ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు మరోసారి చుక్కెదురైంది. తీవ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పేరుపడిన ఆ దేశం ఇతర దేశాలపై కూడా అటువంటి ముద్ర వేయడం ద్వారా తనపై పడ్డ మచ్చను తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆఫ్గనిస్తాన్ లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ ఇంజనీర్లను తీవ్రవాదులుగా ప్రకటించాలంటూ పాకిస్థాన్ భద్రతామండలికి ఫిర్యాదు చేసింది. 1267 తీర్మానం ప్రకారం ఇద్దరు భారతీయులు అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తిరస్కరించడంతో పాకిస్థాన్ పరువు మరోసారి పోయింది. ఈ సమాచారాన్ని యూ ఎన్ భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
చైనా మద్దతుతో పాకిస్థాన్ చేస్తున్న ఈ కుట్ర ను ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సభ్య దేశాలైన యూకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, అమెరికా అడ్డుకున్నాయి.
ఐరాస 1267 ఆంక్షల జాబితా కింద 2019లో నలుగురు భారతీయ పౌరుల హోదాను పాకిస్తాన్ ప్రతిపాదించింది. వీటిలో రెండింటిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంతకుముందే తిరస్కరించింది. అంగార అప్పాజీ, గోవిందా పట్నాయక్ దుగ్గివాలాసా అనే మరో ఇద్దరి పేర్లను ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రతిపాదనను భద్రతామండలి తిరస్కరించింది.
అంతకుముందు ఫ్రాన్స్, ఇతర సభ్యదేశాలు తన వాదనలను సమర్థించడానికి పాకిస్తాన్ కు అవకాశం ఇచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పాక్ కి నిరాశే మిగిలింది.
గతేడాది మే 1న జైష్ – ఎ – మహ్మద్ అనే తీవ్రవాద సంస్థ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఈ కుట్రకు తెర లేపుతోంది.
భద్రతామండలి సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మూనీర్ అక్రమ్ తన మోసపూరితమైన ప్రసంగం చేసిన వారం రోజులకే భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశం ఇబ్బందుల పాలైంది..