Home Telugu Articles ఈ న్యాయ పోరాటం హిందువుల చారిత్రక కర్తవ్యం

ఈ న్యాయ పోరాటం హిందువుల చారిత్రక కర్తవ్యం

0
SHARE

భారతదేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సర్వ సాధారణంగా అంతా అభిప్రాయ పడేదేమిటంటే- భారతదేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు. కానీ మారిన కాలంలో ఈ సంఖ్యలు, సమీకరణలు బ్రిటిష్‌ కాలం మాదిరిగా లేవు. ఉండవు. భారతదేశమంతటా హిందువులే అధిక సంఖ్యాకులని ఇప్పుడు చెప్పరాదు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలోని ఏడు రాష్ట్రాలతో పాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోను సంఖ్యాపరంగా హిందువులు మైనారిటీలు. కానీ మైనారిటీలుగా ఉన్నప్పటికీ వారికి ఆ గుర్తింపు లేదా హోదా దక్కడం లేదు. కొన్నిచోట్ల హిందుయేతరులు 98 శాతం ఉన్నప్పటికీ, హిందువులు మూడు శాతం, నాలుగు శాతం మాత్రమే ఉన్నప్పటికీ అక్కడ హిందువులనే అధిక సంఖ్యాకులుగా పరిగణిస్తున్నారు. అంటే ఆ మూడు నాలుగు శాతం హిందువులే మెజారిటీ వర్గీయులు. దీనిలోని హేతుబద్ధతని ప్రశ్నించవద్దా? కొంచెం ఆలస్యంగానే అయినా ఈ అంశం మీద న్యాయపోరాటం మొదలయింది. హిందువులకు సంబంధించి ఇదొక చారిత్రక అవసరం ఉన్న పోరాటమిది.

మైనారిటీ హోదాకు ఎవరు అర్హులు? అంటే, అల్ప సంఖ్యాకులు ఎవరు? దీనికి రాజ్యాంగంలో సరైన నిర్వచనం లేదని చెబుతారు. కానీ దేశమంతా మైనారిటీ రాజకీయాలు నడుస్తున్నాయి. మైనారిటీ లను బుజ్జగించే పనిలోనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ అంశంతోనే మనుగడ సాగిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలు ఆ అంశాన్ని అడ్డం పెట్టుకునే దేశాన్ని ఏలాయి. మైనారిటీలంటే ఇంతవరకు అమలులో ఉన్న అర్థం- ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు. వీరు హిందువుల కంటే జనాభా పరంగా తక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీ ¬దా కల్పించారు. కానీ రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశంలో ఉన్న సామాజిక సమీకరణలు ఇప్పుడు లేవు. ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్‌, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడానికి మైనారిటీలను ఉపయోగించుకుంటున్నాయి. ఈ సంగతి ముస్లింలు కూడా బాహాటంగానే ప్రకటిస్తారు. మారిపోయిన సమీకరణల నేపథ్యంలో, ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా చాలా చోట్ల హిందువులు ఇప్పుడు మైనారిటీలు. అయినా 1950 నాటి చట్టం ప్రకారమే ఇప్పుడు కూడా మెజారిటీలుగానే పరిగణిస్తున్నారు. కానీ ఒక రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఇతర మతాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇంకా చెప్పాలంటే హిందూ జనాభాను ఎంతో అధిగమించినప్పటికీ వారు మైనారిటీలే. మైనారిటీ హోదాతో వచ్చే అన్ని సదుపాయాలకు అర్హులే. కానీ జాతీయ విధానాన్ని బట్టి హిందువులు ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మెజారిటీలే. వారికి ఏ హక్కులూ ఉండవు. ఈ అసమ న్యాయం గురించి ప్రశ్నలు లేవనెత్తడంలో ఇప్పటికే ఆలస్యమైంది. ఈ అసమ విధానం మీద హిందువు లలో, హిందువుల తరఫున మాట్లాడే మేధావులలో అసమ్మతి లేకపోలేదు. అందుకే కొంచెం ఆలస్యంగా అయినా దీనిని ప్రశ్నించడానికి నేడు సిద్ధమయ్యారు.

తాము తక్కువ సంఖ్యలో ఉన్నచోట హిందు వులు మైనారిటీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను పొందలేరా? తక్కువ సంఖ్యలో ఉన్నచోట జాతీయ స్థాయి విధానం ప్రకారం కాకుండా ఆ ప్రాంత సమీకరణలను బట్టి హిందువులు మైనారిటీ హోదాకు అర్హులు కారా? ఈ అంశాన్ని పరిశీలించవలసిందని భారత అత్యున్నత స్థానం ఫిబ్రవరి 11వ తేదీన మైనారిటీల కమిషన్‌ను ఆదేశించింది. ఈ సంగతి గురించి మూడు మాసాలలో తేల్చవలసిందని కూడా సుప్రీం కోర్టు కోరింది. నిజానికి మైనారిటీల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఈ విధంగా కోరడం ఇది రెండోసారి.

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రాంత నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు హిందువులు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో వారిని మైనారిటీలుగా గుర్తించేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించ వలసిందని సుప్రీంకోర్టు మైనారిటీల కమిషన్‌ను ఆదేశించింది. అశ్వినీకుమార్‌ నవంబర్‌ 17, 2017న మొదటిసారి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మతాల వారీగా చూస్తే కొన్ని రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలుగా మిగిలిపోయారు, అక్కడ హిందుయేతరుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఈహిందువులకు మైనారిటీ ¬దా, దానితో వచ్చే సౌకర్యాల కల్పన అంశాలను పరిశీలించాలని పిటిషన్‌లో కోరారు. ఈ అంశం మీద మొదట ఒక నిర్ణయం తీసుకోవలసినది మైనారిటీల కమిషన్‌ కాబట్టి, ఆ కమిషన్‌కు నివేదించినట్టు ఈ పిటిషన్‌పై ఏర్పాటు చేసిన ధర్మాసనం తెలియచేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులు. ఈ విషయం మైనారిటీల కమిషన్‌ పరిధిలోనిది కాబట్టి, వారికి నివేదించమని సుప్రీం కోర్టు అశ్వినీకుమార్‌కు మొదటే సూచించింది. ఆ మేరకు ఆయన కమిషన్‌కు నివేదించినప్పటికీ సమాధానం మాత్రం రాలేదు. తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మొదటిసారి మే 25, 2018న మైనారిటీల కమిషన్‌ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బృందం తన తాత్కాలిక నివేదికను ఇచ్చింది. ఈ బృందానికి కమిషన్‌ ఉపాధ్యక్షుడు జార్జ్‌ కురియన్‌ నాయకుడు. తరువాత తన వాదనను పూర్తిగా వినిపించేందుకు ఆ సంవత్సరం జూన్‌ 14న ఏర్పాటు చేసిన సమావే శానికి రావలసిందిగా కూడా అశ్వనీ కుమార్‌ను కమిషన్‌ కోరింది. రాజ్యాంగ పరిమితులను బట్టి జాతీయ స్థాయిలో హిందువులకు మైనారిటీ హోదా కల్పించడం సాధ్యం కాదు అని కమిషన్‌ తన తాత్కాలిక నివేదికలో తేల్చి చెప్పింది. ఇలాంటి హోదా రాజ్యాంగ ప్రకారం ఆరు వర్గాలకే పరిమితం. వారే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు. రాజ్యాంగం ఈ వర్గాలకే ఆ హోదా కల్పిస్తున్నది కాబట్టి ఈ విధానాన్ని మార్చడం, అంటే కొత్తవారిని చేర్చడం సాధ్యం కాదని కమిషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ మయోరుల్‌ హసన్‌ రిజ్వి చెప్పారు. కానీ రాష్ట్రాలు వాటి వాటి పరిధిలో మైనారిటీ వర్గీకరణ చేయవచ్చునని కూడా ఆయన స్పష్టం చేశారు.

2011 లెక్కల ప్రకారం అశ్వినీకుమార్‌ పేర్కొన్న ఆ ఎనిమిది ప్రాంతాలలో(ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం) హిందువుల జనాభా ఇలా ఉంది. లక్షద్వీప్‌-2.5 శాతం, మిజోరం -2.75 శాతం, నాగాలాండ్‌ – 8.75 శాతం, మేఘాలయ-11.53 శాతం, జమ్ముకశ్మీర్‌ -28.44 శాతం, అరుణాచల్‌ ప్రదేశ్‌ 29 శాతం, మణిపూర్‌ 31.39 శాతం, పంజాబ్‌ – 38.40 శాతం.భారతదేశంలో కూడా హిందువులు కొన్నిచోట్ల మైనారిటీలుగా మారడానికి ఇస్లాం, అందులోని ఐదు సూత్రాలు కారణమని అశ్వినీకుమార్‌ వాదన. ఆ ఐదింటిలో మూడో సూత్రం ప్రకారం ఒక డ్రైవర్‌ కూడా తన వార్షికాదా యంలో రెండుశాతం ఇస్లాం మత వ్యాప్తికి విరాళంగా ఇస్తాడు. ఇలాంటి ధోరణితోనే 1400 సంవత్స రాలలో 62 దేశాలలో ముస్లింలు అధిక సంఖ్యాకు లుగా అవతరించారని అశ్వినీకుమార్‌ వాదిస్తున్నారు.

నిజానికి ఇప్పుడు అశ్వినీకుమార్‌ పేర్కొన్న ప్రదేశాలలోని హిందువులకు మైనారిటీ హోదా ఇచ్చే విషయం పరిశీలించాలని 1996-99 మధ్య మైనారిటీల కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసిన ప్రముఖ న్యాయ నిపుణుడు ఆచార్య తాహిర్‌ మహమ్మూద్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన 2007-2009 మధ్య లా కమిషన్‌ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన ప్రతిపాదనకు సమాధానం అన్నట్టు ఆ సమయంలోనే ఆర్య సమాజ్‌ ప్రముఖుడు స్వామి అగ్నివేశ్‌ చిత్రమైన వాదన లేవదీశారు. ఆచార్య తాహిర్‌ లేవదీసిన అంశం సూత్రబద్ధంగా సబబే అయినా, మైనారిటీలకు హక్కులు కల్పించడంలోని ఉద్దేశం వేరని అగ్నివేశ్‌ ఒక వ్యాసం రాశారు. మైనారిటీ హోదా అనేది దేశ సమగ్రతను కాపాడడానికే కల్పించారని ఆయన వాదన. ఆచార్య తాహిర్‌ ఉద్దేశం మంచిదే అయినా, సదుద్దేశం ఒక్కటే ఇలాంటి అంశం మీద కీలక నిర్ణయం తీసుకోవ డానికి చాలదని, చరిత్రను కూడా అధ్యయనం చేయాలని అగ్నివేశ్‌ సుద్దులు పలికారు. నిజంగానే చరిత్రను చూసినవారు, అర్థం చేసుకున్నవారు, దురుద్దేశాలు లేకుండా అధ్యయనం చేసినవారు ఇలా వాదించగలరా? చరిత్ర దాకా అవసరం లేదు. వర్తమాన దృశ్యం ఎలా ఉంది? అదే హోదాను అడ్డు పెట్టుకుని కొంత మంది ముస్లింలు పెడవాదనలు చేస్తున్నారు. ఇది నిజం కాదా! ఇందుకు స్వయం ప్రకటిత మేధావులు వంత పాడుతున్నారు. మైనారిటీ హోదాతోనే విభజన వాదనకు మళ్లీ ఊపిరి పోయాలన్న దురుద్దేశాలను కూడా మతోన్మాదంతో పెట్రేగిపోతున్న కొందరు మైనారిటీలు చేస్తున్నారు. ఈశాన్య భారతంలో పోకడలు దేని ప్రాతిపదికగా సాగుతున్నాయి? అక్కడ క్రైస్తవం పెరగడానికి దోహదం చేసిన వాస్తవాలు ఏమిటి? కశ్మీర్‌లోయ నుంచి పండిట్లు ప్రాణాలు చేత పట్టుకుని రావడం వెనుక వాస్తవాలు ఏవి? ఇవన్నీ అగ్నివేశ్‌ వంటివారికి తెలియదా?

ప్రపంచంలోని సనాతన ధర్మానికి ఒక దేశం లేకపోవడం శోచనీయమని అశ్వినీకుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అసలు మైనారిటీ హోదా కల్పన అనేది రాష్ట్రం నిర్ణయించాలని కూడా ఆయన అభిప్రాయం. 1993లో కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారమే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదా పొందారని, 2014లో జైనులను ఈ జాబితాలో చేర్చారని అశ్వినీకుమార్‌ గుర్తు చేశారు. లక్షద్వీప్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులు. అక్కడ వారి జనాభా 96.20 శాతం. జమ్మూకశ్మీర్‌లో ముస్లింలు 68.30 శాతం ఉన్నారు. అస్సాంలో కూడా గణనీయంగా 34.20 శాతం ముస్లింలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 27.5 శాతం, కేరళలో 26.60 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 19.30 శాతం, బిహార్‌లో 18 శాతం ముస్లింలు ఉన్నారు. అయినప్పటికీ వీరంతా మైనారిటీ ¬దా, దానితో వచ్చే సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఇంకా తక్కువ శాతంగా ఉన్నప్పటికీ హిందువులు కొన్ని రాష్ట్రాలలో మెజారిటీలుగా మిగిలి, ఎలాంటి అవకాశాలు పొందలేకపోతున్నారు.

లక్షద్వీప్‌లో హిందువులు మూడుశాతం లోపే ఉన్నారు. అక్కడ వారిని మెజారిటీలుగానే పరిగణిస్తున్నారు. దాదాపు 98 శాతంగా ఉన్నప్పటికీ ముస్లింలు మైనారిటీలే. ఇది అన్యాయమని ఎవరికీ అనిపించడం లేదు.

నిజానికి ముస్లింలకీ, క్రైస్తవులకూ మాత్రమే మైనారిటీ హోదా ఇవ్వాలనీ, జనాభా పరంగా హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారిని మైనారిటీ హోదాకు దూరంగానే ఉంచాలనీ రాజ్యాం గంలో ఉన్నదా? లేదనే నిపుణులు చెబుతున్నారు. మన రాజ్యాంగంలో 29, 30వ అధికరణాలలో మొత్తం నాలుగు పర్యాయాలే’ మైనారిటి’ అనే మాటను ప్రస్తావించడం కనిపిస్తుంది. అయినా ఈ మాటకు స్పష్టమైన నిర్వచనం మాత్రం లేదు. రాజ్యాంగ నిర్మాణ సంఘానికి ప్రాథమిక హక్కులకు సంబంధించి నియమించిన ఉపసంఘం ఆనాడు ఒక ముసాయిదాను సమర్పించింది. అందులో 30వ అధికరణం ప్రస్తావన లేదు. ఇక 29వ అధికరణం గురించి.. కేఎం మున్షీ పట్టు మేరకు ఇది చేరింది. అందులో ఉన్న మైనారిటీ అన్న పదాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ తొలగించి, దానిలో ప్రస్తావించిన హక్కులను అన్ని వర్గాల పౌరులకు వర్తించేటట్టు మార్చారు. పాఠాన్ని సరిదిద్దిన తరువాత కూడా 29వ అధికరణం హెడ్‌నోట్లో మైనారిటీ అనే పదం పొరపాటుగా ఉండిపోయిన విషయం కూడా చరిత్ర. విద్యా సంస్థలను నిర్వహించుకునేందుకు, ప్రభుత్వం నుంచి నిధులు స్వీకరించడానికి 30వ అధికరణం ద్వారా మైనారిటీలకు హక్కు వచ్చింది. కానీ ఈ హక్కు హిందువులకు వర్తించదని మాత్రం రాయలేదు. ‘ఒక భాష మాట్లాడే హిందువులు వేరే భాష మాట్లాడే ప్రాంతానికి వలసపోతే కొత్తచోట వారు భాషా పరమైన మైనారిటీ గుర్తింపు పొందుతారు. మరి జాతీయ స్థాయిలో మెజారిటీ అయిన హిందువులు తమ రాష్ట్రంలోనే అల్పసంఖ్యాకులైతే? మైనారిటీల నిర్ధారణకు రాష్ట్రాల ప్రాతిపదిక అన్న సూత్రాన్ని బట్టి ఆ రాష్ట్రంలో వారు మైనారిటీలు అనాలి కదా?’ అని ప్రశ్నించారు (పెక్యులరిజం, పే.113) ప్రముఖ పత్రికా రచయిత ఎంవిఆర్‌ శాస్త్రి.

మైనారిటీల భావన బ్రిటిష్‌ పాలన నుంచి స్వతంత్ర భారతదేశానికి సంక్రమించిన పెద్ద సమస్య. ఆంగ్లేయులు హిందూ ముస్లిం విభజన తెచ్చి పబ్బం గడుపుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు ముస్లింలను బుజ్జగించడం ఒక అవసరమని భ్రమపడ్డారు. ఇందులో గాంధీజీ సహా ప్రముఖులందరికీ పాత్ర ఉంది. ఈ అన్ని అంశాలు దేశ విభజనకు దారి తీశాయి. స్వతంత్ర భారత దేశంలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కేంద్రంలో, రాష్ట్రాలలో ముస్లింను బుజ్జగించి యాభయ్ఏళ్లు పబ్బం గడుపుకున్నాయి. హిందువులకు ఇలాంటి దుర్గతి పట్టించాయి. దీనిని మార్చవలసిన సమయం వచ్చింది. మైనారిటీ అన్న పదాన్ని వర్తమాన కాలానికి అనుగుణంగా, చరిత్ర ఆధారంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగకుండా ఇప్పటికైనా నిర్వచించు కోవడం అవసరం. ఈ పనిని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు చేయకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్టు ఆ కాలం వేరు. నాటి భారత ప్రజావళి దృష్టి వేరు. ఇప్పుడు ఆ అవసరం తోసుకు వచ్చింది. ప్రాంతాలను బట్టి తమకు కూడా మైనారిటీ హోదా కల్పించా లంటూ హిందువులు ఆరంభించిన ఈ న్యాయ పోరాటం ఈ కారణంగానే చరిత్రాత్మకమైనది.

Source: Jagriti Weekly