Home News పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం

పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం

0
SHARE

పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి.  ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం.  భారతీయ మహర్షులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటినీ కూడా భగవంతుడే సృష్టించాడు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. దానిని మనం అర్ధం చేసుకోవాలి.

పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతీ చోట వీటి సాంద్రత పెరిగి, పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది.

 నేడు ఈ పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది, దీనికి కారణం కాలుష్యం.  దీన్నే ఆంగ్లంలో పొల్యూషన్ అంటారు. కాలుష్యానికి అర్థం పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించడమే.

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చరిత్ర ప్రాచీనమైనది.

(క) హరప్పా నాగరికత సంస్కృతి పర్యావరణహితమైనదిగా ఉంది . వైదిక సంస్కృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది.

(ఖ) తీజ్ లాంటి పండుగలు పర్వదినాలు జరుపుకోవడం హిందూ సంస్కృతి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హోలీ, దీపావళి, శరత్ పూర్ణిమ, వైశాఖి, మకర సంక్రాంతి, జన్మాష్టమి,రామ నవమి వంటి పర్వదినాలు ఆయా ఋతువులను అనుసరించి ప్రకృతి గొప్పతనాన్ని, సౌందర్యాన్ని మనకు తెలియచేస్తాయి.

 (గ)  భారతీయ మహర్షులు యావత్ ప్రకృతిని, ప్రాకృతిక శక్తులను దైవ స్వరూపాలుగా ఆరాధించారు. సౌరశక్తిని సూర్యదేవునిగా కొలిచారు. భారతీయ సంస్కృతిలో జలాన్ని కూడా దేవీ స్వరూపంగా భావించారు. నదులను జీవనదాయిని అయిన మాతలుగా భావించారు. అందుచేతనే ప్రాచీన సంస్కృతి నదీ తీరాల వెంబడి ఉద్భవించి ముందుకు కొనసాగింది.

(ఘ) భారతీయ సంస్కృతిలో అరటి, రావి, మర్రి, తులసి, మామిడి మొదలైన చెట్లను పూజిస్తారు

(జ్ఞ) మధ్యయుగపు, మొగలు పరిపాలన కాలపు భారతదేశంలో పర్యావరణంపై ప్రేమపూర్వక వాతావరణమే నెలకొని ఉండేది.

(చ) ఆంగ్లేయులు తమ స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశంలో పర్యావరణాన్ని నాశనం చేయడం ప్రారంభించారు. వారి విధ్వంసకర విధానాలవల్ల భారతదేశంలో పర్యావరణం దెబ్బతింది.

(ఛ) భారత రాజ్యాంగం 1950 లో అమలులోకి వచ్చింది. కానీ అందులో పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అధికరణలు జోడించబడలేదు.1972లో జరిగిన స్టాక్ హోమ్ సమ్మేళనం కారణంగా భారతదేశం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం ఆరంభించింది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణలో అధికరణం 48A, 51A లను జోడించారు.

(జ) అధికరణం 48 ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు, వాటిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి.

(ఝ) అధికరణం 51A/6  పౌరులు పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధికి తోడ్పడుతూ వన్య జీవుల పట్ల సహానుభూతిని కలిగి ఉండాలని తెలుపుతుంది.

జూన్ 5 ప్రత్యేకత ఏమిటి?
జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు(UNEP) నిర్వహిస్తూ జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ సమ్మేళనం ఒకటి నిర్వహించింది. అన్ని దేశాలను ఆహ్వానించింది. స్వీడన్ లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు?

  1. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం.
  2. ఐక్యరాజ్యసమితికి చెందిన సద్భావనా రాయబారులు (బ్రాండ్ అంబాసిడర్స్) పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు కావాలని ప్రజలకు సందేశం పంపుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ ప్రతినిధులుగా మారి వాస్తవ పరిస్థితులు, జల వాయు కాలుష్యం ఎదుర్కోవడానికి ఉపాయాలను ఆలోచిస్తారు.
  3. మనమంతా మెరుగైన భవిష్యత్ కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు –

  1. జల కాలుష్యం
  2. వాయు కాలుష్యం
  3. భూ కాలుష్యం

జల కాలుష్యం

భూగోళంపై 80శాతం జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యలవల్ల పనికిరాకుండా పోతోంది. దీనివల్ల  కేవలం మనుషులేకాక సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భూగర్భజల కాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకం. జలాన్ని సంరక్షించడం,  పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. కానీ తల్లిగా భావించే గంగ, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి మనకు తెలియంది కాదు. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం, పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. కాబట్టి నదులను కాపాడుకోవడానికి మనమంతా సంకల్పబధ్ధులం కావాలి.

పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికి వేయడం కారణంగా నీటిని సంరక్షించే వృక్షజాతులు తరిగిపోయి అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి పట్టణాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. నదుల కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని సంరక్షించుకోవాలి.

వాయు కాలుష్యం

   ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి, ప్రాణవాయువు తగ్గిపోతోంది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90% ప్రజలు కలుషితమైన వాయువులు పీలుస్తున్నారు.  దీని కారణంగా అనేక రకాలైన శ్వాస రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

భూ కాలుష్యం

మనిషి పుణ్యదాయిని, పవిత్రమైన భూమిని తన స్వార్థ ప్రయోజనాలు, సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు.  గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. మన దేశంలో ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతోంది. వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. పశుపక్ష్యాదులు వీటిని తినడం వల్ల చనిపోతున్నాయి.  ప్లాస్టిక్ కాలుష్యం ప్రమాదానికి సంకేతం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్ లో  ఏటా యాభై ఆరు లక్షల టన్నుల చెత్త పోగు పడుతోంది.  ఇలా 2020 నాటికి పేరుకునే 12 బిలియన్ టన్నుల చెత్తని శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ మార్గాలు

పెరుగుతున్న ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడానికి చైనా ఈ సంవత్సరం జనవరి నుండి ప్లాస్టిక్ ఉత్పత్తుల పై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్ లో 2016 లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు మొదలైనవాటిపై 2020 వరకు పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్ పై నిషేధం విధించకుండానే  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగిన దేశం ఐర్లాండ్. భారీగా జరిమానాల మూలంగా ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 94 శాతం తగ్గిపోయింది. మలేషియా కూడా వివిధ దేశాలనుండి ప్లాస్టిక్ నియంత్రించింది.

కాలుష్య నియంత్రణకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం

పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదం. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 10 మార్చి 2019 లో జరిగిన ప్రతినిధుల సభలో ఒక నిర్ణయం తీసుకుంది. సంఘం పర్యావరణ పరిరక్షణ సంకల్పాన్ని ప్రారంభించింది. స్వయంసేవకులు తమ తమ స్థాయిలో క్షేత్రాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తూనే సమాజాన్ని జాగృతం చేస్తారు. నిర్ధిష్టమైన పద్ధతిలో కార్యక్రమాలు కూడా చేపడతారు. సంఘ్ దేశవ్యాప్తంగా విభిన్నమైన గతివిధుల సహకారంతో పనులు చేపడుతోంది.

2018 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 15 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు చేపట్టిన ఒక అభియాన్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా మొక్కలు నాటారు. పరిసరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నీడనిచ్చే, ఔషధ గుణాలున్న మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ లోని ప్రతి ప్రాంతంలో చేపట్టారు. దీనిలో స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, సామాజిక సంస్థలు,  ప్రముఖ వ్యక్తులు, విద్యాలయాలు, ఇతర శిక్షణా సంస్థలను భాగస్వాములు చేశారు.  స్థానికంగా ప్రజల సహకారంతో పర్యావరణ కమిటీలు ఏర్పాటు చేసి నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అప్పగించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యమాన్ని 2016 జూన్ 20న ప్రారంభించింది. పట్టణాలలో పెరుగుతున్న కాలుష్యానికి దృష్టిలో ఉంచుకొని ఐదు వేల కంటే ఎక్కువ మొక్కలు నాటడానికి సంకల్పించారు.  ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తూ 93 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంఘ్ జీవనాన్ని ప్రసాదించే మాతృ స్వరూపంగా ప్రకృతిని భావిస్తూ, ఆ ప్రకృతిని రక్షించే బాధ్యతను పోషించడం  కర్తవ్యంగా భావిస్తోంది.

(5 జూన్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)