ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాలు లేని కాలంలో ‘దూరదర్శన్’ను మించిన టీవీ చానల్ లేదు. అప్పట్లో అందులో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్ మన ప్రసార మాధ్యమాల చరిత్రలో ఓ మైలురాయి. బిఆర్ చోప్రా నిర్మాతగా రవి చోప్రా దర్శకత్వంలో ప్రముఖ ఉర్దూ కవి రాహి మాసుమ్ రజా, పండిట్ నరేంద్రశర్మ ‘మహాభారత్’కు మాటలు రాశారు. దీని మొదటి ఎపిసోడ్‌ను లాంఛనంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి చూపించాలని ఆహ్వానించారు. మొదటి ఎపిసోడ్ కథ చాలా మహోదాత్తమైంది. మనకు మహా భారత వంశవృక్షం శంతనుడి దగ్గరి నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. రచయిత మసూమ్ రజా ముస్లిం అయినా భారతాన్ని కాస్త లోతుగా తరచి చూచాడు. వ్యాసభారతం మాత్రమే కాకుండా వివిధ పురాణాల్లోని మహాభారత అనుబంధ కథలను అధ్యయనం చేసి మొదటి ఎపిసోడ్ రూపొందించాడు. అది చాలా ఆసక్తికరమైన కథ. భరతుడు శకుంతలా దుశ్యంతుల పుత్రుడు. అతని వల్లనే భారతదేశానికి ఈ పేరు వచ్చిందని చెప్పే వాళ్లున్నారు. భరతుని చరిత్రను ఉటంకించిన ఈ ఎపిసోడ్‌లో ‘ఇదొక అలిఖిత పుట’ అని వ్యాఖ్యానంలో పేర్కొన్నారు.
భరతుడు చాలారోజులు పాలించాక ఓరోజు చింతాక్రాంతుడై తల్లిని సందర్శిస్తాడు. ‘నాయనా.. భరతా! నీవు ఎందుకు అలావున్నావు?’ అని ఆమె ప్రశ్నిస్తే ‘రాజ్యభారం’ గురించి నా మనసులో కలత మొదలైందని అంటాడు భరతుడు. అప్పడు శకుంతల ‘నీవు నా తండ్రి కణ్వ మహర్షిని సందర్శిస్తే నీ వ్యాకులత తీరుతుందని ఆమె చెప్తే భరతుడు కణ్వ మహర్షి దగ్గరకు వెడతాడు. ఆయనకు నమస్కరించి- ‘నా తదనంతరం రాజ్యభారం ఎవరికి? అనే చింత నిలువునా నన్ను దహించివేస్తోంది’ అంటాడు. దానికి కణ్వ మహర్షి ‘నాది.. నేను..’ అనే మమకారం వదిలేసి ఆలోచిస్తే నీకు తప్పక మార్గం దొరుకుతుందని ఆశీర్వదించి పంపిస్తాడు. భరతుడు బాగా ఆలోచించి ఓరోజు సభకు అందరినీ ఆహ్వానిస్తాడు. తన తర్వాత రాజ్యాభిషిక్తుడు ఎవరు కావాలనే దాన్ని ఓ పత్రంపై రాసిపెట్టి సీల్డ్ కవర్‌ను మంత్రి చేతికి ఇచ్చి చదవమంటాడు. దానిని మంత్రి చదవడం మొదలుపెడతాడు. ‘ఏ రాజైనా తన ప్రజల కన్నా సరిహద్దుల కన్నా గొప్పవాడు కాడు.. ప్రజల ఆశీర్వాదంతో హస్తినాపురం సామ్రాజ్యాన్ని విస్తరించాను. ఏ రాజుకైనా ప్రధాన కర్తవ్యాలు- దేశానికి, ప్రజలకు న్యాయం, రక్షణ కల్పించడం. న్యాయం, రక్షణ ఇచ్చేవాడే యువరాజు. నాకున్న తొమ్మిది మంది పుత్రుల్లో నేను ఇలాంటి లక్షణం చూడలేదు’ అనే వాక్యాలు చదువుతున్న మంత్రి గద్ధత స్వరంతో మిగతావి చదవలేకపోతాడు. మంత్రి రాజువైపు చూస్తాడు. భరతుడు మంత్రిని కొనసాగించమని సైగ చేస్తాడు. ‘నా కొడుకుల్లో ఎవరూ ఈ రాజ్యభారం వహించడానికి యోగ్యులు లేనందున ఈ రాజ్యంలోని పౌరుడైన భరద్వాజ్‌ను యువరాజుగా ప్రకటిస్తున్నా!’ అంటాడు. సభ నిశే్చష్టమవుతుంది. యోగ్యులు కాని వాళ్లను వంశపాలన పేరుతో రాజ్యంపై రుద్దడం ఇష్టం లేదని భరతుడు ప్రకటిస్తాడు. రాత్రికి తల్లి శకుంతల దగ్గరకు భరతుడు వెడితే ‘నీ పుత్రుని అధికారం వేరెవరికో ఎలా ఇస్తావు భరతా!’ అని నిలదీస్తే ‘అమ్మా..! నేను రాజును. ప్రజలే నా కుటుంబం. నా కడుపులో పుట్టినవాళ్లను రాజుగా ప్రకటిస్తే వాళ్ల అయోగ్యత వల్ల ప్రజలు అన్యాయమైపోతారు, రాజ్యం నాశనమవుతుంది. నా రాజ్యం అనే కుటుంబం నుండే నేను ఓ యోగ్యుడ్ని ఎన్నిక చేశాను’ అంటాడు. ‘్భరతుని రాజ్యంలో ఇదో ప్రజాస్వామ్య విధానం. శంతనుని తర్వాత ఇది నీరుగారి మళ్లీ భారతదేశంలో వంశపారంపర్య పాలన మొదలైంది’ అంటూ వ్యాఖ్యానించి ఆ ఎపిసోడ్ ముగిస్తారు. దీన్ని ఈరోజుకూ యూ ట్యూబ్‌లో వీక్షించవచ్చు. ఈ ఎపిసోడ్‌ను చూడగానే రాజీవ్‌గాంధీకి చిర్రెత్తింది. మధ్యలోనే లేచి బయటకి వెళ్లిపోయాడు. 31, అక్టోబర్ 1984 నాడు ఉదయం ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతిలో మరణిస్తే 9 గంటలు గడవకముందే సాయంత్రం 6.40 గంటలకు రాజకీయాల్లో ఓనమాలు తెలియని రాజీవ్‌ను ప్రధాని గద్దెపై ఎక్కించారు. ‘మహాభారత్’ మొదటి ఎపిసోడ్ రాజీవ్‌గాంధీ ‘ఇగో’ను దెబ్బతీసింది. అందుకే కోపంతో బయటకువెళ్లిపోయాడు.
కాశ్మీర్ నుండి ఢిల్లీకి వలస వచ్చిన నెహ్రూ పూర్వీకుల ఇంటిపేరు కౌల్. వాళ్ల మొదటి పూర్వీకుని పేరు రాజ్‌కౌల్. నెహర్ అంటే కాలువ అని అర్థం. కాశ్మీర్ నుండి తరలివచ్చిన ఆ కుటుంబం ఓ కాలువ పక్కన నివాసం ఏర్పాటు చేసుకున్నందుకు నెహర్ అనే పేరు కలిగి, అది కాస్త నెహ్రూగా మారింది. ఈ కుటుంబీకులు ఖేత్రీ రాజాస్థానంలో చేరి, మోతీలాల్ నెహ్రూ కాలంలో జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలోకి రాగానే సంపన్న కుటుంబం నుండి వచ్చన జవహర్‌లాల్ నెహ్రూ ఆయన దృష్టిలో పడ్డాడు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలంటే భారత్-పాక్ విభజన, నెహ్రూని ప్రధానిని చేయాలనే రెండు నిబంధనలు బ్రిటిష్‌వారు పెట్టారు. ఈ రెండు బ్రిటిష్ వాళ్ల కుట్రలు. వాటి పర్యవసానాలు ఈ రోజుకూ భారతదేశం చవి చూస్తూనే ఉంది. బ్రిటిష్ వారు మనకు స్వాతంత్య్రం ఇచ్చారనడం కన్నా అధికార మార్పిడి మాత్రమే చేసారు. స్వాతంత్య్రానంతరం ప్రధాని ఎవరు? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. తనను ప్రధానిని చేయకుంటే కాంగ్రెస్‌ను చీల్చేస్తానని నెహ్రూ గాంధీకి వర్తమానం పంపాడు. అంతకుముందే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని ఎవరికి మెజారిటీ వస్తే వారే ప్రధాని అని తీర్మానించింది. ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో దాదాపు 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను ప్రధానిగా చేయాలని చెప్పగా కేవలం ఒక ప్రదేశ్ కమిటీ మాత్రమే నెహ్రూ పేరును ప్రతిపాదించింది. నెహ్రూ ‘బ్లాక్‌మెయిలింగ్’కు గాంధీ లొంగిపోయి సర్దార్ పటేల్‌కు ఓలేఖ రాసినట్టు గాంధీ కార్యదర్శిగా పని చేసిన ప్యారేలాల్ రచించిన ‘పూర్ణాహుతి’ పుస్తకంలో ఉంది. ‘నీవు నిజంగా గాంధీ అనుచరుడవైతే ఈ ప్రతిపాదన నుండి వైదొలుగు’ అనేది ఆ లేఖ సారాంశం. సర్దార్ పటేల్ తప్పుకున్నాడు. నెహ్రూ గద్దెపైకి ఎక్కాడు.
గాంధీ మరణించగానే జవహర్‌లాల్ నెహ్రూకు ఎదురులేకుండాపోయింది. నెహ్రూ పరిష్కారం చేస్తానన్న సమస్య ‘కాశ్మీర్ కథ’ కంచికిపోగా, చైనా యుద్ధం, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మరణం ఇవన్నీ నెహ్రూ అసమర్ధతను చాటినా గాంధీపై ఆనాటి ప్రజలకున్న చెక్కుచెదరని అభిమానం నెహ్రూని గాంధీకి వారసుడన్న భ్రమలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈలోపు 1940ప్రాంతంలోనే లండన్‌లో చదువుతున్న నెహ్రూ కూతురు ఇందిరా ప్రియదర్శిని ఫెరోజ్ జహంగీర్ గాంధీ అనే ఫార్సీతో ప్రేమలో పడింది. రాజకీయ కారణాల వల్ల తన కుమార్తె ప్రేమ వివాహాన్ని నెహ్రూ అంగీకరించలేదు. భవిష్యత్తులో తన వారసత్వం అప్పగించడానికి ఇది అడ్డు అనుకున్నాడు నెహ్రూ. దీనికి విరగుడుగా ఆ ఫిరోజ్‌ఖాన్ ఇంగ్లండ్‌లో ఓ అఫిడవిట్ ద్వారా తన పేరు చివర గాంధీ అని తగిలించుకున్నాడని, గాంధీ తాను దత్తత స్వీకరించి నెహ్రూను సముదాయించాడని కొందరు చెప్తారు. అరవింద్ లావకరే అనే రచయిత సమాచారం ప్రకారం ఫెరోజ్ జహంగీర్ ఇంటిపేరు కూడా యాదృచ్ఛికంగా ‘గాంధీ’ అని ఉండడం, అది తదనంతరం నెహ్రూకు అతను అల్లుడు కాగానే ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబం అని పిలవబడిందని చెప్పారు.
భారతదేశంలో వారసత్వ రాజకీయాలకు ఇక్కడే బీజవాపనం జరిగింది. నెహ్రూ ప్రధాని అయ్యాక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇందిరకు స్థానం కల్పించాలని తహతహలాడాడు. గోవింద్ వల్లభ్ పంత్ లాంటి నాటి కాంగ్రెస్ పెద్దలు వారించినా నెహ్రూ వినకుండా 1958లో సెంట్రల్ పార్లమెంట్ బోర్డులో ఆమెకు స్థానం కల్పించాడు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ కోరినా ఫిరోజ్‌గాంధీ అనారోగ్యం దృష్ట్యా తనకు రాజకీయాలపై మక్కువ లేదని ఇందిర తండ్రికి రాసింది. 7 సెప్టెంబర్ 1960 నాడు భర్త మరణం తర్వాత ఇందిర తండ్రివైపు చూసింది. 1961లో గోవింద్ వల్లభ్ పంత్ మరణంతో కాంగ్రెస్‌లో ఆమె స్థానం స్థిరం అయింది. మంత్రి పదవులు ఉన్నవాళ్లకు పార్టీ పదవులు వద్దని పార్టీ రాజ్యాంగం సవరణ చేయించిన నెహ్రూ తన కూతురును పార్టీ సింహాసనం ఎక్కించడమే కాదు, మొరార్జీ దేశాయ్ వంటి ఆశావహుల ముందరి కాళ్లకు బంధం వేశాడు. 1964లో నెహ్రూ మరణంతో కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. అప్పటికే రామ్‌మనోహర్ లోహియా బహిరంగంగానే వంశపారంపర్య పాలనను వ్యతిరేకించాడు. లాల్‌బహదూర్ శాస్ర్తీ, కామరాజ్ నాడార్ ఇందిరను పదవి చేపట్టమని కోరినా ఆనాటి కాంగ్రెస్ పరిస్థితుల దృష్ట్యా వద్దన్నది. శాస్ర్తీ ప్రమాణం చేసి ఇందిరకు రాజ్యసభ సీటు ఇచ్చి ప్రసార శాఖ మంత్రి చేసారు. కానీ 21 నెలల కాలవ్యవధిలోనే తాష్కెంట్ చర్చలకు వెళ్లిన శాస్ర్తీ మరణించడం ఇందిరకు కలిసొచ్చింది. 11జనవరి 1966 ఉదయమే ఒక ఫోన్ కాల్ చేసి ఇందిర అధికారం హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత 11 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించింది. 1984లో ఇందిర మరణంతో ఆమె పెద్దకొడుకు రాజీవ్ ప్రధాని అయ్యాడు. తన రాజకీయ వారసుడిగా చిన్న కొడుకు సంజయ్ గాంధీకి స్థానం కల్పించాలనుకుంటే అతను విమాన ప్రమాదంలో మరణించాడు. అసలు ఎమర్జెన్సీనే సంజయ్ కోరిక మేరకు ఆమె విధించి అతన్ని ఓ రాజ్యాంగేతర శక్తిగా నిలబెట్టింది. రాజకీయ పరిణతి లేని రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం, ఆ తర్వాత సోనియా గాంధీ, ప్రస్తుతం రాహుల్ గాంధీ, ప్రియాంకలు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలకు అవశేషాలుగా కనిపిస్తున్నారు. కుటుంబ వారసత్వం లేకుండా కాంగ్రెస్ నుండి ప్రధాని పదవి అలంకరించినవారు గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్‌శాస్ర్తీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్ మాత్రమే. మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా కీలుబొమ్మగా వ్యవహరించాడనేది జగమెరిగిన సత్యం.
నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వం ఆదర్శంగా తీసుకుని ఈ డెబ్బై ఏళ్లలో దేశం నిండా వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఏదైనా ఉద్యమం రగిలితే గాని ‘కొత్త నాయకతరం’ పుట్టడం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇలాంటి వంశపాలన అనుభవిస్తునే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని మురిసిపోతున్నాం! కల్లోలంగా ఉన్న కాశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబం-ముఫ్తీ కుటుంబం మార్చి మార్చి అధికారం పంచుకుంటున్నాయి. పంజాబ్‌లో బాదల్ కుటుంబం, హర్యానాలో చౌతాలా కుటుంబం, మహారాష్టల్రో శరద్‌పవార్ కుటుంబం అధికారం అనుభవించగా, బాలాసాహెబ్ కుటుంబం మాత్రం అధికారానికి దూరంగా ఉంటూనే తమ ప్రాబల్యం నడిపించింది. బిహార్‌లో లాలుప్రసాద్ కుటుంబ పాలన ఆ రాష్ట్ర అభివృద్ధికి శాపంగా మారింది. 1996లో జరిగిన దాణా కుంభకోణం లాలును వెంటాడినప్పటికీ, కుటుంబ పాలన, కుల పాలన అతన్ని రక్షిస్తునే ఉంది. ఈ వారసత్వంలో భాగంగా లేశమాత్రం చదువుకున్న తన భార్య రబీదేవిని ముఖ్యమంత్రిని చేసాడు. తక్కువ చదువుకున్న కొడుకులను ప్రస్తుతం మంత్రులుగా చేసాడు. ఇక, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ నేతాశ్రీగా గుర్తింపు పొంది, కొడుకు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసాడు. అదే కుటుంబం నుండి రామ్‌గోపాల్, డింపుల్ లాంటి వారు సింపుల్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. కర్నాటకలో దేవగౌడ కుటుంబం జెడియు (ఎస్) పార్టీని కుటుంబం పార్టీగా మార్చి రాజ్యమేలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసి కొత్త నాయకులను పుట్టించినా, అనంతర కాలంలో అధికారం అల్లుడు చంద్రబాబు చేతిలోకి వెళ్లింది. తను కుమారుడైన లోకేశ్‌కు బాలకృష్ణ కూతురితో పెళ్లి చేసి రెండు కుటుంబాల వారసుడిగా లోకేశ్‌కు చంద్రబాబు మంత్రిపదవి ఇచ్చాడు. తెలంగాణలో కవిత, కేటిఆర్, హరీశ్‌లను ఉపనాయకులుగా ఉంచి, తెరాస అధినేత, సిఎం కేసిఆర్ నాయకుడిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా వారసత్వం విశేషమే. కేరళలో కరుణాకరన్ అనే కాంగ్రెస్ కురువృద్ధుడి నాయకత్వం కొనసాగుతోంది. తమిళనాడులో కరుణానిధి కుటుంబం వారసత్వ రాజకీయాలకు ప్రతీక. రాజా, కనిమొళి, దయానిధి మారన్, అళగిరి, స్టాలిన్ అనే కరుణానిధి వారసులు రాష్ట్రాన్ని అందినంత దోచుకున్నా అడిగేవారు లేరు. ఇంకో వందేళ్లయినా వాళ్ల వారసత్వం నుండి ఆ రాష్ట్రాన్ని ఎవరూ విముక్తి చేయలేరు. జయలలిత సమాధి ముందు పొర్లు దండాలు పెట్టిన అన్నాడిఎంకే నేతలంతా ఇవాళ అధికార వారసత్వం కోసం ఎలాంటి సర్కస్ ఫీట్లు చేస్తున్నారో దేశమంతా చూసి ముక్కున వేలేసుకుంది. మోనార్క్‌లా వ్యవహరించే మమతా బెనర్జీ వెనుక తన మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని ఎంపిని చేసి అనధికార అధికార కేంద్రంగా మార్చింది. రాజకీయాల్లో ఎంతో నిరంకుశంగా వుండే మాయావతి వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్నా తర్వాతి కాలంలో తన చిన్న తమ్ముడు ఆనంద్‌కుమార్‌ను బహుజన సమాజ్ పార్టీలో ‘నెంబర్ టూ’గా చేసింది. మత రాజకీయంలో ముస్లింలందరికీ తామే ప్రతినిధులమనే ఎంఐఎం కూడా కుటుంబ పార్టీగా హైదరాబాద్‌ను ఏలుతోంది. చివరకు కమ్యూనిస్టులు వారసత్వ రాజకీయాలకు దూరం అనుకుంటే బృందాకారత్, ప్రకాశ్ కారత్,ప్రణయ్‌రాయ్‌ల కుటుంబ సంబంధాలను రాజకీయ- మీడియా సంబంధాలుగా అభివర్ణించవచ్చు. భాజపా నాయకుల వారసులు అక్కడక్కడ రాజకీయాల్లో ఉన్నా- వారు పార్టీ సిద్ధాంతాలను శాసించే స్థితిలోలేరు.
ప్రజాస్వామ్యానికి వంశపాలన గొడ్డలిపెట్టు. అది వ్యక్తి ఆరాధనకు దారితీస్తుంది. అధికార వికేంద్రీకృతానికి దారి తీస్తుంది. లేకపోతే ఓ ప్రధాని ఇచ్చిన ఆదేశాన్ని ఏ పదవీలేని వంశపాలకుడు రాహుల్‌గాంధీ చించి బుట్టలో వేస్తాడా? ఈ పరిణామాన్ని సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్న మాటలతో ముగిద్దాం. ఓ ధనవంతుడు ప్రధాని కావచ్చని నెహ్రూ రుజువుచేస్తే, ఓ బీదవాడు ప్రధాని కావచ్చని శాస్ర్తీ నిరూపించాడు. వృద్ధుడు ప్రధాని కావచ్చని మొరార్జీదేశాయ్ నిరూపిస్తే, ఓ మహిళ ప్రధాని కావచ్చని ఇందిర నిరూపించింది. చదువురాని వాడు ప్రధాని కావచ్చని చరణ్‌సింగ్ నిరూపిస్తే, పండితుడు ప్రధాని కావచ్చని పి.వి నిరూపించాడు. ఓ అసమర్ధ పైలట్ ప్రధాని కావచ్చని రాజీవ్‌గాంధీ నిరూపిస్తే, ఓ కవి ప్రధాని కావచ్చని వాజపేయి నిరూపించాడు. ఎవరైనా ప్రధాని కావచ్చని దేవగౌడ రుజువు చేస్తే, టీ అమ్ముకునేవాడు ప్రధాని కావచ్చని మోదీ నిరూపించాడు. అసలు దేశానికి ప్రధానే అవసరం లేదని మన్మోహన్ సింగ్ నిరూపిస్తే ప్రధాని కాకుండానే దేశాన్ని పాలించవచ్చని సోనియాగాంధీ నిరూపించింది! ఇదే వంశపారంపర్య పాలన చరిత్ర మనకు నేర్పిన పాఠం. *
-డా. పి.భాస్కరయోగి సెల్: 99120 70125
(ఆంధ్రభూమి సౌజన్యం తో)