ఉమ్మడి పౌరస్మృతి ఆలోచన వాయిదా పడడానికీ, అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిది అన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్‌కు వచ్చిన యోచన. ఆనాటి పరిస్థితులను బట్టి అది అనివార్యమేననిపిస్తుంది. భారత్-పాక్ విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టం. 1946 నుంచి ముస్లిం లీగ్ చేసిన హత్యాకాండ, ఇచ్చిన బెదిరింపులు అలాంటి అభిప్రాయానికి రావడానికి దోహదం చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. అప్పటికే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రకటన ఉంది. ‘హిందువుల కాంగ్రెస్ ప్రభుత్వం’ ముస్లింలను ఇక్కడ ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా బతకనివ్వదు. భారతదేశంలో మతం ఆధారంగా వివక్ష తప్పదు. అలాంటి పరిస్థితులలో ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశిక సూత్రాలలో చేర్చడమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో అయినా అలాంటి చట్టాన్ని రూపొందించి అమలు చేయడానికి ఒక ఆశ అంటూ ఉంటుంది’ అన్నారు.
అయినా వివిధ సందర్భాలలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం దేశ ప్రజల అనుభవానికి వస్తూనే ఉంది. రాజకీయ చర్చలు, చట్టసభలలో వాగ్యుద్ధాల స్థాయి నుంచి ఎన్నికల హామీ వరకు అది ప్రయాణించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నవంబర్ 23,1948న తొలిసారి ఉమ్మడి పౌరస్మృతి రూప కల్పన ఆలోచన తెరమీదకు వచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో ఈ ప్రస్తావన తెచ్చినవారు కాంగ్రెస్ సభ్యుడే. ఆయన పేరు మీను మసానీ. బొంబాయి నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మసానీ చర్చకు తెచ్చిన ఈ అంశం ఒక కుదుపు కుదిపింది. ఆఖరికి ఆర్టికల్ 35లో పొందుపరిచారు.
రాజ్యాంగ పరిషత్‌లో మహిళా సభ్యుల నుంచి ఉమ్మడి పౌరస్మృతికి బలమైన మద్దతు లభించింది. హన్సా మెహతా సహా 15 మంది దీనిని సమర్ధించారు. ప్రాథమిక హక్కుల విభాగానికి చెందిన హన్సా మహిళలతో ఉమ్మడి పౌరస్మృతి కోసం అందరినీ ఒక జట్టుగా కూర్చారు కూడా. ఆ క్రమంలోనే రాజకుమారి అమృత్ కౌర్, డాక్టర్ అంబేడ్కర్, మీనూ మసానీ, కేఎం మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉమ్మడి పౌరస్మృతి కోసం గట్టిగా వాదించారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు పలికింది. అందులో ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. ఉమ్మడి పౌరస్మృతిలో భారతదేశం సంతరించుకునే అంశాలుగా వీరు చెప్పినవి- స్త్రీ పురుష సమానత్వం, జాతీయ సమైక్యత, సమగ్రత, సెక్యులరిజం, వ్యక్తిగత హక్కుల రక్షణ, న్యాయవ్యవస్థ ఆధునీకరణ, భిన్న భిన్న ఆచారాల సమన్వయం. ఇవాళ వాళ్ల వారసులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అదే ఉమ్మడి స్మృతిని తిక్క వాదనలతో, విధ్వంసక ధోరణితో వ్యతిరేకిస్తున్నది.
మద్రాస్ నుంచి రాజ్యాంగ పరిషత్‌కు వచ్చిన మహమ్మద్ ఇస్మాయిల్ రాజ్యాంగ పరిషత్‌లోనే ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించినవారిలో మొదటివారు. నజీరుద్దీన్ అహ్మద్, మెహబూబ్ అలీ బేగ్, బి పొకార్ సాహెబ్, అహమ్మద్ ఇబ్రహీం హస్రత్ మొహానీ ఆయన వెనుక నిలిచారు. ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వారు ఎన్నుకున్న నినాదం- ఇంక్విలాబ్ జిందాబాద్. చిత్రం కదా! ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది భగత్‌సింగ్ నినాదం. అర్థ్ధం- విప్లవం వర్ధిల్లాలి. వీళ్ల వ్యతిరేక వాదనలోని అంశాలు- తమ మత, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడు కోవడం, ఉమ్మడి పౌరస్మృతి వస్తే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పడం, భిన్నత్వాన్ని సంక్లిష్టం చేసే ప్రమాదం, సాంఘిక అశాంతికి అవకాశం; భిన్నత్వం, బహుళత్వాల రక్షణ.
——
ఎవరేమన్నారు!
పర్సనల్ లాలు తెచ్చి పెట్టే వివక్షను నిర్మూలించడానికి, స్త్రీపురుష సమానత్వాన్ని సాధించడానికి యూసీసీ కావాలి సమగ్ర పౌర చట్టాన్ని ఆయన కోరారు. దాని ప్రకారం అందరికి సమాన హక్కులు, వివాహం, విడాకులు, వారసత్వ హక్కుల విషయంలో మహిళలకు హక్కులు దక్కుతాయి.
– డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (రాజ్యాంగ ముసాయిదా సంఘ అధ్యక్షులు)
స్త్రీపురుషుల మధ్య సమన్యాయానికీ, సమాన హక్కులకీ యూసీసీ ఉపకరిస్తుంది. యూసీసీ అమలులో కొన్ని సవాళ్లు ఉన్నా న్యాయ విధానాన్ని ఆధునికం చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా యూసీసీని తీసుకువచ్చేందుకు పాటుపడాలి.
– డా. రాజేందప్రసాద్ (రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు)
మతం ఆధారంగా ఉండే పర్సనల్ లాల స్థానంలో సంఘ సంస్కరణ కోసం, ఆధునీకరణ కోసం యూసీసీ అవసరం. సెక్యులరిజానికి, వ్యక్తిగత హక్కుల రక్షణకు అది ఉపకరిస్తుంది. సమైక్యంగా సాగదలిచిన పురోగమన జాతికి అది అవసరం.
– జవాహర్‌లాల్ నెహ్రూ (ప్రథమ ప్రధాని)
వర్గాలు, మతాల ఆధారంగా ఉండే పర్సనల్ లాల తెచ్చే విభజనను నివారించి, జాతీయ సమగ్రతకు దోహదం చేస్తుంది. మతం, సామాజిక నేపథ్యాలతో పనిలేకుండా పౌరలందరికీ వర్తించే ఒక చట్టం ఉండాలి.
– సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, (డిప్యూటీ ప్రధాని, కేంద్ర హోం మంత్రి)
మహిళకు న్యాయం జరగడానికీ, డేశ పౌరులందరికీ ఒకే చట్టం కోసం యూసీసీ అవసరమే. ఒక సమగ్ర పౌర స్మృతి వల్ల స్త్రీపురుష సమానత్వం, సామాజిక న్యాయం సాధించవచ్చు.
– అల్లాడి కృష్ణస్వామయ్యర్, (రాజ్యాంగ పరిషత్ సభ్యులు, అడ్వకేట్)
మతాల వారీ విభజనను నివారించడానికి యూసీసీ కావాలి. క్రోడీకరించిన న్యాయ సూత్రాలతో ఇది సాధ్యం. పౌరులందరికి సమాన హక్కులు ఇచ్చి, జాతీయ సమగ్రతను కాపాడుతుంది.
– హెచ్‌వి కామత్, (రాజ్యాంగ పరిషత్ సభ్యులు)
మతం ఆధారంగా ఉండే చట్టాలను పక్కన పెట్టి ఆధునిక, ప్రయోజనకరమైన న్యాయ వ్యవస్థను స్థాపించుకోవాలి. మహిళల హక్కుల రక్షణ అవసరాన్ని గుర్తించాలి. యూసీసీ ద్వారా సామాజికమైన పురోగతి సాధ్యమవుతుంది.
– కేఎం మున్షి (రాజ్యాంగ పరిషత్ సభ్యులు)
యూసీసీ అమలులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలి. వాటిని వాస్తవికంగా చూడాలి. సంస్కరణలను దశలవారీగా ప్రవేశపెట్టాలి. పర్సనల్ లాలకు ఉన్న సున్నితత్వం దృష్ట్యా యూసీసీ తేవడంలో సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– ఆచార్య జేబీ కృపలానీ (కాంగ్రెస్ నేత, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు)
భిన్న భిన్న సంస్కృతులు, జీవన విధానం ఉన్న దేశంలో యూసీసీ వంటి చట్టం అమలు గురించి ఆలోచించవలసి ఉంటుంది. యూసీసీ సామాజిక న్యాయాన్ని సమర్థించేదిగా ఉండాలి. మరింత సామరస్యం కలిగిన సమాజ స్థాపన కోసం వివక్షను నిర్మూలించేదిగా ఉండాలి.
– టీటీ కృష్ణమాచారి, (రాజ్యాంగ పరిషత్ సభ్యులు)
వివక్షను రూపుమాపి, మహిళలకు కూడా సమాన హక్కులు వర్తింప చేయడానికి యూసీసీ అత్యవసరం. యూసీసీని రాజ్యాంగం సమర్థ్ధిస్తున్నది. ఇది సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుంది.
– హన్సా మెహతా (సామాజిక కార్యకర్త, రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు)
ప్రతి పౌరుడికీ మతాచారాలతో ఉండే పర్సనల్ లాను అమలు చేయడం సరికాదు. దేశ పౌరులందరికీ ఉమ్మడి చట్టం తీసుకురావడం ప్రభుత్వాల కర్తవ్యం. దీనిని గుర్తించాలి.
– రాజ్‌కుమారి అమృత్‌కౌర్, (రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు)
జాగృతి సౌజన్యంతో…