-రత్న లక్ష్మీ నారాయణ రెడ్డి
ఫిబ్రవరి -21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. ఇది ప్రభుత్వానికి మాతృభాష మీది మమకారాన్ని తెలుపుతుంది. ఇది సంతోషించాల్సిన విషయమే. శిశువు ఎదుగుదలకు మాతృభాష ఎంతో తోడ్పడుతుంది. ప్రాథమిక స్థాయిలో తప్పకుండా మాతృభాషలోనే విద్యను అందించాలని భారత జాతీయ విద్యా విధానం 2021 స్పష్టంగా చెబుతోంది. ఇదే విషయాన్ని ఎందరో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఇంతకు ముందు వేసిన కమీషన్లు కూడా చెప్పినాయి.. ప్రపంచమంతటా ఆరవ తరగతి నుండి మాత్రమే విద్యార్థికి ఇతర భాషలను బోధించాలని చెప్పుతున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వానికి భిన్నంగా పోవాలనుకొంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు “వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని స్థాయిలలో” మన ఊరు- మన బడి “ పథకం ద్వారా ఆంగ్ల బోధన జరుగుతుందని దాదాపు మన మాతృభాష అయిన తెలుగు ఉండదని, తెలుగు కేవలం ఒక భాషగా మాత్రమే విద్యార్థి నేర్చుకొంటాడని, విద్యార్థులను సాఫ్ట్ వేర్ కొలువులకు తయారు చేయాలని “ చెప్పుతున్నారు. అలాగే తెలుగు మీడియం కూడా ఐచ్ఛికంగా ఉంటుందని, ఎవరైనా విద్యార్థి తెలుగులోనే చదువుతానని అంటే ఒక్క విద్యార్థి కోసమైనా తెలుగు మీడియం నడిపిస్తామని ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తున్నారు. ఇది విద్యార్థికి ,వారి తల్లిదండ్రులకు ఐచ్ఛికమే కావచ్చు గాని సకల రుచులతో అన్ని రకాల పదార్థాలు ఇంగ్లీష్ మీడియంలో కొసిరి కొసిరి వడ్డించడానికి ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంటే, అదే బంతిలో కూర్చున్న తెలుగు మీడియం విద్యార్థి అసలు తనకు కావలసిన పదార్థం ఉన్నదో లేదో తెలియని ఓ ఒంటరి పక్షి. నాకు తెలుగు మీడియమే కావాలని ధైర్యంగా అడుగగలడా ? అన్నది వంద డాలర్ల ప్రశ్న? ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధన వీలవుతుందా ? ఇది అమలు పరచడానికి ఎదురైయ్యే సాధక బాధకాలేమిటి? ఈ విషయాలను ఓ సారి నెమరు వేసుకోసువడమే ఈ వ్యాసం ఉద్ధేశ్యం…
మెకాలే విద్యా విధానం పుణ్యమాని మన భారతీయులు నల్లతోలు కప్పుకొన్న తెల్ల ఆలోచనాపరులైయ్యారు. ఇది అందరూ చెప్పుతున్న విషయమే. వారి ప్రభుత్వం నడవడానికి అవసరమైన గుమాస్తాలను తయారు చేసే ఓ ఫ్యాక్టరీ అది. కారణం వారికి వారి ఆంగ్ల భాష తెలిసిన భారతీయులు కావాలి. ఆంగ్లేయులు తమ అవసరం కోసం పెట్టుకొని విద్యావిధానం మన పిల్లల చావుకొచ్చింది. తమ దేశ భాషలోనే విద్యా బోధన చేసే దేశాలు ప్రపంచంలో ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి. ఫ్రాన్స్, జపాన్, చైనా, జర్మనీ దేశాలు తమ దేశ భాషలోనే విద్యను నేర్పినప్పటికి అభివృద్ధిలో ఏమాత్రం వెనకబడిలేవన్నది మనం గమనించాలి. కులీనులు, ధనవంతులు ఎక్కడైనా ప్రభుత్వ పక్షమే ఉంటారన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి వారు తమ పిల్లలను ఆంగ్ల చదువులు చదివించి బ్రిటిష్ కొలువులు సాధించారు. బారిష్టర్, ఐసిఎస్ లాంటి ఉన్నత చదువులు చదివి వారికే ఊడిగం చేయడానికి ఉపయోగపడ్డారు. ఈనాటికి కూడా ఆ విద్యా విధానం గుమాస్తాలను తయారు చేసే విధానమేనని ఎంతో మంది విద్యావేత్తలు అంటూనే ఉన్నారు. కారణం ఇందులో విద్యార్థి అభిరుచులకు ఎంతమాత్రం తావులేదు. తల్లిదండ్రుల కోరికలకే ఎక్కువ విలువ. ఉంది.ఇందులో ఎక్కువ డబ్బు సంపాదించే ఇంజనీర్స్, డాక్టర్ కోర్స్ లనే చదువాలనే తల్లిదండ్రులు విధమైన నియంతృత్వ పోకడ ఇమిడి ఉంది. అందుకే ఈనాడు చాలా మంది పిల్లలు సమాజంలో గానీ, చుట్టుపక్కల వారితో గాని అడ్జెస్ట్ కాలేక ఆత్మహత్యలు చేసికొంటున్నారు. ఈనాడు విద్యార్థుల మనసులలో ఒక విధమైన సంఘర్షణ తలెత్తుతున్నది. తరగతి గది చదువే గానీ ప్రాక్టికల్ జ్ఞానం లేక కొలువులు పొందినా కూడా అక్కడా ఇమడలేక ఆత్మహత్యలు చేసికొంటున్నారు. ఇదంతా అర్థం గాని ఇంగ్లీష్ విద్యా విధాన పుణ్యమే.
ఆంగ్ల మాధ్యమం మన దేశ సంస్కృతిని మూలాలను, ఆచార వ్యవహారాలను, పద్ధతులను, తల్లిదండ్రుల వంశపారంపర్య పునాదులను, విద్యార్థి స్వేచ్ఛను, ఆటపాటలను, దూరం చేస్తుంది. ఈ విద్యావిధానం కేవలం తెల్లని బాయిలర్ కోళ్ళలను మాత్రమే తయారు చేస్తుంది. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేయకుండానే రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో, అన్ని స్థాయిలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి వాటి బాగోగులను ప్రభుత్వం ముందు ముందు చూడలేని పక్షములో ప్రజలలో ప్రైవేటు పాఠశాలలను మించినవి లేవనే “అపోహ “కలుగుతుంది. అలాంటి అపోహ కలిగించి పిల్లల, తల్లిదండ్రుల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ఎత్తు వేయడం లేదుగదా ? ఎలాంటి అభ్యాసం చేయకుండా, చక్కని వేదిక నిర్మాణం చేయకుండా, నాయకులకు రాత్రికి రాత్రే కలిగిన ఆలోచనలను పిల్లల మీద రుద్దితే, వారు మీ మీద ఉన్న నమ్మకంతో మీడియం మారి ఎందుకూ పనికి రాకుండా పోతారు. దున్నపోతు ఈనిందంటే దొడ్డిలో కట్టివేయమన్న చందంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణలు ఇవ్వకుండానే, భాషానైపుణ్యాలను కలిగించకుండా, పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పన చేయకుండా, వచ్చే విద్యా సంవత్సరంలో ఆంగ్ల బోధనలోకి విద్యార్థులను అందరిని మళ్ళిస్తే వారు రెంటికి చెడ్డ రేవడి లాగా అవుతారన్న సత్యం ఇదివరకే కొన్ని సంవత్సరాల కింద మనకు అనుభవం లోకి వచ్చింది.
తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమాన్ని కోరుతున్నారని 2003 ప్రాంతంలో రాష్ట్రంలో చాలా పాఠశాలను సక్సెస్ పాఠశాలలు అని ఓ కొత్త పేరు మార్చి “పాత సీసాలో కొత్త సార లాగ “ఆంగ్ల మాధ్యామాన్ని ప్రారంభించారు. కాని దీని రూపకల్పన ఆరంభశూరత్వం లాగా జరిగింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు సక్సెస్ పాఠశాలలు గా రూపాంతరం చెందాయి. దీనికి ఉపాధ్యాయులు కూడా సహకరించారు. కారణం రోజురోజుకు పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను ఇలాగైనా కాపాడుకొందామని వారి నమ్మకం. కేవలం పేరు మాత్రమే మారింది కాని మౌళిక వసతులు గాని, ఆంగ్ల బోధన చేసే ఉపాధ్యాయులను గాని , ఇవ్వకుండా కేవలం “నేమ్ ప్లేట్ “మార్చడం వలన కొద్ది కాలంలోనే 90 శాతం పాఠశాలలు మళ్లీ తెలుగు మీడియం లోకి మారిపోయినాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం కొంత ముందస్తు ప్రణాళిక చేయాల్సి ఉంది. అందులో కొన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాము. గతంలో “సక్సెస్ పాఠశాలలు” ఎందుకు సఫలం కాలేదు?. ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు సక్సెస్ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి? అవి ఫేయిల్ కావడానికి కారణాలు ఏమిటి.? ఆనాడు ఆ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఓ కేస్ స్టడీ లాగా సేకరించినారా.? ఇప్పుడు రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం చదివిన ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి ఆంగ్లం మీద పట్టు ఉంది.? వారు ఆంగ్ల భాష చదివి ఎన్ని సంవత్సరాలు గడిచింది.? ఇన్ని సంవత్సరాల గ్యాబ్ తర్వాత వారు ఆంగ్ల భోధన చేయగలరా ? వారి ఐచ్ఛికలు తీసుకొన్నారా ? ప్రజలకు, తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకం కలిగించడానికి కూలంకశమైన ఈ వివరాలను ప్రభుత్వం ముందు ప్రచురించవలసి ఉంది కదా.?
నిజానికి ఈ సక్సెస్ పాఠశాలలు చక్కగా నడిచినవి.ఉపాధ్యాయులు కూడా మానసికంగా సిద్ధమైయ్యారు. బదిలీలలో సక్సెస్ పాఠశాల నుండి మరో సక్సెస్ పాఠశాలకు బదిలీ చేయవలసింది పోయి అన్ని పాఠశాలలకు పోవడానికి అవకాశం ఇవ్వడం వలన సక్సెస్ పాఠశాలకు పోయి ఆంగ్ల బోధన చేయవలసిన అవసరం ఏమున్నదని తెలుగు మీడియం పాఠశాలకు మారుట చేత ఓ గందర గోళం ఏర్పడింది. సక్సెస్ పాఠశాలలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులు కూడా మాకు ఆంగ్ల బోధనా నైపుణ్యం లేదని అందరూ కలిసి ఈ విధానాన్ని అటక ఎక్కించారు. ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలలోనే ఆరవ తరగతిలో ఆంగ్ల మీడియం చదవడం మొదలు పెట్టిన విద్యార్థి పదవ తరగతి వచ్చేటప్పటికి తెలుగు మీడియంలోనే పరీక్ష రాసాడు. ఈ పథకం అమలులో ఉన్న సమయంలో ఆంగ్ల బోధన చేసేవారికి కేవలం పదమూడు రోజులు మాత్రమే శిక్షణా తరగతులు కలిపించారు. కేవలం ఈ 13 రోజుల శిక్షణతోనే ఉపాధ్యాయులు నిష్ణాతులవుతారా ?
1940 ఆ ప్రాంతంలో దేశంలో క్రైస్తవ మిషనరీ పాఠశాలలు కోకొల్లలుగా తెరిసారు. ఆనాడు భారతదేశంలో ముందుచూపు లేని కారణంగా దేశంలో ఎంతో విలువైన వేల ఎకరాల భూములను ఆ క్రైస్తవ మిషనీరీ పాఠశాలలు ఆక్రమించాయి. ఈనాడు కూలీ పని చేసేవారు కూడా ఎలాగు నేను చదువుకోలేదు, నా పిల్లలైనా మంచి చదువులు చదవాలని తన స్థోమతకు మించి పెద్ద పెద్ద కాన్వెంట్ పాఠశాలల్లో చదివిస్తున్నాడు. ఆనాడు దేశంలో మొట్టమొదట ఆంగ్ల పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు కులీన వంశాల వారు మాత్రమే పోటీపడి ఆంగ్ల చదువులు చదివించారు. ఇప్పుడు కూడ ఉన్నత వంశాల వారు ఆంగ్ల చదువులు చదివిస్తున్నారు. కాకపోతే ఇప్పటి తరం వారు పబ్లిక్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. ఉన్నత వంశాల వారు ఏది చేసిన స్టేటస్ సింబల్ గానే ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్ చదువులు చదివి విద్యావంతులై ఉంటారు. వారిలో ఎవరెవరు ఏ ఏ స్థానాలల్లో ఉన్నారు.? ఈ విషయంలో ప్రభుత్వం గాని లేదా ఆ విద్యా సంస్థ గాని ఓ కేస్ స్టడీ చేసి ఫలితాలను నమోదు చేసిందా? ఈ విషయంలో ఆ విద్యాసంస్థలు ఎలాంటి రిపోర్టులు అసలు సేకరించవు ఎందుకంట్ వేల మంది చదివితే పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉండి ఉంటారు.ఇప్పుడు మనం కార్పోరేట్ ప్రచారాన్ని చూస్తున్నాం కదా. ఒకటి ,రెండు ర్యాంకులు వస్తే సంవత్సరమంతా ఊదరగొట్టేస్తారు. విద్యార్థుల ప్రోగ్రెస్ విషయంలో ప్రభుత్వ పాఠశాల అయినా, ప్రైవేటు పాఠశాల అయినా రిపోర్టు ఒకే విధంగా ఉంటుంది. ఈ పిల్లలందరు తమ నిజజీవితంలో ఇంగ్లీష్‌ను ధారాలంగా మాట్లాడుతున్నారా.? అందరు తమ నిజ జీవితంలో ఆంగ్లం మాట్లాడం లేదని తెలిసి కూడా మనమంతా వేళం వెర్రిగా ఆంగ్లం వైపు ఎందుకు పరుగెత్తుతున్నాము?
ప్రతి మానవుని మెదడులో ఓ భాషాయంత్రం ఉంటుందని, మానసిక శాస్త్రవేత్తలు, భాషాశాస్త్ర వేత్తలు అంటారు. అయితే తేడా ఏమిటంటే యంత్ర పరిమాణం కొందరికి ఎక్కువగా ఉంటే మరి ,కొందరికి తక్కువగా ఉంటుంది. దీనిని ఆంగ్లంలో LAD-Language Acquisition device అంటారు. అది మనిషి భాషాసామర్థ్యాలను, గ్రామర్ ను, పదజాలాన్ని, భావ వ్యక్తీకరణను మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువ మోతాదులో ఉన్న వారు తన మాతృ భాషతో బాటు ఇతర భాషలను కూడా ధారాలంగా మాట్లాడగలరు. మనం మన నిజ జీవితంలో ఎంతో మందిని ఇలాంటి వారిని చూసి ఉంటాము. వీరంతా తమ ప్రాథమిక విద్యను మాతృ భాషలోనే చదివి ఉంటారు. ఎందుకంటే ఆంగ్ల పాఠశాలలు లేని సమయంలో కూడా మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వక్తలు పుట్టారు. వీరంతా పెద్ద పెరిగిన కొద్ది ఇతర భాషల మీద పట్టు సాధించారు. ఉదాహరణకు వివేకానంద జీవితమే సాక్ష్యం. ఆయన ప్రాథమిక విద్య బెంగాళీ భాషలో చదివాడు. పై చదువులు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో చదివాడు. తన ఆంగ్ల ప్రావీణ్యంతో అమెరికా చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో అమెరికా వారినే మెప్పించాడు. ప్రపంచమంతటా వేల ఉపన్యాసాలు ఆంగ్లంలో ఇచ్చాడు. పుట్టుకతో ఇంగ్లీషు మాతృభాష కలిగి ఇంగ్లీషు చదివిన వారెంత మంది అనర్గళంగా ఆంగ్లంలో ఉపన్యాసాలిచ్చారు.? ఇప్పటికి ఇంగ్లీష్ చదువుతున్నవారు ఎంత మంది అనర్గళంగా మాట్లాడుతున్నారు.? ఈలాంటి సామర్థ్యం ఉన్నవారు బ్రిటన్, అమెరికా లాంటి ఆంగ్లం మాట్లాడే దేశాలలో ఎంత మంది ఉన్నారు.? పందిని తెచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి మంత్రాలు చదివినంత మాత్రాన అది నంది కాలేదు.కదా! మన మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు గారు “బహుభాషాకోవిదుడు” ఏ భాషలోనైనా మాట్లాడగలడు. ఇది ఎలా సాధ్యమైంది.? ఆయన ఏ భాషలో తన ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు? ఆయనకు చెప్పిన ఉపాధ్యాయులకు ఉన్న డిగ్రీలేమిటి? ఇదంతా “LAD”.మహిమే. ముందు విద్యార్థిలో మరో భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఆశ్చర్యకరమైన విషమేమనగా ఈ జిజ్ఞాస తల్లిదండ్రులకు మాత్రమే ఉంది గాని పిల్లలకు లేదు. ఇలాంటి ఉదాహరణలు మన దేశంలోనివే కోకొల్లలు చెప్పవచ్చు. ఈనాడు ప్రపంచంలో ఎన్నో సంస్థలకు CEO లుగా పని చేస్తున్నవారిలో ఎంతో మంది భారతీయులున్నారు. వారంత తమ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చదివారన్నది జగమెరిగిన సత్యం. రైల్వే కూలీలు ఏమి చదువుకోనప్పటికి దేశం మొత్తం మీద వచ్చి పోయే ప్రయాణికులను చూస్తున్న కారణంగా ప్రయాణికులతో ఏ బెరుకులేకుండా ఆంగ్లంలో గాని, హిందీలగాని మాట్లాడడం మనం చూస్తున్నాం కదా. అంతెందుకు.అసలు ఏ చదులువు లేని పిల్లలు కూడా సమవయస్కులతో కలిసి ఆడుకోవడం వలన ఆ పిల్లల భాషను మాట్లాడుతున్నారు కదా. మన పక్క ఇంటిలో ఇంకొక భాష మాట్లాడే కుటుంబం ఉంటే ఆ భాష మన పిల్లలకు వస్తుందన్న విషయాన్ని మీరు ఏకీభవిస్తారు కదా. అలాగే మన భాష మన పక్కింటి పిల్లలకు కూడా వస్తుందన్నది నిర్వివాదాంశం. ఇదంతా మనలో ఉన్న LAD వల్లనే సాధ్యమవుతుంది. ఈ సూత్రం అన్ని భాషలకు వర్తిస్తుంది.
ఈనాడు పాఠశాలల పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. ఆంగ్ల మాధ్యమం పెట్టితే వాటి మనుగడ సాగుతుందా.?అసలు పాఠశాల హాబిటేషన్ ప్రాంతంలో స్కూలేజ్ పిల్లలెంతమంది ఉన్నారు..? పిల్లల జననాల సంఖ్య రోజురోజుకు ఎందుకు తగ్గుతున్నది.?ఇలా జనాభా తగ్గుతుంటే ప్రతి ఆవాసంలో పాఠశాల తెరవడం సమంజసమేనా?. ఒకసారి పాఠశాలలు పెద్ద ఎత్తున తెరిచి అనతి కాలంలోనే డిగ్రేడ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత డబ్బు వృథా అవుతుంది.? దేశంలో ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఎన్ని పాఠశాలలున్నాయి.?అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ? అలాంటి వారిని పని లేక కూర్చుండబెట్టి జీతాలు ఇచ్చే బదులు ఆ ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్ మీద పంపవచ్చు కదా.? అలాంటి వారు రాష్ట్రంలో ఎంత మంది ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చుని జీతాలు తీసికొంటున్నారు?. అలాంటి హాబిటేషన్లో విద్యార్థులే లేరా ?లేక వేరే ఆంగ్ల పాఠశాలకు పోతున్నారా.?అదే నిజమైతే అక్కడి పోస్టులను శాశ్వతంగా ఎత్తివేసి వేరే పాఠశాలకు ఎందుకు మార్చడం లేదు?.ఒక ప్రాథమిక పాఠశాల నడవాలంటే ఎంత మంది విద్యార్థులుండాలి.?తరగతికి ఒకరు ఇద్దరు లేక ముగ్గురు చొప్పున ఓ ఇరవై మంది విద్యార్థులుంటే పాఠశాల సమర్థవంతంగా నడపగలమా.?ఉన్న పది పదిహేను మందిలో అందరూ క్రమం తప్పకుండా బడికి వస్తారా ?కొంతమంది బడికి డుమ్మా కొట్టితే సదరు ఉపాధ్యాయుడు ఉన్న నలుగురికి సమర్థవంతంగా పాఠం చెప్పగలడని ప్రభుత్వం ఆశిస్తున్నదా?నిజానికి ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చెప్పి ఎలా న్యాయం చేయగలడు. ?ఇది అష్టావధానం,శతావధానాన్ని మించిన పని కాదా ?ఆ ఏకోపాధ్యాయుడికి గణితంతో సహా అన్ని విషయాలు వస్తాయని మనం విశ్వసించగలమా? నిజానికి ఏ ఉపాధ్యాయుడైనా అన్ని విషయాలలో నిష్ణాతుడవుతాడా ?. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుంటే, ఆయన బడికి రాని రోజుల్లో విద్యార్థుల పరిస్థితి ఏమిటి.?ఒక తరగతిలో ఒకరిద్దరే విద్యార్థులుంటే వారి మధ్య పోటీ ఎలా ఉంటుంది. ? అలాంటి సుదూరంగా ఉన్న గ్రామాలకు కూడా పెద్ద పెద్ద నగరాలనుండి పిల్లలను తీసికొని పోవడానికి ప్రైవేటు స్కూల్ వ్యాన్లు ,బస్సులు వస్తున్నాయి కదా.? ఆ పాఠశాలలకు పిల్లలు ఇంటి నుండి ఎప్పుడు పోతారో, ఆ పాఠశాలనుండి పిల్లలు ఇంటికి ఏ సమయంలో వస్తున్నారో తల్లిదండ్రులు గాని, ,ప్రభుత్వం గాని ఏనాడైనా ఆలోచించారా.? తల్లిదండ్రులకు ఆ విషయం ఆలోచించే సమయమెక్కడిది?.పిల్లలు బడికి పోతే తాము చేను పనికి పోదామని చూస్తారు వారు. చేనుపని నుండి తాము ఇంటికి వచ్చాక పిల్లలు ఇంటికి రావడం ఎంతగానో వారికి నచ్చింది.ఈ విషయంలో చదువు మాటేమో గాని పిల్లలను ఆ ప్రైవేటు పాఠశాల వారు మేము పనినుండి వచ్చేదాక చక్కగా చూసుకుంటున్నారని వారు నమ్ముతున్నారు.ఇదే పనిని మన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు చేయలేక పోతున్నారు ? కొన్ని ఊర్లలో ఏ ఫీజు లేని చక్కని సర్కారు పాఠశాలలు ఉన్నకూడా తల్లిదండ్రులు దూరమైనా వ్యాన్ లోనే ప్రైవేటు పాఠశాలకు పంపడానికి మొగ్గు ఎందుకు చూపుచున్నారు?..వారి చదువంతా ప్రయాణంలోనే గడిసిపోతుందని తెలుసుకోరెందుకు.?ఈ విషయాన్ని ప్రభుత్వం చోద్యం చూసినట్లు ఎందుకు చూస్తుంది? ప్రభుత్వం ఇందులో నుండి పాఠమెందుకు గ్రహించదు.? ఈ రోజుల్లో ప్రతి పల్లెటూరిలో పాఠశాలకు సరిపోయే పిల్లల సంఖ్య ఉందా.?.తక్కువ సంఖ్య పిల్లలు ఉన్నప్పుడు ఉపాధ్యాయులు,భవనాలు,పార్టైమ్ వర్కర్లు,ఇతర వసతులు కలిపించడం వలన ఎంత సొమ్ము వేస్ట్ అవుతుందో గమనించారా?.ఈ విషయంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామా ?లేక ఏదో మన వంతుగా ఖర్చు పెట్టాలని ఖర్చు పెడుతున్నామా.?ఇంత దుబారా ఖర్చు పెట్టి ఉత్తమ ఫలితాలు రాబట్టనప్పుడు ప్రైవేటు పాఠశాలల్లాగానే ప్రభుత్వం కూడా ప్రతి ఊరికి వాహనాల సౌకర్యం కలిపించి ఓ కేంద్రీయ పాఠశాలను ఏర్పాటు చేసి సకల హంగులు కలిపిస్తే ఎంత చక్కగుంటదో ఏనాడైనా ఊహించారా ?,ఇలా ఐదు పది ఊర్లకు ఒక కేంద్రీయ పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎంత ఖర్చు మిగులుతుందో లెక్కలు వేసారా? ప్రభుత్వం ఈ వాహనాల సౌకర్యాన్ని ప్రతి పాఠశాలకు కలిపిస్తే ఎన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడతవో ఏనాడైనా ఊహించారా.? దీని వలన ప్రభుత్వం నిర్వహించాల్సిన పాఠశాలల సంఖ్య కూడా తగ్గుతుంది కదా? మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కూడా పెరుగుతుంది కదా ? కొన్ని సంవత్సరాలైన తర్వాత పాఠశాలలు పిల్లలు లేక మూసివేస్తారనే భయం ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు,విద్యార్థులకు కూడా ఉండదు.కదా?తక్కువ పాఠశాలలుండడం వలన పర్యవేక్షణ కూడా బాగుంటుంది కదా?.ఉపాధ్యాయులందరు ఒకే దగ్గర ఉండడం వలన వారిలో జవాబుదారి తనం పెరుగుతుందని ఒప్పుకొంటారా ? కింది పాఠశాలలో బోధన చక్కగా లేకపోవడం వలన విద్యార్థికి ఏమి రావడం లేదని ఇంకో పాఠశాల మీదకు తప్పును నెట్టే అవకాశం ఎవరికి కూడా ఎంతమాత్రం ఈ విధానంలో ఉండదు.కదా? ఎందుకంటే విద్యార్థి తన జీవితాన్ని అక్కడనే ప్రారంభించి అక్కడనుండే పై తరగతులకు వెళ్ళిపోతాడు కదా?
దీనికి మరో వైపు స్వరాజ్యం వచ్చిన తర్వాత అఖిల భారత స్థాయిలో “మాతృభాష”లోనే విద్యను శిశువుకు అందించాలనే లక్ష్యంతో విద్యాభారతి ఏర్పాటు చేయబడింది దీనికి అనుబంధంగా మన తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. విద్యార్థులకు మాతృభాషలో మన సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఆటపాటలను, దేశభక్తిని, పెద్దల పట్ల గౌరవభావాన్ని, విలువలను, బోధించాలన్నది వీటి లక్ష్యం. దేశమంతటా వీటిని ఏర్పాటు చేసి నలబై, యాబై సంవత్సరాలవుతున్నది. 2010 వరకు ఓ వెలుగు వెలిగాయి. అందులో సమాజంలోని అన్ని వర్గాల వారు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను శిశుమందిరాలలోనే చదివించారు. ఇంత పెద్ద కాలగమనంలో దేశం మొత్తం మీద ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో “మాతృ భాష” తెలుగులో చదివి పై స్థాయికి వెళ్ళి ఉంటారు. మీరు ఏ రంగంలో చూసిన, ఏ ఉద్యోగంలో చూసిన, ఏ దేశంలో చూసినా, మీకు “శిశుమందిర్” విద్యార్థులే కనిపిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకు సంస్కారాలు అందించడంలో శిశుమందిరాల తర్వాతనే మిగతా పాఠశాలలు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఏకీభవిస్తున్నారు. వీరంతా శిశుమందిరంలో తెలుగు మీడియంలోనే (మాతృ భాషలోనే) చదివారన్నది సత్యం. తెలుగు మీడియంలో చదివి అందరితో పోటీ పడుతుంటే ఆంగ్లం చదివితేనో అవకాశాలొస్తాయని అనడంలో ఔచిత్యం ఏమిటి.? ఎప్పుడైతే తల్లిదండ్రులలో ఆంగ్లం పట్ల మోజు పెరిగిందో ఆనాటి నుండి శిశుమందిరాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది.కొన్ని శిశుమందిరాలు మూతబడ్డాయి కూడా. ఎందుకంటే ఆ విద్యాసంస్థలు లాభాపేక్షతో ఏర్పాటు చేసినవి కావు.ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేసినవి. ఈ విపత్కర సమయంలో సమాజంలో విలువలతో కూడిన విద్య అందించడం అందని ద్రాక్ష అయ్యింది. ఈనాడు సమాజం పెక్కు రుగ్మతలకు నిలయమైంది. దీనివలన సమాజంలో విలువలు లోపించినట్లు తెలిసిపోతున్నది. ఇలాంటి సన్నివేశాలను చూడడం శిశుమందిరాల లక్ష్యం కానేకాదు.అందుకని శిశుమందిరాలు మళ్ళి దేశంలో ఆంగ్ల మాధ్యమం ద్వారా నైనా పిల్లలకు విలువలు చెప్పవలసిందేనని తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాయి. ఇప్పుడిప్పుడే అవి నిలదొక్కుకొంటున్నాయి.అందులో విలువలు,సంస్కారాలు నేర్చుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఆ శిశుమందిరాల బాగోగులు చూస్తున్నారు. అలాగని మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా ఆంగ్లంలో తర్ఫీదు ఇస్తూనే మంచి పౌరులను తయారు చేస్తున్నాయి. కాని ఇదే సమయంలో మీరు ప్రైవేటు పాఠశాలలను గమనిస్తే విద్యార్థి తెలుగు ఉచ్ఛరిస్తే పెనాల్టీ వేస్తారు.దీనివలన విద్యార్థి పాఠశాల ఆవరణలో అసలు మాట్లాడనే మాట్లాడడం లేదు. తల్లిదండ్రులు వేలకువేలు ఫీజులు కట్టి విద్యార్థిని మూగ వానిగా తయారు చేయడానికా ప్రవేటు పాఠశాలకు పంపేది.? ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో నయం. విద్యార్థిని అన్ని విషయాలలో చాలా ప్రోత్సహిస్తాయి. అక్కడ విద్యార్థి ఎంత ఎదగాలనుకొంటే అంత ఎదగగలడు.
ఆంగ్లంలో చదివితేనే అవకాశాలన్నీ మన ముందు వాలుతాయనే అపోహను మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే 1970 ప్రాంతంలో మా బంధువుల కుటుంబాలు కొన్ని వరంగల్ పట్టణానికి కేవలం పిల్లలకు విద్య అందించడానికే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి చాలా కుటుంబాలు పోయినాయి. అలా వెళ్ళిన కుటుంబాలలో ఒక కుటుంబం తప్పా, మిగతా అన్ని కుటుంబాల పిల్లలందరు ఆనాడు వరంగల్ నగరంలో పేరుమోసిన ఆంధ్ర విద్యాభివర్ధిని (AVV) జూనియర్ కాలేజీలో మొదట ఆరవ తరగతిలో చేరారు.వారంతా అందులోనే ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఇది పక్కా తెలుగు మీడియం పాఠశాల. కాని ఒకే ఒక్క కుటుంబం మాత్రమే పట్టణంలో తమ పిల్లలను (నలుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు) పేరుమోసిన “ డట్టన్స్(DOTTANS) “ ఇంగ్లీష్ మీడియమ్ పాఠశాలలో చేరిపించారు. మేము ,వారు ఒకేసారు బడికి వెళ్ళేవారము. పక్కపక్కనే ఉండేవారము. ఆ పిల్లలు టిప్ టాప్ గా తయారై పోతుంటే అందరం వింతగా చూసేవారము. తెల్లని బాయిలర్ కోళ్ళు రోడు మీద పోతున్నట్టు అనిపించేది. మా అందరిది ఒకే ప్రాంతం. ఒకే కుటుంబ నేపథ్యం. అన్నీ వ్యవసాయ ఆధారిత కుటుబాలే. ఎవరి తల్లి దండ్రులు కూడా పెద్దగా చదువుకోలేదు. నిజానికి ఆ డట్టన్స్ పాఠశాల అబ్బాయిల పెద్దనాన్నే ఎలిమెంటరీ టీచర్. అక్కడ తెలుగు మీడియంలో చదివే వాళ్లం సుమారు పదిమందిమి. మాది ఓ హాస్టల్ అనుకోండి. మన జిల్లాలో చదవడానికి సరియైన వసతులు లేని కారణంగా ఆనాడు వరంగల్ పోయాము. ఈనాడున్నట్టు ఆనాడు పల్లెపల్లెకో ఉన్నత పాఠశాల లేదు. కాని సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చదువులు అయ్యిపోయాక తేలిన విషయం ఏమిటంటే ఆ ఇంగ్లీషు మీడియం చదివిన ఏడుగురు ఏ ఉద్యోగం చేయడం లేదు. అదే సమయంలో తెలుగు మీడియం చదివిన పదిమంది రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో కొందరు రిటైర్డ్ కూడా అయ్యారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వారిలో కూడా చివరకు ఒకరికి(చిన్నవాడికి) గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. వారి తండ్రి టీచర్ కదా.ఆయనను ఇన్పార్మర్ అని నెక్స్లైట్లు చంపడం వలన కారుణ్య నియామకంలో ఓ గుమస్తా ఉద్యోగం వచ్చింది. మరి వీరంతా యాబై సంవత్సరాల కిందనే ఎవరూ చదవని సమయంలో ఇంగ్లీష్ మీడియం చదివారు కదా. ఆ రోజుల్లో ఆంగ్లం చదివిన వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇప్పుడున్నట్టు ఆనాడు ఐటీ ఉద్యోగాలు లేకపోవచ్చు. కాని ఇంగ్లీష్ చదివిన వారు గ్రూప్స్ ,సివిల్స్ ,ఉద్యోగాలు ఎక్కువగా సెలెక్ట్ అయ్యేవారు. మరి LKG నుండి ఇంగ్లీష్ చదివిన వీరెందుకు ఏ ఉద్యోగం చేయలేకపోయారు.? కారణం కుటుంబ నేపథ్యాన్ని చూడాలి ఆ కుటుంబంలో ఎవరికి ఇంగ్లీషు రాదు. ఒక్క టీచర్ తప్ప ఇంకెవరు అసలు ఆ కుటుంబంలో చదువుకోనేలేదు. అది కూడా ఆయన చదువుకొన్నది స్వాతంత్ర్యానికి పూర్వం ఏడవ తరగతి. అక్కడ పాఠశాల నుండి వచ్చాక పిల్లల చదువులను చూసేవారే లేరు..ఇంటిలో పర్యవేక్షణ లేక పోవడం వలన పోయామా, వచ్చామా, అన్నట్లు నడిచింది. అందుకే విద్యార్థికి భావ ప్రకటనా నైపుణ్యాలు కావాలి. ఏ బాలుడైతే ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుతాడో అతనికి వేరొక భాష నేర్చుకోవడానికి సులభం అవుతుంది.ఆ విషయమే LAD చెపుతుంది.కావున ఆంగ్లంలో చదివినోళ్ళందరికి సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయని అనుకోవద్దు. ఇది తెలుగు మీడియం కైనా,లేక మరే మాతృ భాషకైనా వర్తిస్తుంది. ఎందుకంటే తెలుగు మీడియం చదివిన వారు కూడా సరిగా చదవలేకపోతున్నారు. రాయలేక పోతున్నారు. చిన్న, చిన్న లెక్కలు చేయలేక పోతున్నారు. స్వభాషలోనే ఆ పరిస్థితి అలా ఉంటే పరాయి భాషలో ఎలాఉంటుందో అంచనా వేయండి.?
ఇంకొక చిన్న సంఘటన జరిగినదే వివరించి ముగిస్తాను. నేను నా వృత్తిలో భాగంగా బి.ఈడి చేసే సమయంలో సాంఘికశాస్త్రంలోని చివరి పాఠ్యాంశం పంటలు – ధాన్యాలు అను పాఠం చెప్పడానికి హన్మకొండ లోని మర్కజీ హైస్కూల్ కెటాయించారు. నేను ఉండేది గ్రామీణ ప్రాంతం కావున పంటలు అన్ని లభిస్తాయి. పాఠం చెప్పడం సులువు అవుతుందని వివిధ రకాల ధాన్యాలు సేకరించి చిన్న చిన్న అరుకు కవర్లలో పోసి పొట్లాలు కట్టి, లోపల వాటి పేర్ల రాసి పెట్టి పట్టుకు పోయాను. ఆ పట్టణపు పిల్లలు ఆ ధాన్యాలను ఇదివరకెన్నడూ చూసి ఎరగరు. ఆ ధాన్యాలనుండే మనం తినే ఆహార పదార్థాలు వస్తాయని వారికి తెలియ పోవడం విడ్డూరమే. ఇంకేముంది.నా పాఠం పక్కకు పోయింది. పిల్లలంతా ఆ ప్యాకెట్లు చూడడానికి ఎగబడ్డారు. అబ్జర్వరు నా పరిస్థితిని గమనించి వారికి అందరికి చూపించి వెల్లండని చెప్పి బయటకు పోయాడు. ఏ గింజ నుండి ఏ పదార్థం వస్తుందో ఈనాటి పట్టణ పిల్లలకు తెలియడం లేదు. మనం తినే బియ్యం వడ్ల నుండి వస్తాయంటే పిల్లలు బిక్కమొహం వేస్తున్నారు. బియ్యం గింజను భూమిలో పాతి పెట్టితే బియ్యం చెట్లు మొలుస్తాయని వారు అనుకొంటున్నారు. ఈనాడు పెద్దపెద్ద చదువులు చదివిన వారు కూడా పల్లికాయలు చెట్టుకు ఎక్కడ కాస్తాయో తెలియక చెట్టును అటూ ఇటూ తిప్పి చూస్తున్నారు. అవి భూమిలో ఉంటాయని వారికి తెలియక పోవడం వారి తప్పు కాదు .అది మన చదివే చదువుల తప్పు. క్షేత్ర పర్యటనలుంటే ఈ సమస్య రాకపోవును.నిజానికి ఇదంతా ఆంగ్ల మాధ్యమం తెచ్చిన తంటా. విద్యార్థి రెండు భాషలలో ఒకే వస్తువును పోల్చుకోలేక పోతున్నాడు.
చివరగా సంబంధ బాంధవ్యాల గురించి కూడా మాట్లాడుకొంటే ఇది సంపూర్ణమవుతుంది. మన మాతృభాషలో ఉన్నట్లు ఆంగ్లంలో చుట్టరిక సంబోధనలు విపులంగా లేకపోడం వలన పిల్లవాడు మగవారినందరి అంకుల్ అని, ఆడ వారినందరిని ఆంటీ అని పిలుస్తాడు. దానివలన చిన్నమ్మకు , అత్తమ్మకు ,పెద్దమ్మకు మధ్య బేధం గ్రహించలేకపోతున్నాడు. అదే విధంగా పినతండ్రికి, పెద్దనాన్నకు, మామయ్యకు మధ్య తేడాను తెలుసుకోలేక పోతున్నాడు. దీని వలన సంబోధనలో ప్రేమ, ఆప్యాయతలు పుట్టడం లేదు. అందువలన అంకుల్ మనస్సులో అనాగరికం పుట్టుతున్నది. ఈ సామాజిక రుగ్మతలు పరభాషా వ్యామోహం వలన పెచ్చుపెరిగి పోతున్నాయి.
ఇంగ్లీష్ చదువుతో పేదరికాన్ని అంతంచేయ వచ్చని కొందరు సెలవిస్తున్నారు. కాని ఇంగ్లీష్ చదువులే ఖర్చుతో కూడుకొన్నవి. చిన్న కుటుంబాలు మొదటి నుండి అధిక ఫీజులు కట్టుతూ పదవ తరగతి వరకు అతి కష్టంగా నెట్టుకొచ్చి పిల్లవాడి క్యారియర్ కు అవసరమైన ఉన్నత చదువుల సమయంలో తండ్రి ఇక నాకు చేత కాదని చేతులు జారేసిన సంఘటనలు మన ముందు ఎన్నో ఉన్నాయి. అంబేద్కర్ సమయంలో ఉన్న అంటరాని తనం కాని, పేద ,ధనిక భావనలు గాని ఇప్పుడు లేవు. తరగతి గదిలో అందరు సమానంగా కూర్చుంటున్నారు. పాఠశాలలో అసలు పేద,ధనిక భావనే మనకు కనిపించదు. కాని చదివే వారు, చదవని వారనే బేధాలైతే ఉపాధ్యాయులు పాటిస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయుడికున్న పాడు రోగం ఏమనగా విద్యార్థి ఏ కులం వాడైనప్పటికి తెలివిగల విద్యార్థి పట్ల పక్షపాతం చూపిస్తాడు. అది అంబేద్కర్ సమయంలో కూడా రూఢీ అయ్యింది. ఉద్యోగాలకు ఆంగ్లం అక్కరకు వస్తే వస్తుంది కాని వ్యాపారాలకు ఎలా పనికి వస్తుందో ఆ దేవునికే తెలియాలి. బహుషా బ్యాంకు లావాదేవీల దగ్గర ఆంగ్లం మాట్లాడితే మేనేజర్ పిలచి కూర్చోమంటాడేమో కాని కిరాణా దుకాణం దగ్గర మాత్రం వచ్చిన కస్టమర్ తో ఇంగ్లీషు అవసరముంటుందా? అక్కడ దుకాణ యజమాని ఇంగ్లీషులో మాట్లాడితే వచ్చిన కష్టమర్ మరొక సారి వస్తాడా ? అలాకాకుండా కస్టమరే ఇంగ్లీశులో మాట్లాడితే దుకాణదారుకు ఆంగ్లం వచ్చి ఉండాలి కదా.భాష అనేది భావాన్ని పంచుకొనే సాధనం.అది మర్చి పోయి అంతటా ఇంగ్లీషు అంటే ఎలా?
ఏతావాతా తేలినది ఏమనగా ఆంగ్లం చదివిన వారందరు గొప్పస్థాయిలో లేరు. అలాగే మాతృభాషలో చదివిన వారంతా అనామకులుగా లేరు. చాలా ఉదాహరణలను పరిశీలిస్తే ప్రాథమిక విద్య తప్పనిసరి మాతృభాషలోనే జరిగితే విద్యార్థిలో భాషాకౌశలాలు పెరుగుతాయి. ఆ కౌశలాలు మరో భాషను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. చదువు మధ్యలో ఆపి వేసేవారికి మాతృభాషనే పెన్నేరుగడ్డ లాంటిది.ఆంగ్ల భాష ప్రవేశ పెట్టాలనుకొంటే కేంద్ర పాఠశాలలు మాత్రమే ప్రారంభించి విద్యార్థులను చేరవేయడానికి వాహన సౌకర్యాలను కలిపించాలి.
ఫిబ్రవరి 21- అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం