Home News ఏది మనువాదం?

ఏది మనువాదం?

0
SHARE

దళితవాదులు ఇతరులను మనువాదులుగా నిందిస్తూ ఉంటారు. మనువాదులు అంటే ఎవరో వారు స్పష్టంగా చెప్పకపోయినా కులానికి ప్రాధాన్యత యిచ్చేవారని, యోగ్యతకు కాకుండా జన్మకు ప్రాధాన్యం యిచ్చేవారిని బహుశా వారు మనువాదులుగా పేర్కొంటున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం అమలులో లేని కాలం చెల్లిన మనుస్మృతి గురించి వారు పదేపదే ప్రస్తావిస్తూ ఉంటారు. బీజేపీ వంటి రాజకీయ పక్షాలు మనువాదాన్ని నెత్తిన పెట్టుకొని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నది విమర్శ. ప్రస్తుతం అమలులో ఉన్నది ‘అంబేద్కర్ స్మృతి’ అని వారు తరచూ మర్చిపోతుంటారు. వృత్తి, ఉద్యోగాల్లోకి ప్రవేశానికి కనీస విద్యార్హతలు, యోగ్యతలను నిర్థారించి, అందుకు పోటీ పరీక్షలు పెట్టి, అందులో నెగ్గుకురావడం ఆధారంగానే ఉద్యోగాలు యిస్తున్నారన్న విషయమూ వారికి గుర్తుకురాదు. ఫలాన కులంవారు ఫలానా వృత్తి మాత్రమే చేయాలన్న నిబంధనలు, అలా చేయని పక్షంలో శిక్షలు, బహిష్కరణలు లేవన్న విషయం వారికి తెలిసి కూడా విస్మరిస్తూ ఉంటారు. నిత్యమూ గతించిన ఫ్యూడల్ వ్యవస్థలో ఒకప్పటి సామాజిక అన్యాయాలను పదేపదే తమ వాళ్లకు గుర్తు చేస్తూ, ఎప్పటికప్పుడు మానిన గాయాలను రేపుతూ ఉంటారు. హిందూత్వ భావజాలానికి మూలపురుషుడైన సావర్కర్ తన రచనల ద్వారా, చేతల ద్వారా కులవ్యవస్థను తీవ్రంగా నిరసించిన విషయమూ, సంస్కరణలకు స్వయంగా పూనుకున్న విషయమూ వీరు గుర్తించరు. 1930వ దశకంలోనే సావర్కర్ ఆనాటి హిందూ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. వేదోక్తబంది, వ్యవసాయ బంది, స్పర్శబంది, సింధు బంది, శుద్ధి బంది, రోటీ బంది, బేటీ బంది అనే ఏడు సంకెళ్లతో బందీ అయిన హిందూ సంఘాన్ని ఆ సంకెళ్ల నుండి విముక్తం చెయ్యాలని ఆయన గట్టిగా ఆకాంక్షించాడు.

వేదాలు అందరూ చదవకూడదన్న నిషేధం, కొన్ని వృత్తులు కొందరు చేయకూడదన్న నిషేధం సముద్రయానంపై ఉన్న నిషేధం, అంటరానితనం, కులాంతర భోజనాలపై ఉన్న నిషేధం, కులాంతర వివాహాలపై ఉన్న నిషేధం అనే ఏడు సంకెళ్లను తెంచుకొని సంఘం బయటకు రావాలని, అందుకు అందరం సమష్టిగా ఛాందసులపైన పోరాటం చెయ్యాలని సావర్కర్ పిలుపునిచ్చాడు. అంతకు మూడునాలుగు దశాబ్దాలకు ముందే స్వామి వివేకానంద అంటరానితనాన్ని, కులవివక్షను తీవ్రంగా నిరసించడమేగాక, అగ్ర కులాలవారు తమ అహంకారాన్ని తగ్గించుకొని నిమ్మ వర్గాలవారి అభ్యున్నతికి చేయూతనివ్వకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రగతిశీల సిద్ధాంతాలతో ప్రభావితులైన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంతో ముందుచూపుతో, రాజనీతిజ్ఞతతో వయోజన ఓటింగ్‌సహా ఎన్నో హక్కులను సామాన్యులకు వర్తింపచేయడానికి కారణం సమాజంలో హెచ్చుతగ్గులు రూపుమాపడానికేకదా!

ఇతర కులాలలోని అభ్యుదయగాములు చేసిన, చేస్తున్న కృషి దళితవాదులకు తెలిసినా దానిని వారు గుర్తించడం లేదు. తమపట్ల ఎవరికీ సానుభూతి లేదనట్లు, సంఘం అంతా తమను దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు. ఇతర కులాలలోని అభ్యుదయవాదులతో పనిచేయడానికి వారు ఎందుకు సంకోచిస్తున్నారు? రాజ్యాంగం కల్పించిన రక్షణలను అనుభవిస్తూనే ఇతరులను, హిందూ సంఘాన్ని పదేపదే ఎందుకు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంఘంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులుగానే ఆ సభలో కూర్చున్నారు. అంబేద్కర్ కూడా అలా ఎన్నికైనవారే. అంటే సంఘానికి ప్రతినిధులుగా ప్రగతిశీలమైన అనేక నిర్ణయాలు వారు తీసుకున్నారు. దురన్యాయాలను దృష్టిలో పెట్టుకొని కొత్త శకానికి నాంది పలికేందుకు అనేక చర్యలకు వారు శ్రీకారం చుట్టారు. ఇతరులను మనువాదులని విమర్శిస్తూనే వారు కులపరంగానే సంఘటితం అవుతూ పోరాటం చేస్తున్నారు. కులానికి వ్యతిరేకంగా కులాతీతంగా పోరాడకుండా కులపరంగానే సంఘటితం అవటం మనువాదాన్ని అంగీకరించడం కాదా? ఈ దేశంలో బీజేపీ వారు మాత్రమే హిందువులకు ప్రతినిధులు కాదు. బీజేపీని రాజకీయంగా ఎంతైనా ఎండగట్టండి. కానీ బీజేపీని విమర్శించడానికి హిందూ మతాన్ని, ధర్మాన్ని కించపరుస్తూ ఎందుకు మాట్లాడాలి? రాజకీయ విమర్శలు హద్దుదాటి మత విమర్శలుగా మారుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బీజేపీ వారిని నయా పీష్వాలుగా విమర్శిస్తున్నారు.

మరాఠా యుద్ధాలు బ్రిటిషువారు తమ ఆధిపత్యం సుస్థిరం చేసుకునేందుకు చేసినవి. కోరేగావ్ దగ్గఱ జరిగిన యుద్ధానికి షాహు మహారాజు పక్షాన ప్రధానమంత్రి హోదాలో బాజీరావ పీష్వా నాయకత్వం వహించాడు. అది ఆయన సొంత సైన్యం కాదు. అందులో బ్రాహ్మణ సైనికులు ప్రాతినిధ్యం నామమాత్రం. మహారాజు సైనికులలో మరాఠాలతోపాటు, మహర్లు, ఇతర కులాలకు చెందినవారు ఉన్నారు. మహారాజు సైన్యంలో అసలు మహర్లే లేరు అనడం సత్యదూరం. వాస్తవానికి ఆంగ్లేయుల పక్షాన పోరాడిన మహర్లకంటె షాహు మహారాజు పక్షాన పోరాడిన మహర్ల సంఖ్య ఎక్కువే. ఆ యుద్ధం కులయుద్ధం కాదు. కుల ఆధిపత్యాల కోసం జరిగిన యుద్ధం కాదు. బ్రాహ్మణులకు, మహర్లకు మధ్య జరిగిన యుద్ధం అసలే కాదు. బ్రిటీషువారు మనగడ్డమీద మనవాళ్లతో సాగించిన యుద్ధమది. దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో చనిపోయింది భారతీయులే. ఎవరిపక్షాన ఎవరు గెలిచినా ఓడింది మనమే. మహర్ సైనికుల ధైర్యసాహసాలను గుర్తుకు తెచ్చుకొని, స్ఫూర్తి పొందాలనుకుంటే అందుకు అనేక యితర సంఘటనలను ఉన్నాయి. ఇతర చారిత్రక సందర్భాలు ఉన్నాయి. శివాజీ మహారాజు కాలంలోను, శంభూజీ సైన్యంలోనూ మహర్ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, పొందిన గౌరవ మర్యాదల నుండి స్ఫూర్తి పొందవచ్చు. శంభూజీ మహారాజును ముక్కముక్కలుగా నరికి భీమా నదిలో పడవేస్తే గోవిందుడనే మహర్ ఔరంగజేబు ఆదేశాలను ధిక్కరించి శరీర అవశేషాలను సేకరించి శంభూజీకి అంతిమ సంస్కారం చేసిన చారిత్రక ఘట్టం నుండి స్ఫూర్తి పొందవచ్చు.

మనం గెలిచిన యుద్ధాల నుండి స్ఫూర్తి పొందాలేగాని, ఒకానొక సంధి కాలంలో శత్రుపక్షాన పోరాడి, భారతీయులను పరాజితులను చేసి, ఆంగ్లేయుల వలస పానలకు కారణభూతమైన ఒకానొక యుద్ధాన్ని కులయుద్ధంగా వక్రీకరించి స్ఫూర్తి పొందే ప్రయత్నం చరిత్రనే కాదు, వర్తమానాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. స్వాతంత్య్ర అనంతరం మన సైన్యంలోని మహర్, డోగ్రా రెజిమెంట్లు తాము సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను కొన్నాళ్లు జరుపుకున్నారు. బ్రిటీషు వారి సైన్యంలో భాగంగా సాగించిన విజయాలను స్మరించుకోవడంలోని అనౌచిత్యాన్ని గుర్తించి ఆ పద్ధతికి ముగింపు పలికారు. సమాజంలో బ్రాహ్మణాధిక్యత ఏనాడో అంతరించింది. మనుస్మృతి బ్రాహ్మణాధికత్యతను గురించిచెబితే, అందుకు భిన్నంగా ఇప్పుడు అన్ని రంగాలలోనూ బ్రాహ్మణేతరుల ఆధిక్యతే ప్రస్ఫుటంగా కన్పడుతుంది. శ్రామిక కులాలకు చెందినవారు అభివృద్ధి చెందడం స్వాగతించదగ్గ పరిణామం. వీటన్నిటిని గమనిస్తూ కూడా, బ్రాహ్మణాధిక్యత గురించి పదేపదే మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఏ వర్గాల ప్రజలకు ఉంటుందో వారి చేతుల్లోకి అధికారం వస్తుంది. ‘మనువాదులు’ కాని, మరే ఇతర వాదులు కానీ దీనిని తిరగ వ్రాయలేరు.

అధికారం, సంపద ఉన్నవారికే ఈనాడు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. కులాన్నిబట్టి చిన్నచూపు చూసే రోజులూ పొయ్యాయి. అధికారం, డబ్బుకోసం అన్ని వర్గాలవారు అర్రులు జాస్తున్నారు. కులరాజకీయాలు, కుల విభజనలు, కుల సమీకరణలు అందులో భాగమే. రాజకీయాలు లేకుండే కులపిచ్చి ఇంతగా పెరిగేది కాదు. రాజకీయాధికారం కోసం కులాన్ని రెచ్చగొడితే, ఇతరులూ అదే పనిచేయగలరన్న విషయాన్ని ప్రతి కులం వారు విస్మరిస్తున్నారు. కుల సమీకరణలు, వాదనలు వలన వైషమ్యాలు పెరిగి, దేనికైతే వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని ప్రతివారు చెబుతున్నారో, అదే కులవాదం – మనువాదం స్థిరపడుతున్నది. అందరూ తమకు తెలియకుండానే మనువాదులుగా మారిపోతున్నారు. దళితవాదులు అందుకు మినహాయింపు ఏమీ కాదు.

-డా.సారంగపాణి

(ఆంధ్రభూమి సౌజన్యం తో)