింగ్‌ కు నోటీసు

శిశు మందిర్ స్కూళ్ల‌పై వాఖ్యలకు దిగ్విజయ్ సింగ్‌ కు నోటీసు

0
SHARE

ఆరెస్సెస్‌కు చెందిన స‌ర‌స్వ‌తీ శిశు మందిర్ స్కూళ్ల‌లో చిన్నారుల మ‌న‌స్సుల్లో మ‌త విద్వేషాన్ని రాజేస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జాతీయ బాల‌ల హక్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ (ఎన్‌సీపీసీఆర్‌) ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. ఆ పాఠశాలల విద్యార్థుల ఫిర్యాదుపై స్పందిస్తూ,  ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేపట్టి వారం రోజుల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ డీజీపీ వివేక్ జోహారిని  కోరింది. అయితే ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను వెల్లడింపవద్దని స్పష్టం చేసింది.

మీరు చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌ర‌స్వ‌తి శిశు మందిర్ స్కూళ్ల‌లో చ‌దివే విద్యార్ధులంద‌రి వ్య‌క్తిత్వం, గౌర‌వం దెబ్బ‌తింద‌ని, జువెనిల్ జ‌స్టిస్ చ‌ట్టం నియ‌మాల‌కూ ఇవి విరుద్ధంగా ఉన్నాయ‌ని దిగ్విజ‌య్ సింగ్‌కు ఇచ్చిన నోటీసుల్లో ఎన్‌సీపీసీఆర్ పేర్కొంది. మీరు చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ఎలాంటి స‌మాచారం ఉన్నా ఈ లేఖ అందిన మూడు రోజుల్లోగా క‌మిష‌న్‌కు అంద‌చేయాల‌ని ఎన్‌సీపీసీఆర్ అధ్యక్షురాలు ప్రియాంక్ క‌నుంగో కోరారు.

దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణ సార్వత్రిక స్వభావం కలిగి  ఉన్నాయని, అన్ని సరస్వతి శిశు మందిర్ పాఠశాలల విద్యార్థుల గౌరవాన్ని, స్వభావాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తుందని ఆమె మాజీ ముఖ్యమంత్రికి పంపిన నోటీసు లో పేర్కొన్నారు. ఇది జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 నిబంధనలతో పాటు ప్రాథమికంగా ఇది ఐపీసీ సెక్షన్లు 153A (బి) (బి), 504, 505 లను ఉల్లంఘిస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

కాగా ఆరెస్సెస్‌కు చెందిన స్కూళ్ల‌లో ఇత‌ర మ‌తాల ప‌ట్ల విద్వేషం నూరిపోస్తున్నార‌ని భోపాల్‌లో శ‌నివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో దిగ్విజ‌య్ సింగ్ ఆరోపించారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు ఆర్ఎస్ఎస్ విద్యా విభాగం విద్యాభారతి ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న పాఠశాలల గురించి సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విడి శర్మతో సహా బిజెపి సీనియర్ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు.

Courtesy : Nijam Today