Home News ద్రావిడోద్యమాన్ని మార్చిన జయ!

ద్రావిడోద్యమాన్ని మార్చిన జయ!

0
SHARE

ద్రావిడోద్యమ సిద్ధాంతాల ప్రభావంతో జయ ప్రజా జీవితం రూపొందలేదు. పైపెచ్చు ఆమె ఆ ఉద్యమ పరిణామాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేశారు. ఇదే ఆమె విశిష్ట రాజకీయ వారసత్వం.

‘జయలలిత తన ప్రజాజీవితంలో తుదివరకు ఒక పోరాటయోధురాలుగా ఉన్నారు’– పురచ్చి తలైవి (విప్లవ నాయిక)కి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నివాళి అది. పది రోజుల క్రితం జయ కీర్తిశేషురాలు అయినప్పుడు వెల్లువెత్తిన నివాళులలో రాష్ట్రపతి సంస్మరణే అత్యంత సముచితమైనది. ఎందుకంటే అది ఆ దివంగత నేత వ్యక్తిత్వాన్ని నిండుగా గౌరవించింది. ఎమ్‌.జి.రామచంద్రన్ (తమిళ ప్రజల అభిమాన నటుడు, నాయకుడు, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు, జయకు రాజకీయ మార్గదర్శకుడు) అంత్యక్రియల ఊరేగింపులో జయకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎమ్‌జీఆర్‌ భౌతికకాయాన్ని తీసుకు వెళుతున్న సైనిక శకటంపై నుంచి జయను తోసివేశారు అప్పటి అన్నడీఎంకే నాయకులు. ఈ ఘోర అవమానం జరిగిన కొన్ని నెలలకే అన్నాడీఎంకేకు జయలలిత తిరుగులేని నాయకురాలుగా ఆవిర్భవించారు. అదీ ఆమె పోరాట పటిమ. 1987 (ఎమ్‌జీఆర్‌ మరణించి సంవత్సరం) నుంచి 2016 వరకు జయ రాజకీయంగా ఎన్నో ఎగుడు దిగుళ్ళకు లోనయ్యారు. ఇదే కాలంలో ఆమె నాలుగుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజల గౌరవాదరాలను ఆమె ఎంతగానో పొందారు. జయను ‘అమ్మ’గా అసంఖ్యాక ప్రజలు ఆరాధించారు. తమిళ జనులే కాదు ఆమె ప్రత్యర్థులు, తమళేతర భారతీయులూ ఎంతో మంది జయను విశేషంగా అభిమానించారు.

జయలలిత చాలా అరుదైన రాజకీయ దృఢ వైఖరిని, నమ్రతను చూపారు. ఈ దేశంలో అత్యంత కరడుగట్టిన రాజకీయ నాయకులలో సైతం అటువంటి దృఢ స్వభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. కోట్లాది మందికి తల్లి ప్రేమను పంచిన అమ్మగా జయ చరిత్రలో నిలిచిపోయారు. తమిళ రాజకీయాల సైద్ధాంతిక సూత్రాలను ఆమె పునర్‌ నిర్వచించారు. తాను కోరుకున్న విధంగా ఆమె తన జీవితాన్ని జీవించారు.

ద్రావిడోద్యమం నుంచి ప్రభవించిన వారిలో జయలలిత ఒకరు. ఈ ఉద్యమం, స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్‌ పాలకుల ప్రయోజనాలతో తనకు తాను మమేకమై, సాంఘిక సంస్కరణల పేరిట హిందూ మత ఆచారాలు, సంప్రదాయాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే తీవ్రంగా హిందీ భాషా వ్యాప్తిని కూడా వ్యతిరేకించింది. ఉత్తర భారతావని ఆర్యులు దక్షిణ భారతావని ద్రావిడులపై ఉత్తర భారతావని ఆర్యుల పెత్తనాన్ని తిరస్కరించింది. హిందూ మత ఆచారాలు, హిందీ భాష ద్రావిడులపై ఆర్యుల ఆధిపత్యానికి చిహ్నాలని ద్రావిడోద్యమం ఎలుగెత్తింది. ద్రావిడోద్యమ వ్యవస్థాపకులు నిర్దేశించిన సిద్ధాంతాలను అనుసరించడానికి జయలలిత తిరస్కరించారు. తన మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆమె ఎప్పుడూ ఆ సిద్ధాంతాల ప్రభావంతో వ్యవహరించలేదు. అంతేకాదు, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న ఆ ఉద్యమ ప్రభావం నుంచి తమిళనాడును విడిపించి మళ్ళీ జాతీయ విలువల, సంప్రదాయాల పథంలోకి తీసుకువెళ్ళడంలో జయ విజయవంతమయ్యారు. తన బహిరంగ వ్యవహార శైలి, జీవితాచరణతో ద్రావిడోద్యమ నిర్దేశాలను ఆమె మార్చివేశారు. ఈ మౌలిక మార్పును ఆమె ఒక్కరే అనితరసాధ్యంగా సాధించారు.

తిరుపతికి సమీపంలో గల శ్రీకాళహస్తిలోని సుప్రసిద్ధ శివాలయాన్ని జయ తరచూ సందర్శిస్తూ రాహు, కేతు పూజలు నిర్వహించేవారు. తిరుమల ఆలయంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని, తిరుచానూర్‌లోని పద్మావతీ అమ్మవారిని కూడా జయ తరచూ దర్శించేవారు. బ్రాహ్మణుల పట్ల గుడ్డి ద్వేషం ద్రావిడోద్యమ ప్రారంభ స్వరం (సిగ్నేచర్‌ ట్యూన్‌). తమిళనాడు ప్రజా జీవితంలో ఈ సామాజిక వర్గం వారికి ఎటువంటి స్థానం లేకుండా చేయడమే ద్రావిడోద్యమ లక్ష్యం. అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబం నుంచి ప్రభవించిన జయలలిత తన సామాజిక మూలాల గురించి చాటుకోవడానికి ఆమె ఏనాడూ సంకోచించలేదు. ద్రావిడోద్యమ ప్రాథమిక లక్ష్యాలను ఆమె ధిక్కరించారు. ఈ స్వతంత్ర వైఖరి వల్ల ఆమె ప్రజా జీవితానికి నష్టం జరుగలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ఆరుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు.

జయలలిత అనర్గళంగా మాట్లాడగలిగిన భాషలలో హిందీ ఒకటి. దేశ రాజధానికి వెళ్ళినప్పుడు గానీ, చెన్నైను సందర్శించే ఉత్తరాది నాయకులతో గానీ హిందీలో సంభాషించడానికి ఆమె సంశయించేవారు కాదు. అయినప్పటికీ తాను తమిళ భాషీయురాలుగా, హిందూ మతస్థురాలుగా, దేశభక్తి ప్రపూరిత భారతీయురాలుగా ఉండడంలో ఎటువంటి వైరుధ్యాన్ని ఆమె చూడలేదు. తన ఆ మూడు అస్తిత్వాల విషయంలో జయ ఎంతగానో గర్వించేవారు. జయ దృఢ వ్యక్తిత్వం వల్లే మతపరమైన సంకుచిత రాజకీయాలను తమిళనాడు తిరస్కరించింది. విద్వేష రాజకీయ శక్తులు తలెత్తకండా చూడడంలో ఆమె సఫలమయ్యారు. అభివృద్ధి, సంక్షేమ సాధనకు అగ్రప్రాధాన్యమిచ్చే ఎజెండానే ఆమె స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ ఎజెండానే జయ చిత్తశుద్ధితో అమలుపరిచారు.

తమిళనాడు ప్రజా జీవితంపై జయలలిత ప్రభావం కారణంగా ఆమె ప్రధాన ప్రత్యర్థి డీఎంకే సైతం తన తీరుతెన్నులను మార్చుకోవడం తప్పనిసరైంది. జయ అనుసరించిన విధానాల కారణంగా మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో డీఎంకే ఇంకెంత మాత్రం తన పాత నినాదాలు, కార్యక్రమాలపై ఆధారపడలేకపోయింది. ద్రావిడోద్యమం పుట్టుక– పెరుగుదల క్రైస్తవ మత వ్యాప్తికి చర్చ్‌ అనుసరించిన పద్ధతులు, భారత్‌లో తమ పాలనను శాశ్వతంగా కొనసాగించుకొనేందుకై భారతీయులలో చీలికలు తీసుకురాడానికి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు అమలుపరచిన పథకాలతో పెనవేసుకొనిపోయి వున్నాయి. ఇంగ్లండ్‌లోని క్రైస్తవ మత పెద్దల నుంచి ఒత్తిడి ఫలితంగా 1813 నాటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికార పత్రంలో ఒక వివాదాస్పద నిబంధననొకదాన్ని చేర్చారు. భారత్‌లో బిషప్‌లు, అంతకు తక్కువ స్థాయి క్రైస్తవ మతాధికారుల నియామకానికి సంబంధించినది ఈ నిబంధన. ఆ తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం మత కార్యకలాపాల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. భారత్‌లో చర్చ్‌ కార్యకలాపాలకు ఆర్థిక మద్దతు సమకూర్చడానికి ఏటా భారీ బడ్జెట్‌ కేటాయింపులు చేసే సదుపాయాన్ని కల్పించింది.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో క్రైస్తవ మత విస్తరణకు తొలుత బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల వారిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఎంత ధనం వెచ్చించినప్పటికీ పూర్తిగా సంప్రదాయబద్ధులైన ఈ సామాజిక వర్గాన్ని మతాతంతరీకరణ చేయడంలో క్రైస్తవ మతాధికారులు విఫలమయ్యారు.ఇంతలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. తొలిరోజుల్లోనే దక్షిణాదిన బాగా వేళ్ళూనుకుంది. భారతీయ ‘మేధావి వర్గాల’లో క్రైస్తవ మత వ్యాప్తికి కాంగ్రెస్‌ పెద్ద అవరోధంగా ఉన్నదని మిషనరీలు భావించారు. దీంతో చర్చ్‌ తన వ్యూహాన్ని మార్చుకుంది. మారిన వ్యూహం ప్రకారం బ్రాహ్మణేతరులపై తన దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యంగా హిందూ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యావిషయకంగా వెనుకబడివున్న వర్గాల వారిని క్రైస్తవంలోకి మార్చడాన్ని చర్చ్‌ తన లక్ష్యంగా పెట్టుకున్నది.

‘సామాజిక న్యాయం’ అనేది చర్చ్‌ కొత్త నినాదమయింది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులను ప్రోత్సహించింది. 1917లో దక్షిణ భారతావని బ్రాహ్మణేతర ప్రముఖులు సౌత్‌ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌ జస్టిస్ పార్టీ నేర్పాటు చేశారు. భారతదేశంలో బ్రిటిష్‌ వారి పరిపాలన శాశ్వతంగా కొనసాగడమే జస్టిస్ పార్టీ అభిమతంగా ఉండేది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉందని, బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన అనంతరం బ్రాహ్మణుల పెత్తనం కొనసాగడమే కాంగ్రెస్‌ లక్ష్యమని జస్టిస్ పార్టీ విమర్శించేది.జస్టిస్‌ పార్టీ పుట్టుక, ప్రాభవాలలో బ్రిటిష్‌ పాలకుల, చర్చ్‌ పెద్దల ప్రభావం స్పష్టమే. 1944లో ఇ.వి.రామప్వామి (తొలుత కాంగ్రెస్ వాది అయిన రామస్వామి పెరియార్‌గా సుప్రసిద్ధుడు) జస్టిస్‌ పార్టీకి ద్రావిడార్‌ కజగమ్‌(డీకే)గా పునఃనామకరణం చేశారు. ఆ తరువాత ఐదేళ్ళకే ఈ పార్టీ చీలిపోయింది. చీలిక వర్గం 1949లో సి.ఎన్‌.అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డీఎంకే) నేర్పాటు చేసింది. 1972 అక్టోబర్‌లో ఎమ్‌.జి.రామచంద్రన్‌ డీఎంకే నుంచి బయటకువచ్చి అన్నా డీఎంకేను ఏర్పాటు చేశారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిన చరిత్రే.

1987లో ఎమ్‌జీఆర్‌ మరణించారు. జయలలితను తన వారసురాలుగా ఎమ్‌జీఆర్‌ ప్రకటించలేదు. అయితే ఆ తరువాత జరిగిన శాసనసభా ఎన్నికలలో ఎమ్‌జీఆర్‌ సతీమణి జానకి నాయకత్వంలోని అన్నడీఎంకే నాయకులు చిత్తుగా ఓడిపోగా జయలలిత విజయఢంకా మోగించారు. దీంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు జయ నాయకత్వాన్ని అంగీకరించారు. తదాది జయలలిత మరణించేవరకు అన్నా డీఎంకే ఆమెకు పొడిగింపుగా మనుగడ సాగించింది. జయలలిత కూడా తన రాజకీయ వారసుడు ఎవరో స్పష్టంగా ప్రకటించలేదు.1967లో తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. డీఎంకే అధికారానికి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళనాడులో కాంగ్రెస్‌తో సహా ఏ జాతీయ రాజకీయ పక్షమూ అధికారానికి రాలేదు. సరి గదా అధికారంలో వున్న ద్రావిడ పార్టీలతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామి కూడా కాలేకపోయాయి. కాంగ్రెస్ గానీ, భారతీయ జనతాపార్టీ గానీ కరుణానిధి (డీఎంకే అధినేత)కి గానీ లేదా జయలలితకు గానీ మిత్రపక్షంగా మాత్రమే ఉన్నాయి. అధికారంలో ఎప్పుడూ భాగస్వామి కాలేదు.సరే, జయలలిత ఇప్పుడు కాలంలోకి జారిపోయారు. మరి తమిళనాడులో భావి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి. వేచి చూడవల్సిందే. అయితే ఒక్క విషయం నిశ్చితంగా చెప్పవచ్చు. జయలలిత తన వ్యక్తిత్వం, నాయకత్వ పటిమతో రాష్ట్ర రాజకీయాలలో తీసుకువచ్చిన మౌలిక మార్పులను ఎవరూ వెనక్కి మరల్చలేరు. ద్రావిడోద్యమ సిద్ధాంతాల ప్రభావంతో జయ ప్రజాజీవితం రూపొందలేదు. పైపెచ్చు ఆమె ద్రావిడోద్యమ పరిణామాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేశారు. ఇదే ఆమె విశిష్ట రాజకీయ వారసత్వం.

-బల్బీర్ పుంజ్

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)